
తల్లిని చంపిన కొడుకు
ఇంట్లోనే మలమూత్ర విసర్జన చేస్తోందని దారుణం
బంజారాహిల్స్: మంచానపడ్డ తల్లిని ఓ దుర్మార్గుడు కర్కశంగా చంపేశాడు. ఇంట్లోనే మలమూత్ర విసర్జన చేస్తోందని ఆగ్రహంతో ఊగిపోతూ తలను గోడకేసి బాది ప్రాణం తీశాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని దోబీఘాట్ ప్రాంత వాసి కె.రాణీబాయి (70) వృద్ధాప్యం వల్ల మంచం పట్టింది. అవసాన దశలో ఉన్న తల్లికి సేవలు చేయాల్సిన కొడుకు కరణ్‌సింగ్ ఆమెను పట్టించుకోకపోగా.. కొంత కాలంగా తీవ్రంగా వేధిస్తున్నాడు. అన్నం కూడా పెట్టడంలేదు. ఎప్పుడు చస్తావని తరచూ ఆమెను మానసికంగా వేధిస్తున్నాడు.
తీవ్ర అస్వస్థతకు గురైన రాణీబాయి నాలుగైదు రోజుల నుంచి లేవలేని పరిస్థితిలో పడుకున్న చోటే మల మూత్రవిసర్జన చేస్తోంది. దీంతో కోపం పట్టలేక కరణ్‌సింగ్ తల్లిని నేలకేసి కొట్టడంతో పాటు తలను గోడ కేసి బాదాడు. దీంతో ఆ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. కరణ్‌సింగ్ సహజ మరణం పొందిందని చుట్టుపక్కల వారిని నమ్మించి బుధవారం అంత్యక్రియలు నిర్వహించాడు. అయితే, రాణీబాయిని కొడుకు కొట్టడంతోనే చనిపోయిందని ఆమె సోదరుడు రమేష్‌సింగ్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. పోలీసులు కరణ్‌సింగ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.