బిగిల్ చిత్రంలో ఓ దృశ్యం, అడ్వాన్స్ బుక్కింగ్ కోసం జోరు వానలో క్యూ కట్టిన జనం
తమిళనాడు,పెరంబూరు: నటుడు విజయ్ చిత్రాలకు విడుదల సమయాల్లో ఆటంకాలు ఎదురవడం పరిపాటిగా మారింది. గతంలో తలైవా, కత్తి, తుపాకీ చిత్రాల నుంచి ఆ మధ్య తెరపైకి వచ్చిన మెర్శల్, సర్కార్ చిత్రాల వరకూ కథల తస్కరణ ఆరోపణలు, కోర్టులు, కేసులు, ప్రభుత్వ ఆంక్షలు అంటూ రచ్చ జరుగుతూనే ఉంది. ఆ రచ్చ నుంచి విజయ్ నటించిన తాజా చిత్రం బిగిల్ కూడా తప్పించుకోలేక పోయింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. అయితే చిత్ర ఆడియో విడుదల సమయంలోనే వివాదాలను ఎదుర్కొంది. విజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దీంతో అప్పుటి నుంచి బిగిల్ చిత్రంపై రచ్చ స్టార్ట్ అయ్యింది. ఆ తరువాత మత్యకారుల నుంచి కులం పేరుతో విమర్శంచారని ఒక వర్గం కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఇక బిగిల్ కథ తమదేనంటూ కొందరు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అందులో ఒక పిటీషన్ గురువారం విచారణకు రానుంది.
ప్రభుత్వం షాక్..
ఇక విజయ్ చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌లు ఇస్తూనే ఉంది. బిగిల్ ప్రత్యేక ఆటల ప్రదర్శనలకు అనుమతి లేదంటూ షాక్ ఇచ్చింది. సమాచార, ప్రచారశాఖా మంత్రి కడంబూర్ రాజు దీపావళి సందర్భంగా విడుదలయ్యే చిత్రాలకు ప్రత్యేక షోలకు అనుమతి లేదంటూ వెల్లడించారు. సాధారణంగా దీపావళి, సంక్రాంతి వంటి పండగల సందర్భంగా విడుదలయ్యే చిత్రాలకు ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతిస్తుంది. గత సంక్రాంతికి విడుదలయిన రజనీకాంత్ నటించిన పేట, అజిత్ నటించిన విశ్వాసం వంటి చిత్రాలకు వేకువ జామున 4 గంటటకు, అర్ధరాత్రి ఒంటి గంట షోలకు అనుమతించారు. కానీ ఇప్పుడు విజయ్ చిత్రానికి అనుమతి నిరాకరించారు. దీంతో బిగిల్ చిత్రంతో పాటు కార్తీ నటించిన ఖైదీ చిత్రానికి కూడా ప్రత్యేక అనుమతులు లభించలేదు.
ప్రత్యేక ప్రదర్శనలకు విన్నపాలు
భారీ బడ్జెట్‌తో బిగిల్ తెరకెక్కింది. సినిమా బిజినెస్‌కూడా అదే రేంజ్‌లో జరిగింది. ప్రత్యేక షోలు పడితేనే బయ్యర్లు కానీ, థియేటర్ల యాజమాన్యం పెట్టుబడిని రాబట్టకుని బతికి బట్టగలిగే పరిస్ధితి. అయితే వారందరికీ షాక్ ఇస్తూ ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతి నిరాకరించింది. చిత్ర నిర్మాత ఎజీఎస్ సంస్థ అధినేత అఘోరం, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియన్ ప్రత్యేక షోలకు అనుమతివ్వాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి నిరాకరణకు కారణాలను చెబుతోంది. ప్రత్యేక షోలకు టిక్కెట్లను అధిక ధరలకు విక్రయించి ప్రజలపై భారం మోపుతున్నారంటూ ఆరోపిస్తోంది. గతంలో రజనీకాంత్ నటించిన పేట చిత్రానికి ఒక్కో టిక్కెట్టను రూ.500 వరకూ విక్రయించారు. ఇక అజిత్ నటించిన విశ్వాసం చిత్రానికి ఏకంగా రూ. 500 నుంచి రూ.1500ల వరకూ అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు విజయ్ నటించిన బిగిల్ చిత్రానికి కొన్ని ధియేటర్లలో రూ. 2000ల వరకూ టిక్కెట్ థరను పెంచి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణం గానే ప్రభుత్వం ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతినివ్వరాదని నిర్ణయం తీసుకుంది.
టిక్కెట్ల ధరను పెంచితే రద్దే..
థియేటర్లల్లో టిక్కెట్టు ధరను పెంచితే మొదటి దఫాగా రూ. 50, రెండవ దఫా లక్ష రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మూడోసారి థియేటర్ పరిమితులనే రద్దు చేస్తామని మంత్రి కడంబూర్ రాజు హెచ్చరించారు. అయితే ఆయన హెచ్చరికలను లెక్క చేయకుండా ఇప్పటికే బిగిల్ చిత్రానికి టిక్కెట్ ధరను రూ. 500 నుంచి రూ.2000ల వరకూ విక్రయిస్తున్నారు. విజయ్ అభిమానులు జోరు వానను సైతం లెక్క చేయకుండా థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు.
కడంబూర్ రాజుపై విమర్శల దాడి
కాగా బిగిల్ చిత్రానికి ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి లేదన్న మంత్రి కడంబూర్ రాజుపై నటుడు విజయ్ అభిమానులు విరుచుకు పడుతున్నారు. రాయడానికి అలవికాని భాషలో సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తున్నారు. అయితే అన్నాడీఎంకే కార్యకర్తలు వారిపై ప్రతి విమర్శలు చేస్తూ ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద విజయ్ చిత్రం ఆయన అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తల మధ్య చిచ్చు రాజేసింది.
బిగిల్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు..
ఇకపోతే బిగిల్‌కు ఫిర్యాదుల బెడద తప్పలేదు. దేవరాజన్ అనే వ్యక్తి బుధవారం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. బిగిల్, ఖైదీ చిత్రాల టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని అందులో పేర్కొన్నాడు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తున్న థియేటర్ల అనుమతులను రద్దు చేయాలని, ఇప్పటికే అధిక ధరలకు విక్రయించిన డబ్బును వాపస్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నాడు. అదే విధంగా ప్రత్యేక షోలను ప్రదర్శించకుండా, వాహనాల పార్కింగ్ ధరలను పెంచకుండా చూడాలని కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment