మీ డాడీకి డబ్బులు బాకీ ఉన్నానంటూ సైబర్ నేరస్తుల టోకరా
వెంటనే స్పందించి నిందితుడి అకౌంట్ ఫ్రీజ్ చేసిన పోలీసులు
బంజారాహిల్స్: మీ డాడీ దగ్గర రూ.2,000 అప్పుగా తీసుకున్నాను..వాటిని ఇద్దామంటే ఆయన మొబైల్ నెంబర్ పోగొట్టుకున్నాను..నీ నెంబర్‌ను అప్పుడెప్పుడో ఫీడ్ చేసుకున్నాను..మీ పేరు, మీ నాన్న పేరు ఇదే కదా? అంటూ ఓ వ్యక్తి తియ్యటి మాటలతో సైబర్ వల విసిరి గృహిణికి అప్పు చెల్లించే ముసుగులో మోసం చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కొత్త రకంగా చక్కటి ప్లాన్‌తో సైబర్ మోసగాడు ఆమెను నమ్మించి మాటల్లో దింపి తికమకపెట్టి రూ.35 వేలు తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్డునెంబర్–1లో నివసించే స్వాగతారాయ్ అనే గృహిణికి సైబర్ మోసగాడు ఫోన్ చేసి మీ డాడి అశోక్‌కుమార్ శర్మకు తాను రూ.2000 బాకీ ఉన్నానని, వాటిని జీపే చేస్తానని ఆమెకు చెప్పాడు.
తన పేరు, తండ్రి పేరు కరెక్ట్‌గానే చెబుతున్నాడు కదా అని ఆమె నమ్మి జీపే చేయమంది. వెంటనే ఆయన రూ.10,000 ఒకసారి, రూ.20,000 ఒకసారి మీ అకౌంట్‌కు పంపించాను, నీకు మెసేజ్ వచి్చంది చూసుకో అని చెప్పాడు. ఆ మేరకు ఫోన్‌కు మెసేజ్ కూడా వచ్చింది. కొద్దిసేపట్లోనే రూ.12,000 మరోసారి పంపించాడు. ఆమెకు ఆ మెసేజ్ కూడా వచ్చింది. రెండు నిమిషాల తర్వాత ఫోన్ చేసి పొరపాటున రూ.40,000 పంపాను..రెండు వేలు కట్ చేసుకుని రూ.38 వేలు తనకు తిరిగి జీపే చేయాలని ఆమెను తికమకపెట్టాడు. బాలింతరాలు అయిన ఆమె ఓ వైపు చిన్నారి ఏడుస్తుండడం, ఇంకోవైపు తన చికాకు..ఈ గొడవలోనే రూ.38 వేలు బదిలీ చేసింది.
మరుక్షణంలోనే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.38 వేలు వెళ్లడం, తన ఖాతా జీరో అని చూపించడంతో వెంటనే ఈ విషయాన్ని భర్తకు తెలిపింది. భర్త వెంటనే గంట వ్యవధిలోనే (గోల్డెన్ అవర్) బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. వెంటనే పోలీసులు ఇది సైబర్ మోసమని గుర్తించి ఆమెకు వచి్చనవి నకిలీ మెసేజ్‌లు అని తెలుసుకుని సైబర్ మోసగాడి ఖాతాను ఫ్రీజ్ చేశారు. గంట వ్యవధిలోనే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో సైబర్ మోసగాడి నుంచి డబ్బులు రికవరీ అయ్యే ఛాన్స్‌ను ఆమె పొందింది. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే గంట సేపట్లోనే గోల్డెన్ అవర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుందని బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment