
ఓరుగల్లుకు వీరుడెవరు?
►వరంగల్ ఉప ఎన్నికపై కాంగ్రెస్‌లో తర్జనభర్జన
► రాజయ్యతో పాటు వివేక్, సర్వే, దామోదర, అద్దంకి పేర్లపై చర్చ
► ముందుగానే క్షేత్రస్థాయిలో దూసుకువెళ్లాలని వ్యూహం
► టీఆర్‌ఎస్‌తో ముఖాముఖి పోటీ ఉంటుందని అంచనా
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక ఖాయమైన నేపథ్యంలో పార్టీ అభ్యర్థి ఎంపికపై టీపీసీసీ ప్రాథమిక చర్చలు జరుపుతోంది. వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి రాష్ట్రమంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా చేరడం, ఎమ్మెల్సీగా ఎన్నికకావడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీనితో వరంగల్ లోక్‌సభ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో మూడు నాలుగు నెలల్లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ దీనిపై దృష్టిని కేంద్రీకరించింది.
బలమైన అభ్యర్థిని ముందుగానే ప్రకటించి, క్షేత్రస్థాయి నుంచి వెంటనే పని ప్రారంభించాలనే యోచనలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సిరిసిల్ల రాజయ్య అభ్యర్థిత్వంపై టీపీసీసీ ఎక్కువ సానుకూలంగా ఉంది. అలాగే మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ అధికారప్రతినిధి అద్దంకి దయాకర్ తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ గ్రామ, మండల స్థాయి నాయకులంతా అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి పార్టీ శ్రేణుల్లో విశ్వాసం కల్పించేవిధంగా కార్యక్రమాలు, పర్యటనలను చేపట్టాలని స్థూలంగా నిర్ణయించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఏడాదికాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పలు రంగాల్లో వైఫల్యం చెందిందని, ప్రజల్లో సెంటిమెంటు కూడా తగ్గిందనే అంచనాల్లో కాంగ్రెస్ పార్టీ ఉందని తెలుస్తోంది. పార్టీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరినా ప్రజల్లో విస్తృత ప్రచారంతో ఉప ఎన్నికల్లో గెలుస్తామని అంచనా వేస్తోంది. వీలైనంత త్వరగా అభ్యర్థి ఎంపిక పూర్తిచేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోం ది. కాగా, ఆర్థికంగా బలమైన మూలాలున్న పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ జి.వివేక్ పేరును కొందరు కాంగ్రెస్ ముఖ్యులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన సిరిసిల్ల రాజయ్యను అభ్యర్థిగా ఎంపిక చేస్తే సానుభూతి పనిచేస్తుందని మరికొందరు నేతలు వాదిస్తున్నారు.
ఎన్నికల కోణంలో రాహుల్ టూర్
వరంగల్ జిల్లాలో పార్టీకి బలమైన నాయకత్వం ఉన్నా గ్రామ, మండల స్థాయి నాయకత్వం టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసపోయింది. ఈ నేపథ్యంలో తగిన వ్యూహం రచించాలని టీపీసీసీ నేతలు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటనను కూడా ఎన్నికల కోణంలో నిర్వహించాలని టీపీపీసీ భావిస్తోంది. వరంగల్ లోక్‌సభ సీటు పరిధిలోని స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. టీడీపీ బలం నామమాత్రమై పోయిన ఈ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌తో ముఖాముఖి పోటీ మాత్రమే ఉంటుందని కాంగ్రెస్ ముఖ్యనేతలు అంచనా వేస్తున్నారు.