పార్టీలు మారడమంటే రాజకీయ వ్యభిచారమే
రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఒకప్పుడు నాయకులు ఏళ్ల తరబడి ఒకే పార్టీలో ఉండేవారు. ఒకే నాయకుడిని నమ్ముకునేవారు. ఇప్పుడు బట్టలు మార్చినట్టు పార్టీలు మారుస్తున్నారు. పొద్దునో షర్టు.. రాత్రికో షర్టు.. అన్నట్టుంది పరిస్థితి. పార్టీలు మారడమంటే రాజకీయ వ్యభిచారం చేసినట్టే..’’ అని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులను అనుభవించిన ఫారూఖ్ హుస్సేన్ టీఆర్‌ఎస్‌లో చేరడం బాధాకరమన్నారు.
అలాగే తొలి నుంచీ కాంగ్రెస్‌లో లేని పువ్వాడ అజయ్ కుమార్‌ను పిలిచి మరీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నా ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారన్నారు. పార్టీ వరుస ఓటములపై సమీక్షించాలని పీసీసీ నాయకత్వాన్ని, జాతీయ నాయకత్వాన్ని పదేపదే కోరినా దిగ్విజయ్‌సింగ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి పట్టించుకోలేదని వీహెచ్ విమర్శించారు. ఇప్పటికైనా అందరం ఏకతాటిపై నిలిచి చర్చించుకుంటే సమస్య తీరుతుందని పేర్కొన్నారు.
గతంలో ఇలాంటివి జరిగితే మధ్యవర్తులు ఉండేవారని, ఇప్పుడు మధ్యవర్తులూ లేరన్నారు. తప్పులను సమీక్షంచుకోవడం మంచి పద్ధతని పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లోపించిందని అభిప్రాయపడ్డారు. సమన్వయ కమిటీ ఉన్నా అందులోనే సమన్వయం లేదని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏడుగురితోనే సమన్వయ కమిటీ ఉండేదని, ఇప్పుడు 31 మంది ఉన్నా పరిస్థితి బాగోలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు.