చెన్నై,పెరంబూరు: సీనియర్ హాస్యనటుడు వివేక్‌పై శివాజీగణేశన్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే విజయ్ నటించిన బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై ఆయన చేసిన వ్యాఖ్యలను అన్నాడీఎంకే నాయకులు తీవ్రంగా ఖండించడంతో పాటు, నటుడు విజయ్‌పై ఎదురు దాడి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా అదే వేదికపై నటుడు వివేక్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ని ఇరుకున పడేశాయి. 1980లో శివాజీగణేశ్, వైజయంతిమాల జంటగా నటించిన ఇరుంబుతిరై చిత్రంలోని నెంజిల్ కుడియిరుక్కుం అనే పాటను అపహాస్యం చేసే విధంగా వివేక్ చేసిన వ్యాఖ్యలకు శివాజీగణేశన్ సమూగ నల పేర్వై సమాఖ్య తీవ్రంగా ఖండించింది. ఈ విషయమై ఆ సమాఖ్య అధ్యక్షుడు చంద్రశేఖరన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కొందరు వేదికనెక్కే ఛాన్స్ రాగానే అక్కడ చేరిన ప్రజలను చూసి ఏదేదో మాట్లాడతారన్నారు. అందుకు నటుడు వివేక్ అతీతం కాదన్నారు. ఆయన బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై దివంగత మహానటుడు శివాజీగణేశన్ నటించిన ఇరుంబుతిరై చిత్రంలోని నెంజిల్ కుడిఇరుక్కుం అనే పాటను పరిహాసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏ నటుడినైనా పొగుడుకోవచ్చని, ఏ సంగీత దర్శకుడినైనా ప్రశంసించుకోవచ్చని, అయితే ఒకరి ప్రాపకం కోసమే ఎంతో ప్రజాదరణ పొందిన పాటను పరిహసించడం వివేక్‌కు తగదని అన్నారు. నటుడు వివేక్ ఇంతకు ముందు కూడా పరాశక్తి చిత్రంలో శివాజీగణేశన్ న్యాయస్థానంలో చెప్పే సంభాషణలను ఎగతాళి చేసే విధంగా మాట్లాడారని అన్నారు. ఇక ముందు కూడా వివేక్ ఇలానే ప్రవర్తిస్తే అతనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
వివేక్ వివరణ: కాగా శివాజీగణేశన్ అభిమానుల ఆగ్రహానికి స్పందింవిన నటుడు వివేక్ 1980లో శివాజీగణేశన్ నటించిన ఇరుంబుతిరై చిత్రంలోని నెంజిల్ కుడియిరుక్కుం అనే పాటలో ప్రేమ భావం కలుగుతుందనీ, నటుడు విజయ్ చెప్పిన దానిలో మంత్రశక్తిలా అనిపిస్తోందని తాను చెప్పానరి, అభిమానులు, మనసు కలిగిన వారు అర్థం చేసుకోవాలని నటుడు వివేక్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment