
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలోని అందరూ కలిసికట్టుగా లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సమయం ఆసన్నం అవుతోందని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె నాగపట్నం, తిరువారూర్‌లలో పర్యటించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ వేదికగా అన్నాడీఎంకే విభేదాల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన వేదికపై వివాదాలు శోచనీయమన్నారు. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.
అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులు ఎవరైనా ప్రశ్నించవచ్చునని, అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చునని, వ్యాఖ్యలు, ప్రసంగాలు చేయడానికి వీలుందన్నారు. అయితే, పన్నీరుసెల్వంను అడ్డుకోవడం శోచనీయమన్నారు. తాను ఖండించినంత మాత్రాన పన్నీరుకు మద్దతు ఇచ్చినట్టు కాదన్నారు. అన్నాడీఎంకే ఎవరి చేతిలో ఉంటే భవిష్యత్తు ఉంటుందో అన్నది కేడర్ ఆలోచించాలని, సమాధానం కేడర్ చెప్పాలని కోరారు. త్వరలో తనను పన్నీరుసెల్వం కలిసే అవకాశాలు ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేకు ఈసారి గెలుపు కష్టమేనని, ఆ మేరకు తాము వ్యూహాలకు పదును పెడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment