లోవా: భారత్‌తో అమెరికా బంధాలు మరింత బలపడితే చైనాపై ఆధారపడే అవసరం ఉండదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అభిప్రాయపడ్డారు. అండమాన్ సముద్రంలో మిలటరీ బంధాల్ని భారత్‌తో పటిష్టం చేసుకుంటే చైనా నుంచి దూరం కావచ్చునని వ్యాఖ్యానించారు. 38 ఏళ్ల వయసున్న వివేక్ రామస్వామి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యరి్థత్వ రేసులో నిలిచిన వారిలో పిన్న వయసు్కడు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఈ బరిలో ముందున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన లోవా రాష్ట్రంలో పర్యటిస్తున్న వివేక్ రామస్వామి పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘చైనాపై అమెరికా ఆర్థికంగా ఆధారపడి ఉంది. భారత్‌తో సంబంధాలు బలపడితే చైనాతో బంధాల నుంచి బయటపడవచ్చు’ అని రామస్వామి వివరించారు. ‘అండమాన్ సముద్రంలో మిలటరీ బంధాలు సహా భారత్‌తో అమెరికాకు వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం కావాలి.
పశి్చమాసియా దేశాల నుంచి చైనాకు చమురు సరఫరా అవుతున్న మలక్కా జలసంధిని భారత్ అడ్డుకోగలదన్న విషయం మనకు తెలిసుండాలి. ఇరు దేశాల బంధాల బలోపేతానికి ఇవే కీలకం. అదే జరిగితే అమెరికాకు మంచే జరుగుతుంది. ఆ దిశగా నేను ముందుకు వెళతాను’ అని రామస్వామి చెప్పారు. మొదటిసారిగా భారతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన వివేక్ భారత ప్రధాని మోదీ మంచి నాయకుడని ప్రశంసించారు. మోదీతో కలిసి ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి కృషి చేసే రోజు కోసం తాను ఎదురు చూస్తున్నట్టుగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment