' సీఎం... ఎల్కేజీ నుంచి అబద్దాల కోరే '
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎల్కేజీ నుంచి అబద్దాల ఆడేవారని ఆయన చిన్ననాటి స్నేహితుడు పెద్దపల్లి ఎంపీ వివేక్ ఎద్దేవా చేశారు. ఆదివారం మెదక్ విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. తన సహ విద్యార్థిగా కిరణ్ ఆడిన ఎన్నో తొండి ఆటలు చిన్నానాటి నుంచి చూస్తున్నట్లు ఆయన చెప్పారు.
అలాగే తెలంగాణ విషయంలో మరో అబద్దపు ఆటకు కిరణ్ తెర తీశారని వివేక్ ఆరోపించారు. అయితే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చిన్ననాటి నుంచి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపి వివేక్లు ఎల్కేజీ నుంచి కలసి చదువుకున్నారు. దీంతో మెదక్ వచ్చిన వివేక్ను విభజన బిల్లుపై సీఎం అవలంభించిన వైఖరిపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు వచ్చిన రాష్ట్ర విభజన బిల్లు అసంపూర్తిగా ఉందని, ఈ నేపథ్యంలో ఆ బిల్లును తిప్పి రాష్ట్రపతికి పంపాలని సభా నాయకుడిగా స్పీకర్కు నోటీసులు జారీ చేశారు. దాంతో ఆ బిల్లును తిప్పి రాష్ట్రపతికి పంపనున్నారు. అయితే విభజన బిల్లును తిప్పి పంపడంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల నేతలు సీఎం కిరణ్పై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే.