
ఫిలిం చాంబర్ వద్ద మాధవి లతను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు(ఇన్‌సెట్‌లో హీరోయిన్ మౌనదీక్ష)
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ఫిలిం చాంబర్ ఎదుట మౌనదీక్ష చేసిన హీరోయిన్ మాధవి లతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జన సేన అధినేత పవన్ కల్యాణ్‌పై నటి శ్రీరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఈ చర్యకు దిగారు. బుధవారం ఉదయమే ఫిలిం చాంబర్ వద్దకు చేరుకున్న మాధవి లత.. తలకు, దుస్తులకు నల్లరంగు రిబ్బన్లు ధరించి కార్యాలయం ముందు బైఠాయించారు. పవన్ అభిమానులు సైతం ఆమెతో కలిసి దీక్షలో కూర్చున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లోని కొందరు సభ్యులు కూడా ఆమెకు మద్దతుపలికినట్లు సమాచారం.
పోలీస్ స్టేషన్‌లోనూ దీక్ష కొనసాగింపు: కొద్ది రోజుల కిందట ఇదే ఫిలిం చాంబర్ ముందు నటి శ్రీరెడ్డి చేసిన అర్ధనగ్న నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన దరిమిలా నేటి మాధవి లత దీక్షపై చాంబర్ వర్గాలు ఆందోళన చెందినట్లు తెలిసింది. మాధవి మౌనదీక్షకు కూర్చున్న కొద్దిసేపటికే పోలీసులు రంగప్రవేశం చేశారు. మహిళా కానిస్టేబుళ్లు ఆమెను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తనను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టిన హీరోయిన్.. స్టేషన్‌లోనూ మౌనదీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
శ్రీరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు: కాస్ట్ కౌచింగ్‌పై గళమెత్తి, దానిని చర్చనీయాంశంగా మార్చిన నటి శ్రీరెడ్డి.. ఇటీవలే నటుడు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం తెలిసిందే. తమ అభిమాన హీరోను దూషించిన నటి శ్రీరెడ్డిపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవీ లతకు సంఘీభావంగా దీక్షలో కూర్చున్న పవన్ అభిమానులు.. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment