వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో అనూహ్యంగా పుంజుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి తన రూటు మార్చారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న ఆయన ఇన్నాళ్లూ ఉపాధ్యక్ష పదవికైతే పోటీ పడనని చెబుతూ వస్తున్నారు. అధ్యక్ష పదవి తప్ప తనకు దేనిపైనా ఆసక్తి లేదని గతంలో చెప్పిన ఆయన ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థి నామినేషన్‌ను గెలుచుకుంటే ఆయనతో కలిసి పోటీ చేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు.
బ్రిటన్‌కు చెందిన జిబి న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామిని ట్రంప్‌కు ఉపాధ్యక్షుడిగా పోటీ చేయడం మీకు సంతోషమేనా అని ప్రశ్నించగా ఇప్పుడు తన వయసుకు అది మంచి పదవేనని చెప్పారు. ‘‘అమెరికాని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పునరేకీకరణ చేయాల్సిన అవసరం ఉంది. వైట్‌హౌస్‌లో ఒక నాయకుడిగా ఉంటేనే ఆ పని నేను చెయ్యగలను’’అని చెప్పారు. 38 ఏళ్ల రామస్వామి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల చర్చలో తన సత్తా చూపించి రేసులో ట్రంప్ తర్వాత స్థానంలో దూసుకుపోతున్నారు. రామస్వామిని ట్రంప్ శిబిరం కూడా ప్రశంసించింది. అప్పట్నుంచి ట్రంప్, రామస్వామిలు అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా అంతిమంగా బరిలో నిలుస్తారన్న చర్చ పార్టీలో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment