ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : తెలంగాణ ఇచ్చింది తామేనన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లినా తాజాగా జరిగిన ఎన్నికల్లో జిల్లా లో ఘోర పరాజయాన్ని కాంగ్రె స్ పార్టీ మూటగట్టుకుంది. కాగా, ముథోల్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలుపు వారికి కొంత ఊరటం కలిగించింది. పరాజయంపై కాంగ్రెస్ శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణ కల కాంగ్రెస్ పార్టీతోనే సాకారమైందని చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. తద్వారా రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేయాలని లక్ష్యంతో ముందుకు కదులుతున్నారు. ఇందులో భాగంగా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ నేపథ్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఆ పార్టీ సమాయత్తమైంది.
జిల్లా ఇన్‌చార్జీగా వివేక్
తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీపీసీసీ నుంచి జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసెందుకు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఇన్‌చార్జీలను నియమించింది. జిల్లా ఇన్‌చార్జీగా పెద్దపెల్లి మాజీ ఎంపీ జి.వివేక్‌ను నియమించారు. జూన్ 1న జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, వివిధ అనుబంధ సంఘాలతో పార్టీ నేతలు సమావేశం కానున్నారు. ఇందులో ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులతోపాటు గెలిచిన ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. ప్రధానంగా తమ పార్టీకి ఓట్లు రాకున్నప్పటికి పర్వాలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మాత్రం కాంగ్రెస్సే పాటు పడిందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
1,100 మంది అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని, సోనియాగాంధీ కృతనిశ్చయంతోనే రాష్ట్రం సాకారమయ్యిందని ప్రజలకు చెప్పదలచారు. అదే సమయంలో అధికార పార్టీ ఇచ్చిన హమీలు వాగ్ధానాలు అమలు చేయక పోతే నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఆవిర్భావ దినోత్సవ జూన్ 2వ తేదీన జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ జెండా ఆవిష్కరణ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి తెలిపారు. నియోజక వర్గ కేంద్రాల్లోనూ జెండావిష్కరణ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పార్టీ కార్యకర్తలు తెలంగాణ వచ్చిన సంబరాలను ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు.
ఆవిర్భావ వేడుకలకు సమాయత్తం
Published Tue, May 27 2014 1:36 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement