చెన్నై,పెరంబూరు: కోర్టులు, కేసులు, ఆరోపణలు, వ్యతిరేకతలను అధిగమించి బిగిల్ చిత్రం శ్రువారం తెరపైకి రానుంది. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం బిగిల్. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో నయనతార నాయకిగా నటించింది. ఏజీఎస్ సంస్థ నిర్మించిన బిగిల్ రాజకీయ నేపథ్యానికి దూరం కావడంతో ఎలాంటి సమస్యలు తలెత్తవని, చిత్ర బృందం, సినీ వర్గాలు భావించారు.అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్మక్రమం నుంచే సమస్యలు తలెత్తడం మొదలయ్యాయి. చివరికి రాష్ట్రప్రభుత్వం నుంచి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. అంతే కాకుండా దర్శక నిర్మాతలపై కథ తస్కరణ ఆరోపణలు వచ్చాయి. చెన్నైకి చెందిన అంజత్‌మీరాన్ అనే వ్యక్తి చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను పుట్‌బాల్ నేపథ్యంలో రాసిన బ్రెజిల్ అనే కథనే తస్కరించి బిగిల్ పేరుతో చిత్రం రూపొందించినట్లు ఆరోపించారు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి ఎస్.సతీష్‌కుమార్ పూర్తి వివరాలతో మరోసారి పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా పిటిషన్‌దారుడిని ఆదేశించారు. ఈ కేసును నవంబరు 5న విచారించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో బిగిల్ చిత్రం విడుదలకు సమస్యలు తొలిగిపోయాయి. నిర్ణయించిన ప్రకారం శుక్రవారం చిత్రం తెరపైకి రానుంది.
విజయ్ భయపడకూడదు
దీపావళికి విడుదలవుతున్న చిత్రాలకు ప్రత్కేక ఆటల ప్రదర్శనలకు అనుమతి లేదని, నిబంధలనకు విరుద్ధంగా ప్రదర్శిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర సమాచార ప్రసార శాఖా మంత్రి కడంబూర్ రాజు గురువారం మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు. అదే విధంగా ప్రత్యేక ప్రదర్శనలకు ప్రేక్షకులు కొనుగోలు చేసిన అడ్వాన్స్ టిక్కెట్ల ధరలను వారికి వాపస్ చేయాలని అన్నారు. కాగా దీనిపై స్పందించిన నామ్‌తమిళర్ పార్టీ నేత, సినీ దర్శక, నటుడు ఇదంతా కక్ష సాధింపు చర్య అని విమర్శించారు. బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో విజయ్ చేసిన వ్యాఖ్యల కారణంగానే ప్రభుత్వం ఆ చిత్రానికి ప్రత్యేక షోల ప్రదర్శనలకు అనుమతి నిరాకరించినట్లు ఆరోపించారు. ఇలాంటి వాటికి విజయ్ భయపడరాదని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment