హీరో వేణుపై కేసు నమోదు
హైదరాబాద్ : అద్దె ఇంటికి ఇచ్చిన అడ్వాన్స్ రూపంలో ఇచ్చిన నగదును తిరిగివ్వకుండా వేధిస్తున్నారంటూ టాలీవుడ్ ప్రముఖ నటుడు వేణు తొట్టెంపుడి దంపతులపై ఇరాన్‌కు చెందిన మహిళ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... డాక్టర్ ఫాతేమీ బేగంపేటలో వైద్యురాలుగా పని చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని జీపీ రెసిడెన్సీలో ఫ్లాట్ నంబర్ 302ను ఏడు నెలల క్రితం సినీ నటుడు వేణు తొట్టెంపుడి నుంచి అద్దెకు తీసుకుంది. ఈ ప్లాట్ నెలసరి అద్దె రూ.29,300కాగా అద్దెకు దిగే ముందు మూడు నెలల అడ్వాన్స్ కింద రూ.88 వేలు చెల్లించింది.
అయితే ఈ నెల 8వ తేదీన తాను ఫ్లాట్ ఖాళీ చేస్తున్నట్లు ఆమె యజమాని వేణుకు తెలిపింది. ఫ్లోరింగ్‌పైన చిన్న బీటలు ఏర్పడ్డాయని వాటిని సరి చేసి ఇవ్వాలని అప్పటిదాకా అడ్వాన్స్ ఇచ్చేది లేదంటూ వేణుతో పాటు ఆయన భార్య అనుపమ చౌదరి కరాకండిగా చెప్పారు. దీంతో వైద్యురాలు ఫాతేమీ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై పోలీసులు హీరో వేణును సంప్రదించారు. టెనెంజ్ ఫిర్యాదు వివరాలతో పాటు వేణు నిర్ణయాన్ని అడిగారు. ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలని వేణు నిర్ణయించుకుని... ఫాతేమీతో చర్చించినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు హీరో వేణు రాజీకి రావడంతో ఈ గొడవ సద్దుమణిగిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేసు వాపస్ తీసుకోగా కొన్ని గంటల ఈ డ్రామాకు తెరపడింది.