Bigil Movie
-
తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన లేడీ కమెడియన్
ప్రముఖ లేడీ కమెడియన్ శుభవార్త చెప్పేసింది. తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో విషయాన్ని ఇన్ స్టా వేదికగా బయటపెట్టింది. ఈ క్రమంలోనే పలువురు నటీనటులు, ఫాలోవర్స్ ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: పెళ్లి బంధానికి పూర్తి న్యాయం చేశా.. కానీ: సమంత)ప్రముఖ తమిళ నటుడు రోబో శంకర్ కూతురే ఇంద్రజ శంకర్. దళపతి విజయ్ 'బిగిల్' (తెలుగులో 'విజిల్') సినిమాతో నటిగా మారిన ఈమె.. బాగానే గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత విశ్వక్ సేన్ 'పాగల్', కార్తీ 'విరుమాన్' చిత్రాల్లోనూ ఇంద్రజ సహాయ పాత్రలు చేసింది. ప్రస్తుతం టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది.ఈ ఏడాది మార్చిలో కార్తీక్ అనే దర్శకుడిని పెళ్లి చేసుకున్న ఇంద్రజ.. ప్రస్తుతం తాను గర్భవతి అయినట్లు ప్రకటించింది. ఈ విషయం తెలియగానే ఎమోషనల్ అయిపోయానని, మాటలు రావట్లేదని ఇన్ స్టాలో రాసుకొచ్చింది. లవ్ మామ అని భర్తని ఉద్దేశించి తెగ ప్రేమ కురిపించింది.(ఇదీ చదవండి: నిన్న ఎంగేజ్మెంట్.. ఇప్పుడు పెళ్లిలో కనిపించిన నాగచైతన్య) View this post on Instagram A post shared by INDRAJA SANKAR (@indraja_sankar17) -
అభిమానిని ప్రమాదం నుంచి గట్టెక్కించిన విజయ్
హీరోలను అభిమానించేవాళ్లే కాదు, ఆరాధించే వాళ్లకూ మన దగ్గర కొదవ లేదు. హీరోల కోసం ఏదైనా చేసే అభిమానులు.. వారి సినిమాలు చూస్తూ ఎక్కడ లేని సంతోషాన్ని పొందుతారు. తాజాగా ఓ బాల అభిమాని కూడా దళపతి విజయ్ నటించిన సూపర్ డూపర్ హిట్ బిగిల్(తెలుగులో విజిల్) సినిమా చూస్తూ తనను తాను మైమరిచిపోయాడు. అతడి కుటుంబ సభ్యులు కూడా తమకు కావాల్సింది ఇదే అని ఆనందపడ్డారు. పిల్లవాడు సినిమా చూసి మైమరిచిపోతే అతడి కుటుంబం సంతోషపడటం ఏంటో అర్థం కాలేదా? అయితే ఇది చదివేయండి.. తమిళనాడులోని చెన్నైలో పదేళ్ల బాలుడు ప్రమాదానికి గురయ్యాడు. గాయాలపాలైన అతడికి సర్జరీ చేయాల్సి వచ్చింది. దీంతో బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ చిన్నపాటి ఇంజక్షన్ తీసుకోవడానికి కూడా అతడు అస్సలు సహకరించలేదు. దీంతో తల పట్టుకున్న వైద్యులకు ఆ బాలుడు స్టార్ హీరో విజయ్‌కు అభిమాని అని తెలిసింది. వెంటనే డాక్టర్ తన ఫోన్లో బిగిల్ సినిమా చూడమని ఇచ్చాడు. ఎంతో ఎగ్జైట్ అయిన ఆ పిల్లవాడు కన్నార్పకుండా సినిమా చూడటంలో లీనమయ్యాడు. అలా అతడికి సర్జరీ చేయడం తేలికైంది. ఈ విషయాన్ని తమిళ దినపత్రిక ప్రముఖంగా ప్రచురించగా, దీనికి సంబంధించిన క్లిప్పింగ్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ రకంగా అతడి చికిత్స తీసుకోవడానికి కారణమైన హీరో విజయ్‌తో పాటు, వైద్యుడిని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. An injured boy was feared of injection, doctor understood that he is ardent #Vijay fan. So, he showed #Bigil movie from his mobile & made the boy comfortable. Despite injuries boy watched the film with excitement. Doctor used this opportunity & successfully completed the surgery. pic.twitter.com/xmn78TGKr7 — Manobala Vijayabalan (@ManobalaV) July 8, 2021 heart melting News 💓💜 @actorvijay 💜💓💖Everyone loved strongly #Bigil pic.twitter.com/u9i4wgqCy9 — Thalapathy Jai (@jaysandy3031) July 8, 2021 -
ఐటీ అధికారుల ముందుకు అర్చన
చెన్నై ,పెరంబూరు: ఆదాయపన్ను శాఖా అధికారుల ముందుకు ఏజీఎస్ సంస్థ నిర్వాహకురాలు అర్చన కల్పత్తి బుధవారం హాజరయ్యారు. బిగిల్ చిత్ర వసూళ్ల వ్యవహారంలో ఐటీ శాఖకు పన్ను చెల్లించలేని కారణంగా ఆదాయశాఖ అధికారులు ఇటీవల ఈ చిత్ర నిర్మాణ సంస్థ కార్యాలయం, నిర్మాతల ఇళ్లు, నటుడు విజయ్‌కు చెందిన ఇళ్లు, ఫైనాన్సియర్ అన్బుచెలియన్, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ ఇల్లు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో అన్బుచెలియన్ ఇళ్లు, కార్యాలయంలో రూ.77 కోట్లు, రూ. 300 కోట్ల విలువైన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ వ్యవహారంలో ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా విజయ్, అన్బుచెలియన్, సుధాకర్లకు ఐటీ అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ సినామా షూటింగ్లో బిజిగా ఉండడంతో ఆయన ఆడిటర్ మంగళవారం నుంగంబాక్కంలోని ఐటీశాఖ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వివరణ ఇచ్చారు. కాగా బుధవారం ఏజీఎస్ సంస్థ నిర్వాహకురాలు, ఆ సంస్థ అధినేత అఘోరం కల్పత్తి కూతురు అర్చన ఆదాయపన్ను శాఖ అధికారుల ముందు హాజరయ్యారు. అప్పుడు అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె బదులిచ్చినట్లు తెలిసింది. కాగా డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ తరపున ఆయనకు సంబంధించిన వ్యక్తి హాజరయ్యారు. ఫైనాన్సియర్ అన్బుచెలియన్ మాత్రం ఇంకా ఐటీ అధికారుల ముందుకు హాజరు కాలేదు. దీంతో ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసినట్లు సమాచారం. దీంతో అన్బుచెలియన్ లేదా ఆయన తరపు వ్యక్తి గురువారం ఐటీ అధికారుల ఎదుట హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. (చదవండి: విజయ్‌కి ఐటీ శాఖ సమన్లు) -
ట్విట్టర్ లాగితే.. కరెన్సీ కదిలింది
తమ సినిమా ఘన విజయం సాధించిందని ఉప్పొంగిన ఉత్సాహంతో నిర్మాత కుమార్తె ట్వీట్ చేసిన సందేశం ఆదాయపు పన్నుశాఖ అధికారులనుఆకర్షించింది. హీరో, నిర్మాత దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్‌లోని తేడాలు పన్ను ఎగవేతను నిర్ధారించుకునేలా చేసింది. మొత్తం మీద ట్విట్టర్ లాగితే నటుడువిజయ్, ఫైనాన్షియర్ అన్బుసెళియన్ల డొంక కదిలింది.కోట్ల కొద్దీ విలువైన నగదు, సొత్తు పట్టుబడింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏజీఎస్ సంస్థ అధిపతి కల్పాత్తి అఘోరా చెన్నై తేనాంపేటలో సంస్థ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకుని సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు సినిమా ఫైనాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2006 నుంచి నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన ఏజీఎస్ సంస్థ ఇప్పటి వరకు 20 చిత్రాలు నిర్మించింది. రూ.180 కోట్లతో విజయ్ హీరోగా నిర్మించిన బిగిల్ చిత్రాన్ని గత ఏడాది దీపావళి సమయంలో విడుదల చేసింది. ఈ చిత్రం ఘన విజయం సాధించి రూ.200 కోట్ల లాభాలను ఆర్జించింది. బిగిల్ చిత్రం వసూళ్లలో జాతీయ స్థాయిలో టాప్ 10లో స్థానాన్ని దక్కించకున్నట్లు నిర్మాత కల్పాత్తి అఘోరా కుమార్తె అర్చన తన ట్విట్టర్లో పెట్టారు. ఐటీ రిటర్న్స్ దాఖలులో అనుమానాలు ఏజీఎస్ సంస్థ ఐటీ రిటర్న్స్ దాఖలులో బిగిల్ చిత్రానికి విజయ్‌కు ఇచ్చిన రెమ్యునరేషన్‌ను పొందుపరిచారు. విజయ్ దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌కు సంస్థ చూపిన లెక్కలకు పొంతనలేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది. దొంగలెక్కల ద్వారా తక్కువ ఆదాయం చూపుతూ కోట్లాది రూపాయాల పన్ను ఎగవేసిన అభియోగంపై విజయ్, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న సినీ ఫైనాన్షియర్, ఏజీఎస్ నిర్మాణ సంస్థ అధినేత అన్బుసెళియన్ ఇళ్లు, కార్యాలయాలు, ఏజీఎస్ సినిమా థియేటర్లు సహా 38 చోట్ల బుధవారం ప్రారంభమైన ఐటీశాఖ తనిఖీలు గురువారం కూడా కొనసాగాయి. ఒక్క అన్బుసెళియన్ ఇల్లు, కార్యాలయంలోనే రూ.77 కోట్ల నగదు, రూ.24 కోట్ల విలువైన కిలో వజ్రాలు, డైమండ్రాళ్లు, బంగారంతోపాటు రూ.300 కోట్ల విలువైన స్థిరాస్థిపత్రాలు పట్టుబడినట్లు సమాచారం. కట్టలు కట్టలుగా కరెన్సీని కుక్కి ఉన్న అనేక జిప్ బ్యాగ్‌లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకుల్లో వినియోగించే ఆటోమేటిక్ మెషిన్లను తెప్పించి నగదును లెక్కించారు. చెన్నై పనయూరు, సాలిగ్రామంలో విజయ్ ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు ప్రారంభించారు. ఐటీ అధికారులు దాడులు చేపట్టినపుడు విజయ్ నైవేలీలో మాస్టర్ చిత్రం షూటింగ్లో ఉన్నారు. ఐటీ అధికారులుఅక్కడికి వెళ్లి విచారణ నిమిత్తం తమకారులో ఎక్కించుకుని చెన్నైకి తీసుకొచ్చారు. షూటింగ్ అర్ధంతరంగా నిలిచిపోయింది. తన కారులో లేదా విమానంలో వస్తానని విజయ్ కోరినా అధికారులు అంగీకరించలేదు. 15 మంది అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు, డాక్యుమెంట్లపై పనయూరులోని ఇంట్లో విజయ్ను విచారించారు. విజయ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్లను అధికారులు తీసుకెళ్లారు. సుమారు రూ.100 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. అన్బుసెళియన్, విజయ్ వారి కుటుంబీకులు, స్నేహితుల బ్యాంకు లాకర్లను కూడా తనిఖీ చేయాలని నిర్ణయించారు. అభిమానుల్లో ఆగ్రహం తమ అభిమాన నటుడు విజయ్ను షూటింగ్‌ను నిలిపివేయించి మరీ తీసుకురావడం ఏమిటని ఆయన అభిమానులు ఐటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా వెంటపెట్టుకుని తీసుకెళ్లడానికి విజయ్ ఏమన్నా తీవ్రవాదా అని ప్రశ్నిస్తున్నారు. వందలాది మంది అభిమానులు విజయ్ ఇంటి ముందు గుమికూడి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు బందోబస్తు పెట్టాల్సి వచ్చింది. -
తమిళ హీరో విజయ్‌కు ఐటీ షాక్
-
డబుల్ సెంచరీ కొట్టిన బిగిల్
బిగిల్ పేరు చెప్తేనే విజయ్ అభిమానులు ఈల వేస్తున్నారు. సినిమా విడుదలై అయిదు రోజులు కావస్తున్నా విజయ్ ఫ్యాన్స్ థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. ద్విపాత్రాభినయంలో విజయ్ కట్టిపడేసాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీపావళికి విజయ్ ఇచ్చిన భారీ కానుక ‘బిగిల్’ అంటూ ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. విజయ్ కథానాయకుడిగా నటించిన బిగిల్ చిత్రం తెలుగులో విజిల్ పేరుతో విడుదలైంది. దర్శకుడు అట్లీ, హీరో విజయ్ కాంబినేషన్లో వచ్చిన హిట్ సినిమాల సరసన బిగిల్ చేరిపోయింది. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన మెర్సల్, సర్కార్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ రూ.200 కోట్లు అందుకోగా తాజాగా బిగిల్ కూడా వసూళ్లపరంగా రెండు సెంచరీలు పూర్తి చేసుకుంది. మొదట ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వసూళ్ల సునామీతో అవన్నీ నీటిపై రాతలుగా తేలిపోయాయి. అమెరికాలోనూ ఈ చిత్ర కలెక్షన్ల ప్రవాహం కొనసాగుతోంది. బిగిల్ చిత్రం ఇప్పటివరకూ అక్కడ 1 మిలియన్ కలెక్షన్లు సాధించింది. రికార్డులను తిరగరాస్తున్న బిగిల్ రూ.250 కోట్లను అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. దీపావళికి సినిమాల పోటీ తక్కువగా ఉండటం సినిమాకు కలిసొచ్చిన అంశంగా మారింది. -
100 కోట్ల క్లబ్లో బిగిల్
పెరంబూరు: బిగిల్ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం బిగిల్. నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో ఏజీఎస్ సంస్థ భారీఎత్తున నిర్మించింది. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గత శుక్రవారం భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా 4 వేల థియేటర్లలో విడుదలయ్యింది. పూర్తిగా కమర్శియల్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం విజయ్ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. కాగా చిత్ర వసూళ్లు మొదటి రోజున కాస్త పలుచగా ఉన్నా, రెండవ రోజు నుంచి పెరిగాయి. దీంతో విడుదలైన 3 రోజుల్లోనే బిగిల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లను వసూలు చేసినట్లు సమాచారం. దీనితోపాటు విడుదలయిన ఖైదీ చిత్రం కూడా మంచి టాక్‌తో ప్రదర్శింపబతున్నా, దీపావళికి ఈ రెండు చిత్రాలే తెరపైకి రావడంతో బిగిల్ చిత్ర వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండితుల గణాంకాలు చెబుతున్నాయి. నటుడు విజయ్ ఇంటికి బాంబు బెందిరింపు.. కాగా నటుడు విజయ్ ఇంటికి బాంబు అంటూ ఫోన్‌కాల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. స్థానిక సాలిగ్రామంలోని నటుడు విజయ్ తండ్రి ఇంటికి, నీలాంగరైలోని విజయ్ ఇంటికి గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ వివరాలు చూస్తే గత 26వ తేదీ రాత్రి చెన్నై పోలీస్ కార్యాలయానికి ఒక వ్యక్తి ఫోన్ చేసి నటుడు విజయ్ ఇంటిలో బాంబు పెట్టినట్లు చెప్పి పెట్టేశాడు. దీంతో పోలీసులు స్థానికి సాలిగ్రామంలోని విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ ఇంటికి, నీలాంగరైలోని విజయ్ ఇంటికి పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. బాంబుస్క్వాడ్‌ను పిలిపించి, పోలీస్కుక్కలతో రెండు చోట్లా ఇళ్లను క్షణంగా పరిశోధించారు. అయితే బాబు లేదని విచారణలో తెలడంతో ఫోన్ చేసిన వ్యక్తి గురించి ఆరా తీశారు. ఆ వ్యకి అన్నానగర్‌కు చెందిన వాడని తెలియడంతో అతన్ని పిలిపించి విచారించారు. అయితే ఎవరో ఒక వ్యక్తి సడన్‌గా వచ్చి తన తల్లిదండ్రులతో మాట్లాడాలని ఫోన్ తీసుకున్నాడని, అతనెవరో కూడా తనకు తెలియదని చెప్పాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు తను చెప్పింది నిజమేనా? అన్న విషయం గురించి తీవ్రంగా విచారిస్తున్నారు. బాంబు పెట్టడం అన్నది బూచి అని తేలయడంతో విజయ్ ఇంటికి ఏర్పాటు చేసిన పోలీస్‌బందోబస్తును వాపస్ చేశారు, -
‘ఆ సినిమా కథ కాపీరైట్స్ నావే’
సాక్షి, హైదరాబాద్ : తాను కాపీరైట్స్ తీసుకున్న కథను మరొకరికి విక్రయించిన వ్యక్తిపై, ఆ కథతో సినిమాను తెరకెక్కించిన నిర్మాత, నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని రచయిత డాక్టర్ నంది చిన్నికుమార్ విజ్ఞప్తి చేశాడు. మంగళవా రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ఆమీర్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే ‘సత్యమేవ జయతే’ కార్యక్రమంలో నాగ్‌పూర్‌కు చెందిన అఖిలేపాల్ అనే వ్యక్తి జీవిత కథను విన్నానని తెలిపారు. ఆయన ఓ మురికివాడలో పుట్టి ఎన్నో నేరాలు చేసి తర్వాత ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎదిగి బ్రెజిల్లో జరిగిన సాకర్ కప్ టోర్నమెంట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడన్నారు. ప్రస్తుతం మురికివాడల్లోని, రెడ్‌లైట్ ఏరియాల్లోని పిల్లలకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అతని జీవిత కథ తనకెంతో నచ్చడంతో ఆయన దగ్గరికెళ్లి సినిమా తీసేందుకు 2018 మార్చి 19న కాపీరైట్స్ అగ్రిమెంట్ చేసుకున్నానని వివరించారు. ఇందుకు కొంత నగదు కూడా చెల్లించినట్లు పేర్కొన్నారు. తాను సినిమా స్టోరీ అంతా సిద్ధం చేసుకొని... నటీనటులు, నిర్మాతల కోసం వెతుకుతున్నానన్నారు. కాగా ఇటీవల విడుదలైన విజిల్ (తెలుగు), తమిళ్లో (బిగిల్) సినిమా తాను కాపీరైట్స్ తీసుకున్నదేనన్నారు. దీనిపై పాల్‌ను సంప్రదించగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా బృందాన్ని సంప్రదించినా స్పందన లేదన్నారు. దీంతో తెలంగాణ సినిమా రైటర్స్ అసోసియేషన్, సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లోనూ అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేయగా, వారు బాధ్యులపై కేసు నమోదు చేశారన్నారు. దీనిపై త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తానన్నారు. -
విజయ్‌కి షాక్.. ఆన్లైన్లో బిగిల్
చెన్నై: బిగిల్ చిత్రాన్ని పైరసీ వదల్లేదు. విడుదలైన కొన్ని గంటల్లోనే అనధికారికంగా ఆన్లైన్లో పూర్తి సినిమా హల్చల్ చేసింది. ఇది చిత్ర వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన చిత్రం బిగిల్. నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో ఏజీఎస్ సంస్థ నిర్మించింది. బిగిల్ చిత్రం భారీ అంచనాల మధ్య దీపావళి సందర్భంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. అయితే విడుదలకు ముందు నుంచే మొదలైన బిగిల్ చిత్ర రచ్చ ఆ తరువాత కూడా కొనసాగుతోంది. ఈ చిత్రంతో పాటు కార్తీ హీరోగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో డ్రీమ్‌వారియర్, వివేకానందా స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మించిన ఖైదీ చిత్రం ఒకే సారి విడుదలయ్యాయి. అయితే ఈ రెండు చిత్రాలకు పైరసీ దెబ్బ తగిలింది. బిగిల్ చిత్రం విడుదలైన కొన్ని గంటలకే అనధికారికంగా ఆన్లైన్లో ప్రత్యక్షం అయితే కొంచెం ఆలస్యంగా అంటే శుక్రవారం రాత్రి ఖైదీ చిత్రం ఆన్లైన్లో హల్చల్ చేసింది. కాగా ఈ రెండు చిత్రాలను అనధికారకంగా, అక్రమంగా ఆన్లైన్లో ప్రచారం చేయరాదని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా కోర్టు ఆదేశాలను భేఖాతరు చేసి తమిళ్‌రాకర్స్ అనే వెబ్సైట్ పైరసీకి పాల్పడడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పైరసీని అరికట్టడం సాధ్యం కాదా అన్న చర్చ జరుగుతోంది. విజయ్ అభిమానులు అరెస్ట్.. కాగా బిగిల్ చిత్ర విడుదల సమయంలో నటుడు విజయ్ అభిమానులు చేసిన వీరంగం పలు విమర్శలకు దారి తీసింది. అంతే కాదు అలాంటి పలువురు విజయ్ అభిమానులు ఇప్పుడు జైలు ఊసలు లెక్క పెడుతున్నారు. ఈ వివరాలు చూస్తే కృష్ణగిరిలోని ఒక థియేటర్ వద్ద నటుడు విజయ్ అభిమానులు బీభత్సం సృష్టించారు. దీపావళి సందర్భంగా విడుదలయ్యే చిత్రాలకు ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి నిరాకరించిన ప్రభుత్వం చివరికి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లయాజమాన్యం విజ్ఞప్తి మేరకు మొదటి రోజు మాత్రం అనుమతినిచ్చింది. కాగా కృష్ణగిరిలోని థియేటర్లో ప్రత్యేక ప్రదర్శనకు ఆలస్యం కావడంతో విజయ్ అభిమానులు ఆ ప్రాంతంలో నానా బీభత్సాన్ని సృష్టించారు. రోడ్డుకిరుపక్కల ఉన్న వ్యాపార దుకాణాలపై దాడి చేసి నానా యాగం చేశారు. ఆస్తులను «ధ్వంసం చేశారు. సగటు ప్రజలను భ్రయభాంత్రులకు గురి చేశారు. దీంతో రక్షకబటులు రంగంలోకి దిగాల్సిన పరిస్ధితి ఏర్పడింది. అంతే ఆ ప్రాంత పోలీసులు వచ్చి చిన్న పాటి లారీచార్జ్ చేసి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే ఈ రచ్చకు కారణం అయిన 30 మంది విజయ్ అభిమానులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నాన్‌బెయిలబుల్ కేసులను నమోదు చేసి జైలుకు తరలించారు. ఇటీవల నటుడు విజయ్ బిగిల్ ఆడియో ఆవిష్కరణ వేదికపై తన అభిమానులను ఏమన్నా సహించేది లేదు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు కృష్ణగిరి సంఘటనతో ఇలాంటి అభిమానులనా నటుడు విజయ్ వెనకేసుకొస్తున్నారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కస్తూరి ఫైర్.. కాగా సమాజంలో జరిగే సంఘటనలపై, ముఖ్యంగా సినీ, రాజకీయాలకు సంబంధించిన విషయాలపై వెంటనే స్పందించే నటి కస్తూరి విజయ్ అభిమానుల చర్యలపైనా తీవ్రంగానే స్పందించారు. ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ నటుడు విజయ్ నటించిన బిగిల్ చిత్రం ఎన్ని రికార్డులు సాధించినా, ఇప్పుడు ఆయన అభిమానులు సృష్టించిన అరాచకం ఎప్పుడూ గుర్తుకొస్తుందన్నారు. కృష్ణగిరిలోని సంఘటన వ్యతిరేక వర్గం చర్యలని సరిపెట్టుకున్నా, నిజమేమిటో మన మనసుకు తెలుసన్నారు. నిజమైన అభిమానులు తాను అభిమానించే నటులను ఇంతగా చెడ్డ పేరు తెచ్చే చర్యలకు పాల్పడరన్నారు. ఇలాంటి వారా తమిళనాడు భావిపౌరులు అని నటి కస్తూరి తూర్పారపట్టారు. -
విజిల్ మూవీ రివ్యూ
టైటిల్: విజిల్ (తమిళంలో బిగిల్) జానర్: మాస్ యాక్షన్-స్పోర్ట్స్ డ్రామా నటీనటులు : విజయ్, నయనతార, జాకీష్రాఫ్, కదీర్, యోగిబాబు సంగీతం : ఏఆర్ రహమాన్ దర్శకత్వం : అట్లీ నిర్మాతలు: కల్పాతి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేశ్, కల్పాతి ఎస్ సురేశ్ వరుస విజయాలతో తిరుగులేని ఫామ్‌లో ఉన్న తమిళ స్టార్ హీరో విజయ్. మెర్శల్, సర్కార్ వంటి భారీ సూపర్‌హిట్స్ ఊపుమీదున్న ఆయన.. మరోసారి దర్శకుడు అట్లీతో జతకట్టి ‘విజిల్’ అనే స్పోర్ట్స్ డ్రామాతో తెరమీదకు వచ్చారు. ఇంతకుమునుపు విజయ్-అట్లీ కాంబినేషన్లో తేరి, మెర్శల్ వంటి బాక్ల్‌బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా వస్తుండటం, ఈ సినిమాలో విజయ్ డ్యుయల్ రోల్ చేస్తుండటంతో.. హ్యాట్రిక్ సూపర్‌హిట్ ఖాయమని ధీమాతో ఉన్నారు ఫ్యాన్స్. విజయ్ సరసన నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘విజిల్’ ఎలా ఉంది? ప్రేక్షకులతో ఈల వేయించిందా? ఓసారి తెలుసుకుందాం పదండి. కథ: మైఖేల్ రాజప్ప (విజయ్) స్థానికంగా మంచి రౌడీ. తన మురికివాడలోని వాళ్లను ప్రత్యర్థుల నుంచి కాపాడుకుంటూ ఉంటాడు. స్థానికంగా మంత్రి కాలేజీ మూయించాలని చూస్తే దానిని అడ్డుకుంటాడు. ప్రత్యర్థులు చెడు చేయకుండా అడ్డుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో అమ్మాయిల ఫుట్‌బాల్ టీమ్ కోచ్ అయిన మైఖేల్ స్నేహితుడు కిరణ్ తన టీమ్‌ను తీసుకొని అతను ఉండే చోటుకి వస్తాడు. కిరణ్‌తో కలిసి కారులో వెళుతుండగా ప్రత్యర్థులు మైఖేల్‌పై అటాక్ చేస్తారు. ఈ దాడిలో మైఖేల్ రౌడీలను చితగ్గొట్టినప్పటికీ.. అతని విరోధి మాత్రం కిరణ్‌ను గొంతులో కత్తితో పొడుస్తాడు. దీంతో చికిత్స పొందుతూ.. ఆస్పత్రి బెడ్‌కు పరిమితమైన కిరణ్.. తనస్థానంలో మైఖేల్‌ను అమ్మాయిల టీమ్‌కు కోచ్‌గా వెళ్లమని కోరుతాడు. ప్లాష్‌బ్యాక్‌లో బిగిల్‌గా పేరొందిన మైఖేల్ గొప్ప ఫుట్‌బాల్ ఆటగాడు. అతని తండ్రి రాజప్ప (విజయ్) స్థానికంగా పేరుమోసిన రౌడీ. అయినా తన కొడుకు కత్తి పట్టకుండా ఆటలతో పైకి రావాలని కోరుకుంటాడు. ఈక్రమంలో అతను, అతని స్నేహితులు కలిసి నేషనల్ గేమ్స్ ఆడేందుకు వెళ్తుండగా రైల్వే స్టేషన్లో ప్రత్యర్థులు అటాక్ చేసి.. మైఖేల్ కళ్లముందే రాజప్పను చంపేస్తారు. దీంతో జాతీయ కప్ కొట్టాలన్న తన తండ్రి కల రైల్వే స్టేషన్లో ఆగిపోతుంది. పుట్‌బాల్ ప్లేయర్ కావాలనుకున్న మైఖేల్ తండ్రి స్థానంలోకి రౌడీగా మారిపోతాడు. ఈ క్రమంలో కిరణ్ కోరిక మేరకు అమ్మాయిల జట్టుకు కోచ్‌గా మారిన మైఖేల్.. బిగిల్ కప్పు ముఖ్యంరా అన్న తండ్రి కలను నెరవేర్చాడా? కోచ్‌గా ఎలా నిలదొక్కుకున్నాడు? నేషనల్ గేమ్స్‌లో అతనికి ఎదురైన అవాంతరాలు ఏమిటి? అమ్మాయిలు సమాజంలోని ప్రతికూలతలను ఎదుర్కొని ఎలా పోరాడారు? అన్నది తర్వాతి కథ. విశ్లేషణ: స్పోర్ట్స్ డ్రామాకు బలమైన భావోద్వేగాలు ముఖ్యం. తెరమీద కనిపిస్తున్న ఆట నిజంగా జరుగుతున్నట్టే అనిపిస్తూ.. అందులో ప్రేక్షకుడిని మమేకం చేయాలి. అప్పుడే తెరమీద భావోద్వేగాలు పండుతాయి. షారుఖ్ ఖాన్ ‘చక్ దే ఇండియా’, సల్మాన్ ఖాన్ ’సుల్తాన్’,, ఆమీర్ ఖాన్ ‘దంగల్’, మాధవన్ ‘గురు’ సినిమాలు ఈవిధంగా తెరమీద భావోద్వేగాలను అద్భుతంగా పండించి.. ప్రేక్షకులతో శెభాష్ అనిపించుకున్నాయి. బిగిల్ పేరుకు స్పోర్ట్స్ డ్రామా అయినా అందులో ఫక్తు మాస్ యాక్షన్ సీన్లు బోలెడు ఉన్నాయి. విజయ్‌లాంటి స్టార్ హీరోతో పూర్తిస్థాయి స్పోర్ట్స్ డ్రామా చేయడం బాగుండదనుకున్నాడేమో డైరెక్టర్.. కథ కంటే కూడా ప్రతి 20, 30 నిమిషాలకు ఒక ఫైట్ సీన్..హీరోను ఎలివేట్ చేసే సీన్లతో విసిగించాడు. అంతేకాకుండా సినిమా నిడిమి చాలా ఎక్కువైపోవడంతో కథ మీద దర్శకుడికి పట్టు తప్పినట్టు కనిపిస్తుంది. చాలా సీన్లు సాగదీతతో ఉండి.. తమిళ వాసనలతో బోర్ కొట్టిస్తాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ భరించడం చాలా కష్టమే. ఫస్టాఫ్‌లో తండ్రీ-కొడుకుగా డ్యుయల్ రోల్స్‌లో విజయ్ పండించిన వేరియేషన్స్, వారి మధ్య అనుబంధం కొంచెం ఆకట్టుకుంటుంది. ఇక, ఫస్టాఫ్‌లో కనిపించే తండ్రి పాత్రకు పూర్తిస్థాయి న్యాయం జరిగినట్టు కనిపించదు. రాజప్ప నేపథ్యమేమిటో పూర్తిగా చూపించకుండానే దర్శకుడు అర్ధంతరంగా ముగించేసిన భావన కలుగుతుంది. ఇక, ఫస్టాఫ్‌లో సాఫ్ట్రోల్లో కనిపించిన ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు జేకే శర్మ (జాకీష్రాఫ్) సెకండాఫ్‌లో విలన్‌గా అవతారమెత్తుతాడు. ప్లాష్‌బ్యాక్‌లో రాజప్ప తనను చితకబాదినందుకు.. ఇప్పుడు కోచ్ మైఖేల్, అతని టీమ్‌ను ఓడించి.. ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు. ఇలా మైదానంలో క్రీడాపరమైన ఉద్వేగాల కంటే.. హీరో-విలన్ మధ్య పోటాపోటీ సీన్లు.. కేవలం హీరోయిజాన్ని ఎలివేట్ చేసినందుకు పెట్టినట్టు అనిపిస్తుంది. అయితే, మన దేశంలో క్రీడల్లోకి వచ్చేందుకు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దర్శకుడు అట్లీ కొంత నిజాయితీగా చూపించడం ఆకట్టుకుంటుంది. తనకు ప్రేమ కన్నా ఫుట్‌బాలే ముఖ్యమన్నందుకు ఓ ఉన్మాది చేతిలో యాసిడ్ దాడికి గురైన అమ్మాయి.. కోచ్ ఇచ్చిన మనోస్థైర్యంతో తిరిగి జట్టులోకి వచ్చి రాణించడం, పెళ్లయి.. సంప్రదాయ కుటంబంలో గృహిణిగా సెటిలైన యువతి తిరిగి జట్టులోకి రావడం వంటి చక్కని అంశాలు సినిమాలో ఆకట్టుకుంటాయి. ఇక, ఫుట్‌బాల్ గేమ్‌లోనూ భావోద్వేగాల కంటే.. ప్రేక్షకులను కట్టిపడేసి విన్యాసాలను చూపించడానికే ప్రాధాన్యమిచ్చినట్టు కనిపిస్తోంది. ఏఆర్ రహమాన్ సంగీతం అంతగా ఆకట్టుకోకపోయినా.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన అస్సెట్‌గా నిలిచింది. ముఖ్యంగా శివంగివే పాట స్ఫూర్తిదాయకంగా ఉంది. జీకే విష్ణు నీట్ సినిమాటోగ్రఫి, ఆర్ట్ డైరెక్టర్ ముథురాజు పనితనం సినిమాలో కనిపిస్తోంది. చిత్రస్థాయికి తగ్గట్టు నిర్మాణ విలువలు ఉన్నాయి. సినిమాకు బాగా కత్తెరవేసి.. ట్రిమ్ చేసి.. కథను క్రిస్ప్‌గా తెరకెక్కించి ఉంటే బాగుండేది. ఎప్పటిలాగే విజయ్ తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోగా.. అతన్ని ప్రేమించే ఏంజిల్ ఆశ్విరాదంగా ఓ మోస్తరు పాత్రకు నయనతార పరిమితమైంది. బలాలు విజయ్ యాక్టింగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నిర్మాణ విలువలు బలహీనతలు ఫస్టాఫ్ సాగదీత సీన్లు సినిమా నిడివి రోటిన్ హీరోయిజం, ఫైట్లు - శ్రీకాంత్ కాంటేకర్ -
హీరో విజయ్ ఫ్యాన్స్ అరెస్ట్
అభిమానం హద్దు మీరింది. బిగిల్ చిత్రం విడుదల సందర్భంగా విజయ్ అభిమానులు విధ్వంసానికి దిగారు. ముందుగా సినిమా ప్రదర్శించలేదని థియేటర్లోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. సీసీ టీవీలను పగులకొట్టారు. దీంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: విజయ్ హీరోగా నటించిన బిగిల్ చిత్రం విడుదల విధ్వంసానికి, లాఠీ చార్జ్‌కి దారితీసింది. విజయ్ అభిమానుల ఆగ్రహానికి అంగళ్లతోపాటూ పోలీసు వాహనం కూడా అగ్నికి ఆహుతైంది. నలుగురు పోలీసులు గాయపడగా, పలువురు అభిమానులు కటకటాల పాలయ్యారు. తమిళ సినీ పరిశ్రమలో రజనీకాంత్ తరువాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్లుగా ప్రచారంలో ఉన్న హీరో విజయ్. ఆయన సినిమా అంటే అభిమానులకు పండుగే. శుక్రవారం విజయ్ చిత్రం విడుదల కావడంతో అభిమానుల్లో ఆనందం కట్టలుతెంచుకుంది. దర్శకుడు అట్లీ, విజయ్, నయనతార కాంబినేషన్ కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శన కోసం అభిమానులు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో అభిమానులు ఆగ్రహంతో రగిలిపోయారు. అయితే గురువారం రాత్రి ప్రభుత్వం అకస్మాత్తుగా తొలిరోజు మాత్రం ప్రత్యేక ప్రదర్శనకు అనుమతి ఇవ్వడంతో ఒకింత శాంతించారు. శుక్రవారం తెల్లవారుజామున రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ప్రత్యేక షో ప్రదర్శితమైంది. కృష్ణగిరిలో రెండు థియేటర్లలో బిగిల్ ప్రదర్శనకు సిద్ధంకాగా, అభిమానుల కోసం శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని యాజమాన్యం ప్రకటించింది. దీంతో గురువారం అర్ధరాత్రి నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకోవడం ప్రారంభించారు. క్రమేణా ఈ సంఖ్య మరింత పెరిగిపోవడంతో తోపులాట, తొక్కిసలాట మొదలైంది. వెంటనే షో వేయాలని అభిమానులు కేకలు వేశారు. అయితే 3 గంటల తరువాత మాత్రమే ప్రత్యేక ప్రదర్శన వేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయని యాజమాన్యం వారికి తెలిపింది. దీంతో అసహనానికి లోనైన అభిమానులు విధ్వంస చర్యలు ప్రారంభించారు. థియేటర్లోకి జొరబడి కుర్చీలను ధ్వంసం చేశారు. రోడ్డు పక్కన ఉన్న అంగళ్లను, ప్రకటన బోర్డులను తగులబెట్టారు. థియేటర్‌కు అమర్చి ఉన్న సీసీటీవీ కెమెరాలను పగులగొట్టారు. అప్పటికే గస్తీ విధుల్లో ఉన్న పోలీసులు అభిమానులను చెదరగొట్టడం ప్రారంభించగా గందరగోళం నెలకొంది. పోలీసులపై అభిమానులు దాడికి దిగారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. అభిమానుల దాడులు అదుపు తప్పడంతో పోలీసులు కంట్రోలు రూముకు ఫోన్ చేయడంతో ప్రత్యేక పోలీసు దళం రంగప్రవేశం చేసి లాఠీచార్జ్‌కి దిగారు. ఈ గొడవల్లో నలుగురు పోలీసులకు, కొందరు అభిమానులకు గాయాలయ్యాయి. పోలీసుల అదుపులో 37 మంది.. ఆస్తులను ధ్వంసం చేసిన వారిలో 37 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణగిరిలోని రెండు థియేటర్ల ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి శుక్రవారం తెల్లవారుజాము 5 గంటలకు అభిమానుల కోసం ప్రత్యేక షో వేశారు. ఇదిలా ఉండగా, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వందలాది థియేటర్లలో యధావిధిగా విడులైంది. విజయ్ ఫ్లెక్సీలకు అభిమానులు పాలాభిషేకం చేశారు. నకిలీ టోకెన్లు.. ప్రత్యేక షో చూసేందుకు నకిలీ టోకెన్లతో వచ్చిన ముగ్గురు అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూత్తుకూడిలో రెండు థియేటర్లలో బిగిల్ విడుదలైంది. విజయ్ అభిమానుల కోసం ప్రత్యేక ప్రదర్శన కోసం ఏర్పాట్లు జరిగాయి. ఇందుకోసం నగదు మొత్తాన్ని యాజమాన్యానికి చెల్లించారు. ఆ తరువాత తొలి ప్రదర్శనకు టిక్కెట్ల పంపిణీకై టోకన్లను పంపిణీ చేశారు. అయితే కొందరు అభిమాలను చేతుల్లోని టోకన్లపై అభిమాన సంఘం నేతలకు అనుమానం రావడంతో తనిఖీ చేయగా అవి నకిలీ టోకన్లని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో రాజన్ (28), మోహన్‌బాబు (26), ఆనంద్ (30)లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నకిలీ టోకన్లను ముద్రించిన తిరునెల్వేలీకి చెందిన ఒక వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా కోర్టులు, కేసులు, ఆరోపణలు, వ్యతిరేకతలను అధిగమించి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగిల్ చిత్రం తెలుగులో ‘విజిల్’ గా విడుదలైంది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. మరోవైపు సినిమా పాజిటిల్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ మాస్ పాత్రలో ఇరగదీశాడంటూ, సెకండ్ హాఫ్‌లో సెంటిమెంట్ ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కనెక్ట్ అయ్యాడంటూ అభిమానులు ట్విట్ చేస్తున్నారు. -
సమస్యలను అధిగమించి తెరపైకి బిగిల్
చెన్నై,పెరంబూరు: కోర్టులు, కేసులు, ఆరోపణలు, వ్యతిరేకతలను అధిగమించి బిగిల్ చిత్రం శ్రువారం తెరపైకి రానుంది. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం బిగిల్. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో నయనతార నాయకిగా నటించింది. ఏజీఎస్ సంస్థ నిర్మించిన బిగిల్ రాజకీయ నేపథ్యానికి దూరం కావడంతో ఎలాంటి సమస్యలు తలెత్తవని, చిత్ర బృందం, సినీ వర్గాలు భావించారు.అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్మక్రమం నుంచే సమస్యలు తలెత్తడం మొదలయ్యాయి. చివరికి రాష్ట్రప్రభుత్వం నుంచి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. అంతే కాకుండా దర్శక నిర్మాతలపై కథ తస్కరణ ఆరోపణలు వచ్చాయి. చెన్నైకి చెందిన అంజత్‌మీరాన్ అనే వ్యక్తి చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను పుట్‌బాల్ నేపథ్యంలో రాసిన బ్రెజిల్ అనే కథనే తస్కరించి బిగిల్ పేరుతో చిత్రం రూపొందించినట్లు ఆరోపించారు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి ఎస్.సతీష్‌కుమార్ పూర్తి వివరాలతో మరోసారి పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా పిటిషన్‌దారుడిని ఆదేశించారు. ఈ కేసును నవంబరు 5న విచారించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో బిగిల్ చిత్రం విడుదలకు సమస్యలు తొలిగిపోయాయి. నిర్ణయించిన ప్రకారం శుక్రవారం చిత్రం తెరపైకి రానుంది. విజయ్ భయపడకూడదు దీపావళికి విడుదలవుతున్న చిత్రాలకు ప్రత్కేక ఆటల ప్రదర్శనలకు అనుమతి లేదని, నిబంధలనకు విరుద్ధంగా ప్రదర్శిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర సమాచార ప్రసార శాఖా మంత్రి కడంబూర్ రాజు గురువారం మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు. అదే విధంగా ప్రత్యేక ప్రదర్శనలకు ప్రేక్షకులు కొనుగోలు చేసిన అడ్వాన్స్ టిక్కెట్ల ధరలను వారికి వాపస్ చేయాలని అన్నారు. కాగా దీనిపై స్పందించిన నామ్‌తమిళర్ పార్టీ నేత, సినీ దర్శక, నటుడు ఇదంతా కక్ష సాధింపు చర్య అని విమర్శించారు. బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో విజయ్ చేసిన వ్యాఖ్యల కారణంగానే ప్రభుత్వం ఆ చిత్రానికి ప్రత్యేక షోల ప్రదర్శనలకు అనుమతి నిరాకరించినట్లు ఆరోపించారు. ఇలాంటి వాటికి విజయ్ భయపడరాదని ఆయన పేర్కొన్నారు. -
బిగిల్‌కు తప్పని ఆంక్షలు
తమిళనాడు,పెరంబూరు: నటుడు విజయ్ చిత్రాలకు విడుదల సమయాల్లో ఆటంకాలు ఎదురవడం పరిపాటిగా మారింది. గతంలో తలైవా, కత్తి, తుపాకీ చిత్రాల నుంచి ఆ మధ్య తెరపైకి వచ్చిన మెర్శల్, సర్కార్ చిత్రాల వరకూ కథల తస్కరణ ఆరోపణలు, కోర్టులు, కేసులు, ప్రభుత్వ ఆంక్షలు అంటూ రచ్చ జరుగుతూనే ఉంది. ఆ రచ్చ నుంచి విజయ్ నటించిన తాజా చిత్రం బిగిల్ కూడా తప్పించుకోలేక పోయింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. అయితే చిత్ర ఆడియో విడుదల సమయంలోనే వివాదాలను ఎదుర్కొంది. విజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దీంతో అప్పుటి నుంచి బిగిల్ చిత్రంపై రచ్చ స్టార్ట్ అయ్యింది. ఆ తరువాత మత్యకారుల నుంచి కులం పేరుతో విమర్శంచారని ఒక వర్గం కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఇక బిగిల్ కథ తమదేనంటూ కొందరు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అందులో ఒక పిటీషన్ గురువారం విచారణకు రానుంది. ప్రభుత్వం షాక్.. ఇక విజయ్ చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌లు ఇస్తూనే ఉంది. బిగిల్ ప్రత్యేక ఆటల ప్రదర్శనలకు అనుమతి లేదంటూ షాక్ ఇచ్చింది. సమాచార, ప్రచారశాఖా మంత్రి కడంబూర్ రాజు దీపావళి సందర్భంగా విడుదలయ్యే చిత్రాలకు ప్రత్యేక షోలకు అనుమతి లేదంటూ వెల్లడించారు. సాధారణంగా దీపావళి, సంక్రాంతి వంటి పండగల సందర్భంగా విడుదలయ్యే చిత్రాలకు ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతిస్తుంది. గత సంక్రాంతికి విడుదలయిన రజనీకాంత్ నటించిన పేట, అజిత్ నటించిన విశ్వాసం వంటి చిత్రాలకు వేకువ జామున 4 గంటటకు, అర్ధరాత్రి ఒంటి గంట షోలకు అనుమతించారు. కానీ ఇప్పుడు విజయ్ చిత్రానికి అనుమతి నిరాకరించారు. దీంతో బిగిల్ చిత్రంతో పాటు కార్తీ నటించిన ఖైదీ చిత్రానికి కూడా ప్రత్యేక అనుమతులు లభించలేదు. ప్రత్యేక ప్రదర్శనలకు విన్నపాలు భారీ బడ్జెట్‌తో బిగిల్ తెరకెక్కింది. సినిమా బిజినెస్కూడా అదే రేంజ్లో జరిగింది. ప్రత్యేక షోలు పడితేనే బయ్యర్లు కానీ, థియేటర్ల యాజమాన్యం పెట్టుబడిని రాబట్టకుని బతికి బట్టగలిగే పరిస్ధితి. అయితే వారందరికీ షాక్ ఇస్తూ ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతి నిరాకరించింది. చిత్ర నిర్మాత ఎజీఎస్ సంస్థ అధినేత అఘోరం, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియన్ ప్రత్యేక షోలకు అనుమతివ్వాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి నిరాకరణకు కారణాలను చెబుతోంది. ప్రత్యేక షోలకు టిక్కెట్లను అధిక ధరలకు విక్రయించి ప్రజలపై భారం మోపుతున్నారంటూ ఆరోపిస్తోంది. గతంలో రజనీకాంత్ నటించిన పేట చిత్రానికి ఒక్కో టిక్కెట్టను రూ.500 వరకూ విక్రయించారు. ఇక అజిత్ నటించిన విశ్వాసం చిత్రానికి ఏకంగా రూ. 500 నుంచి రూ.1500ల వరకూ అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు విజయ్ నటించిన బిగిల్ చిత్రానికి కొన్ని ధియేటర్లలో రూ. 2000ల వరకూ టిక్కెట్ థరను పెంచి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణం గానే ప్రభుత్వం ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతినివ్వరాదని నిర్ణయం తీసుకుంది. టిక్కెట్ల ధరను పెంచితే రద్దే.. థియేటర్లల్లో టిక్కెట్టు ధరను పెంచితే మొదటి దఫాగా రూ. 50, రెండవ దఫా లక్ష రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మూడోసారి థియేటర్ పరిమితులనే రద్దు చేస్తామని మంత్రి కడంబూర్ రాజు హెచ్చరించారు. అయితే ఆయన హెచ్చరికలను లెక్క చేయకుండా ఇప్పటికే బిగిల్ చిత్రానికి టిక్కెట్ ధరను రూ. 500 నుంచి రూ.2000ల వరకూ విక్రయిస్తున్నారు. విజయ్ అభిమానులు జోరు వానను సైతం లెక్క చేయకుండా థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. కడంబూర్ రాజుపై విమర్శల దాడి కాగా బిగిల్ చిత్రానికి ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి లేదన్న మంత్రి కడంబూర్ రాజుపై నటుడు విజయ్ అభిమానులు విరుచుకు పడుతున్నారు. రాయడానికి అలవికాని భాషలో సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తున్నారు. అయితే అన్నాడీఎంకే కార్యకర్తలు వారిపై ప్రతి విమర్శలు చేస్తూ ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద విజయ్ చిత్రం ఆయన అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తల మధ్య చిచ్చు రాజేసింది. బిగిల్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు.. ఇకపోతే బిగిల్‌కు ఫిర్యాదుల బెడద తప్పలేదు. దేవరాజన్ అనే వ్యక్తి బుధవారం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. బిగిల్, ఖైదీ చిత్రాల టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని అందులో పేర్కొన్నాడు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తున్న థియేటర్ల అనుమతులను రద్దు చేయాలని, ఇప్పటికే అధిక ధరలకు విక్రయించిన డబ్బును వాపస్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నాడు. అదే విధంగా ప్రత్యేక షోలను ప్రదర్శించకుండా, వాహనాల పార్కింగ్ ధరలను పెంచకుండా చూడాలని కోరాడు. -
మహిళలకు విజిల్ అంకితం
‘‘తమిళంలో ‘బిగిల్’ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో తెలుగులో ‘విజిల్’కి కూడా అంతే క్రేజ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. ఇదేదో తమిళ సినిమా అనో.. దక్షిణాది సినిమా అనో చెప్పడం కంటే ఇండియన్ సినిమా అని చెప్పడానికి సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో కంటెంటే కింగ్’’ అని నిర్మాత మహేష్ కోనేరు అన్నారు. ‘పోలీస్, అదిరింది’ వంటి చిత్రాల తర్వాత హీరో విజయ్–డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘బిగిల్’. నయనతార హీరోయిన్. ఏజీయస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కల్పాతి ఎస్.అఘోరాం, కల్పాతి ఎస్.గణేశ్, కల్పాతి ఎస్.సురేశ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ‘విజిల్’ పేరుతో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రేపు ఈ సినిమా విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘అట్లీగారి సినిమాలకు పెద్ద ఫ్యాన్‌ని. విజయ్‌గారితో ఆయన చేసిన సినిమాలకు తెలుగులో పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. ‘విజిల్’ బెస్ట్ మూవీగా నిలుస్తుంది’’ అన్నారు. అట్లీ మాట్లాడుతూ– ‘‘నేను తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలని చాలా కాలంగా కల కంటున్నాను.. త్వరలోనే ఆ కల నేరవేరనుంది. ఎన్టీఆర్‌గారు మంచి వ్యక్తి. నా ప్రతి సినిమాకు ఫోన్ చేసి అభినందిస్తుంటారు. ‘విజిల్’ కేవలం ఫుట్‌బాల్ ఆట నేపథ్యంలోనే ఉండదు.. చాలా భావోద్వేగాలుంటాయి. స్త్రీ సాధికారతను తెలియజే సే ఈ సినిమాను మహిళలకు అంకితమిస్తున్నా’’ అన్నారు. -
విజయ్ ‘బిగిల్’ ట్రైలర్ వచ్చేసింది!
-
విజయ్ ‘బిగిల్’ ట్రైలర్ వచ్చేసింది!
తమిళ బడా స్టార్ విజయ్ తాజా సినిమా ‘బిగిల్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ‘బిగిల్’ సినిమా దీపావళి సందర్భంగా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపిస్తుండగా ఆయన సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్.. ఈ సినిమాలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా, కోచ్‌గా విభిన్నమైన షేడ్స్‌తో విజయ్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. పూర్తి మాస్ యాక్షన్ థ్రిలర్‌గా విజయ్ ఫ్యాన్స్‌కు పండుగ బొనాంజాలా సినిమా ట్రైలర్ ఉంది. అట్లీ దర్శకత్వంలో బిగిల్ తెరకెక్కింది. విజయ్ - అట్లీ కాంబినేషన్లో గతంలో వచ్చిన తెరీ, మెర్సల్ సినిమాలు భారీ విజయం సాధించాయి. -
విజయ్ వర్సెస్ విజయ్
సినిమా: దళపతి విజయ్ కథా నాయకుడు, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రతినాయకుడు అయితే ఆ చిత్రం ఎలా ఉంటుంది. మజాగుం టుంది కదా! అయినా అది జరిగే పనేనా అని అనుకుంటున్నారా? జరగబోతోందండీ. విజయ్ హీరోగా నటిం చనున్న తాజా చిత్రంలో విజయ్‌సేతుపతి విలన్‌గా నటించనున్నారు. అవును ఇది అధికార వార్తే. నటుడు విజయ్ ప్రస్తుతం బిగిల్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆయనకు జంటగా నయనతార నటిస్తున్న ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. ఏజీఎస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది. దీపావళి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారాఅద్వాని హీరోయిన్గా నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీన్ని ఎక్స్‌బీ ఫిలింస్ క్రియేషన్స్ పతాకంపై జవీర్ బ్రింటో నిర్మించనున్నారు. ఇది విజయ్ 64వ చిత్రం. దీనికి సంబంధించిన ఫ్రీప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరగుతున్నాయి. అక్టోబరు తొలివారం నుంచి ఈ సంచలన చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా ఇందులో నటుడు విజయ్‌సేతుపతి విలన్‌గా నటించనున్న విషయాన్ని సోమవారం చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించారు. ఇందు కోసం ఆయనకు పారితోషికం భారీగానే ముట్ట జెబుతున్నట్లు వినికిడి. విజయ్‌సేతుపతి కోలీవుడ్ సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. పాత్రలో వైవిధ్యం ఉంటే అది ఎలాంటిదైనా చేయడానికి సిద్ధం అంటున్నారు. అలా పేట చిత్రంలో రజనీకాంత్‌ను ఢీకొనే పాత్రలోనే నటించారు. ఇక సైరా నరసింహారెడ్డి చిత్రంలో విలక్షణ పాత్రలో కనిపించనున్నారు. అదే విధంగా ఇప్పుడు విజయ్‌కు విలన్‌గా మారడానికి రెడీ అవుతున్నారు. -
వివేక్‌పై అభిమానుల ఆగ్రహం
చెన్నై,పెరంబూరు: సీనియర్ హాస్యనటుడు వివేక్‌పై శివాజీగణేశన్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే విజయ్ నటించిన బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై ఆయన చేసిన వ్యాఖ్యలను అన్నాడీఎంకే నాయకులు తీవ్రంగా ఖండించడంతో పాటు, నటుడు విజయ్‌పై ఎదురు దాడి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా అదే వేదికపై నటుడు వివేక్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ని ఇరుకున పడేశాయి. 1980లో శివాజీగణేశ్, వైజయంతిమాల జంటగా నటించిన ఇరుంబుతిరై చిత్రంలోని నెంజిల్ కుడియిరుక్కుం అనే పాటను అపహాస్యం చేసే విధంగా వివేక్ చేసిన వ్యాఖ్యలకు శివాజీగణేశన్ సమూగ నల పేర్వై సమాఖ్య తీవ్రంగా ఖండించింది. ఈ విషయమై ఆ సమాఖ్య అధ్యక్షుడు చంద్రశేఖరన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొందరు వేదికనెక్కే ఛాన్స్ రాగానే అక్కడ చేరిన ప్రజలను చూసి ఏదేదో మాట్లాడతారన్నారు. అందుకు నటుడు వివేక్ అతీతం కాదన్నారు. ఆయన బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై దివంగత మహానటుడు శివాజీగణేశన్ నటించిన ఇరుంబుతిరై చిత్రంలోని నెంజిల్ కుడిఇరుక్కుం అనే పాటను పరిహాసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏ నటుడినైనా పొగుడుకోవచ్చని, ఏ సంగీత దర్శకుడినైనా ప్రశంసించుకోవచ్చని, అయితే ఒకరి ప్రాపకం కోసమే ఎంతో ప్రజాదరణ పొందిన పాటను పరిహసించడం వివేక్‌కు తగదని అన్నారు. నటుడు వివేక్ ఇంతకు ముందు కూడా పరాశక్తి చిత్రంలో శివాజీగణేశన్ న్యాయస్థానంలో చెప్పే సంభాషణలను ఎగతాళి చేసే విధంగా మాట్లాడారని అన్నారు. ఇక ముందు కూడా వివేక్ ఇలానే ప్రవర్తిస్తే అతనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. వివేక్ వివరణ: కాగా శివాజీగణేశన్ అభిమానుల ఆగ్రహానికి స్పందింవిన నటుడు వివేక్ 1980లో శివాజీగణేశన్ నటించిన ఇరుంబుతిరై చిత్రంలోని నెంజిల్ కుడియిరుక్కుం అనే పాటలో ప్రేమ భావం కలుగుతుందనీ, నటుడు విజయ్ చెప్పిన దానిలో మంత్రశక్తిలా అనిపిస్తోందని తాను చెప్పానరి, అభిమానులు, మనసు కలిగిన వారు అర్థం చేసుకోవాలని నటుడు వివేక్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
నోటీసులు వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు
చెన్నై, పెరంబూరు: బిగిల్ చిత్ర వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం బిగిల్. కాగా ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవల స్థానిక తాంబరంలోని సాయిరాం ఇంజినీరింగ్ కళాశాలతో నిర్వహించారు. అక్కడి నుంచే వివాదం మొదలైంది. ఆ వేదికపై నటుడు విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు విజయ్‌పై విమర్శల దాడి చేస్తున్నారు. ఆ వివాదం సద్దుమణగక ముందే మరో అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. అనుమతిపై కళాశాలకు నోటీసులు విజయ్ చిత్రం బిగిల్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడానికి అనమతి ఎలా ఇస్తారని సాయిరామ్ ఇంజినీర్ కళాశాల నిర్వాహానికి ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ఉప కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఈ చర్చలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అంతే కాదు నటుడు విజయ్ వ్యాఖ్యలను సమర్థిస్తోంది. ఆ కళాశాలకు జానీ చేసిన నోటీసులను వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎస్.అళగిరి ఒక బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సాయిరామ్ ఇంజినీరింగ్ కళాశాల వెలుపలే జరిగింది. అయినా ఆ కళాశాలకు నోటీసులు జారీ చేశారు. ఆ కార్యక్రమంలో వేలాది మంది అభిమానుల మధ్య నటుడు విజయ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని తప్పుగా భావించి దానికి ప్రతీకారం తీర్చుకునే విధంగా ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ప్రవర్తిస్తోంది. రాజకీయం చేస్తోందని ఆరోపించారు. అది రాజకీయ కార్యక్రమం కాదని, ప్రైవేట్ కార్యక్రమం. కాబట్టి నోటీసులు జారీ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇలా తమిళనాడులో జరిగిన పలు కార్యక్రమాల్లో పలువురు రాష్ట్ర, కేంద్రానికి చెందిన రాజకీయ నాయకులు పాల్గొన్నారని, అప్పుడు వాటిని వ్యతిరేకిస్తూ ఎందకు నోటీసులు ఇవ్వలేదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి అనుమతి ఉంటోంది. నటుడు విజయ్ ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాదు. ఏ పార్టీకి మద్దతుగా లేరు. లక్షలాది మంది యువకుల అభిమానాన్ని పొందిన అద్భుత నటుడు. ఆయన ఏ రాజకీయ పార్టీని ప్రస్తావిస్తూ మాట్లాడలేదు. అలాంటిది మంత్రి జయకుమార్ ఏదేదో ఊహించుకుని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఏది చూసినా భయపడే పరిస్థితిలో అన్నాడీఎంకే నాయకులు ఉన్నారు. గత ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ స్టెల్లా కళాశాలలో విద్యార్థులతో మాట్లాడడాన్ని రాజకీయం చేసి ఆ కళాశాలకు నోటీసులు జారీ చేశారు. అప్పుడు అన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిచాయి. తాజాగా సాయిరామ్ కళాశాలకు జారీ చేసిన నోటీసులను వెనిక్కి తీసుకోకుంటే త్రీవ పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది అని కేఎస్.అళగిరి హెచ్చరించారు. -
నటుడు విజయ్‌పై ఫిర్యాదు
పెరతంబూరు: బిగిల్ చిత్రంపై వివాదం ఆరంభమైంది. నటుడు విజయ్ నటించే ప్రతి చిత్రానికి వివాదం తలెత్తడం మామూలైంది. పంచాయితీలు, కేసులు, కోర్టులు, ప్రభుత్వం వరరూ ఈ వివాదాలు వెళుతున్నాయి. తాజా చిత్రం బిగిల్‌ను వదిలేలా లేదు. చిత్ర కథానాయకుడు విజయ్‌పై మత్స్య వ్యాపారులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కోవైకు చెందిన అన్నాడీఎంకే నాయకుడు, ఉక్కడం నూతన మార్కెట్లో చెపల దుకాణదారుడు కోళికడై గోపాలం అలియాస్ పళనిస్వామి సహా ఐదుగురు సోమవారం కోవై కలెక్టర్ కార్యాలయంలో నటుడు విజయ్‌పై ఫిర్యాదు చేశారు. అందులో తమిళనాడులోనే కాకుండా భారతదేశంలోని చేపల దుకాణదారులు, మాంసం వ్యాపారుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన నటుడు విజయ్‌కు తమిళ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. మత్య్స, మాంస వ్యాపారులు తమ వృత్తిని ప్రారంభించే ముందు వారు ఉపయోగించే కత్తులకు నమస్కరిస్తారన్నారు. అలాంటి కత్తులపై నటుడు విజయ్ కాలు పెట్టి కూర్చున్న దృశ్యంతో కూడిన బిగిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారన్నారు. ఇది మత్స్య, మాంసాల వ్యాపారుల మనోభావాలకు భంగం కలిగించే ఉందని పేర్కొన్నారు. ఆ సన్నివేశాలను చిత్రం నుంచి తొలగించకుంటే దేశ వ్యాప్తంగా మత్స్య, మాంసం వ్యాపారుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే నటుడు విజయ్‌కు, ఆ చిత్ర దర్శకుడు అట్లీకీ, చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎన్‌కు లాయర్ ద్వారా నోటీసులు పంపినట్లు తెలిపారు. -
కావాలంటే నా బ్యానర్లు తీసేయండి : విజయ్
జీవితం కూడా ఫుట్‌బాల్ క్రీడలాంటిదేనని నటుడు విజయ్ పేర్కొన్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం బిగిల్. మహిళా ఫుట్‌బాల్ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ తండ్రికొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో ఏజీఎస్ సంస్థ నిర్మిస్తోంది. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం రాత్రి చెన్నైలోని ఒక ప్రైవేట్ కళాశాలలో జరిగింది. విజయ్ అభిమానుల కోలాహలం మధ్య జరిగిన ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు విజయ్ మాట్లాడుతూ జీవితం కూడా ఫుట్‌బాల్ క్రీడలాంటిదేనన్నారు. మనం గోల్ వేయడానికి ప్రయత్నించినప్పుడు దాన్ని అడ్డుకోవడానికి ఒక టీమ్ వస్తుందన్నారు. మనలో ఉన్న వాడే పోటీ జట్టు కోసం గోల్ వేస్తాడన్నారు. ఎవరి గుర్తింపును సొంతం చేసుకోవద్దని, మీ కంటూ ఒక గుర్తింపును పొందే ప్రయత్నం చేయాలని అన్నారు. కష్టపడి పని చేసిన వారిని వేదిక ఎక్కించి సంతోషపడే అభిమానులే యజమానులని పేర్కొన్నారు. ఈ వేడుకలోఇటీవల కటౌట్ పడటంతో మరణించిన శుభశ్రీ కుటుంబానికి తన సానుభూతి తెలిపారు విజయ్. ఇక్కడ ఎవరిని అరెస్ట్ చేయాలో వారిని వదిలేసి బ్యానర్లను అతికించిన వారిని, పోస్టర్లను చింపిన వారిని అరెస్ట్ చేస్తున్నారని అధికారులపై చురకలు వేశారు. తన బ్యానర్లు, కటౌట్లు చింపుతున్నప్పుడు అభిమానులు పడే బాధ తనకు కలుగుతుందన్నారు. అభిమానులను కొట్టకండి తన సినిమాల బ్యానర్లను తొలగించండి. అయితే అభిమానులపై చెయ్యి చేసుకోకండని కోరారు. అభిమానులు ఆశగా, ఇష్టంగా బ్యానర్లు కడుతున్నారని, వాటిని చించితే వారికి కోపం రావడం న్యాయమేనని అన్నారు. ఈ వేడుకకు నయనతార డుమ్మా కొట్టడం అభిమానులను ఒకింత నిరాశకు గురిచేసింది.