శశికళ కొత్త ఎత్తుగడ
చెన్నై: తమిళనాట అన్నాడీఎంకే రాజకీయాలు మరోసారి ఊహించని మలుపులు తిరుగుతూ రక్తికట్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గాల విలీనం విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పన్నీరు వర్గం చేస్తున్న డిమాండ్లపై పళని సానుకూలంగా స్పందించకపోవడం, ఇరు వర్గాలు విమర్శలకు దిగడంతో విలీన చర్చలపై సందిగ్ధత ఏర్పడింది. ఈ విలీనం ఓ హైడ్రామా అని, కమలం పెద్దల కనుసన్నల్లో ఈ డ్రామా సాగుతోందని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఇదిలావుండగా పార్టీని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి శశికళ కొత్త ఎత్తుగడ వేసినట్టు ప్రచారం జరుగుతోంది.
శశికళ తన వదిన (అన్న భార్య) ఇళవరసి కుమారుడు వివేక్‌ను తెరపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా వివేక్‌ను నియమించి, ఆయన ద్వారా చక్రం తిప్పాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిన్నమ్మ ప్రతిపాదనకు ఆమెకు నమ్మినబంటు అయిన సీఎం పళనిస్వామి కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో శశికళ, ఇళవరసి ఇద్దరూ బెంగళూరులోని అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.
శశికళ తన మేనల్లుడు దినకరన్‌ను పార్టీ ఉపప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. కాగా దినకరన్ తీరు పట్ల శశికళ ఆగ్రహంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల సందర్భంగా పార్టీ గుర్తు (టోపీ) ఎంచుకోవడంలో దినకరన్ సమర్థంగా వ్యవహరించలేదని ఆమె పార్టీ నాయకుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పార్టీ గుర్తు (రెండాకులు) కోసం ఈసీ అధికారికి లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలు చిన్నమ్మకు ఆగ్రహం తెప్పించాయి. దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పళని వర్గం తొలగించింది. ఈ నేపథ్యంలో శశికళ.. వివేక్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించి, పార్టీపై పట్టు చేజారకుండా చూడాలని భావిస్తున్నట్టు సమాచారం.