ట్విట్టర్‌ లాగితే.. కరెన్సీ కదిలింది | Bigil Producer Daughter Tweet on Movie Succees And IT Focus | Sakshi
Sakshi News home page

ట్విట్టర్‌ లాగితే.. కరెన్సీ కదిలింది

Published Fri, Feb 7 2020 11:31 AM | Last Updated on Fri, Feb 7 2020 1:13 PM

Bigil Producer Daughter Tweet on Movie Succees And IT Focus - Sakshi

చెన్నై సమీపంలోని పనైయూర్, సీషోర్‌ టౌన్, 3వ అవెన్యూలో ఉన్న విజయ్‌ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తుండగా బయట పోలీసుల భద్రత. విజయ్, అన్బుసెళియన్‌

తమ సినిమా ఘన విజయం సాధించిందని ఉప్పొంగిన ఉత్సాహంతో నిర్మాత కుమార్తె ట్వీట్‌ చేసిన సందేశం ఆదాయపు పన్నుశాఖ అధికారులనుఆకర్షించింది. హీరో, నిర్మాత దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్‌లోని తేడాలు పన్ను ఎగవేతను నిర్ధారించుకునేలా చేసింది. మొత్తం మీద ట్విట్టర్‌ లాగితే నటుడువిజయ్, ఫైనాన్షియర్‌ అన్బుసెళియన్‌ల డొంక కదిలింది.కోట్ల కొద్దీ విలువైన నగదు, సొత్తు పట్టుబడింది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏజీఎస్‌ సంస్థ అధిపతి కల్పాత్తి అఘోరా చెన్నై తేనాంపేటలో సంస్థ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకుని సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు సినిమా ఫైనాన్స్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2006 నుంచి నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన ఏజీఎస్‌ సంస్థ ఇప్పటి వరకు 20 చిత్రాలు నిర్మించింది. రూ.180 కోట్లతో విజయ్‌ హీరోగా నిర్మించిన బిగిల్‌ చిత్రాన్ని గత ఏడాది దీపావళి సమయంలో విడుదల చేసింది. ఈ చిత్రం ఘన విజయం సాధించి రూ.200 కోట్ల లాభాలను ఆర్జించింది. బిగిల్‌ చిత్రం వసూళ్లలో జాతీయ స్థాయిలో టాప్‌ 10లో స్థానాన్ని దక్కించకున్నట్లు నిర్మాత కల్పాత్తి అఘోరా కుమార్తె అర్చన తన ట్విట్టర్‌లో పెట్టారు.

ఐటీ రిటర్న్స్‌ దాఖలులో అనుమానాలు  
ఏజీఎస్‌ సంస్థ ఐటీ రిటర్న్స్‌ దాఖలులో బిగిల్‌ చిత్రానికి విజయ్‌కు ఇచ్చిన రెమ్యునరేషన్‌ను పొందుపరిచారు. విజయ్‌ దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌కు సంస్థ చూపిన లెక్కలకు పొంతనలేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది. దొంగలెక్కల ద్వారా తక్కువ ఆదాయం చూపుతూ కోట్లాది రూపాయాల పన్ను ఎగవేసిన అభియోగంపై విజయ్, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న సినీ ఫైనాన్షియర్, ఏజీఎస్‌ నిర్మాణ సంస్థ అధినేత అన్బుసెళియన్‌ ఇళ్లు, కార్యాలయాలు, ఏజీఎస్‌ సినిమా థియేటర్లు సహా 38 చోట్ల బుధవారం ప్రారంభమైన ఐటీశాఖ తనిఖీలు గురువారం కూడా కొనసాగాయి. ఒక్క అన్బుసెళియన్‌ ఇల్లు, కార్యాలయంలోనే రూ.77 కోట్ల నగదు, రూ.24 కోట్ల విలువైన కిలో వజ్రాలు, డైమండ్‌రాళ్లు, బంగారంతోపాటు రూ.300 కోట్ల విలువైన స్థిరాస్థిపత్రాలు పట్టుబడినట్లు సమాచారం. కట్టలు కట్టలుగా కరెన్సీని కుక్కి ఉన్న అనేక జిప్‌ బ్యాగ్‌లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకుల్లో వినియోగించే ఆటోమేటిక్‌ మెషిన్‌లను తెప్పించి నగదును లెక్కించారు.

చెన్నై పనయూరు, సాలిగ్రామంలో విజయ్‌ ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు ప్రారంభించారు. ఐటీ అధికారులు దాడులు చేపట్టినపుడు విజయ్‌ నైవేలీలో మాస్టర్‌ చిత్రం షూటింగ్‌లో ఉన్నారు. ఐటీ అధికారులుఅక్కడికి వెళ్లి విచారణ నిమిత్తం తమకారులో ఎక్కించుకుని చెన్నైకి తీసుకొచ్చారు. షూటింగ్‌ అర్ధంతరంగా నిలిచిపోయింది. తన కారులో లేదా విమానంలో వస్తానని విజయ్‌ కోరినా అధికారులు అంగీకరించలేదు. 15 మంది అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు, డాక్యుమెంట్లపై పనయూరులోని ఇంట్లో విజయ్‌ను విచారించారు. విజయ్‌ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్లను అధికారులు తీసుకెళ్లారు. సుమారు రూ.100 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. అన్బుసెళియన్, విజయ్‌ వారి కుటుంబీకులు, స్నేహితుల బ్యాంకు లాకర్లను కూడా తనిఖీ చేయాలని నిర్ణయించారు.      

అభిమానుల్లో ఆగ్రహం
తమ అభిమాన నటుడు విజయ్‌ను షూటింగ్‌ను నిలిపివేయించి మరీ తీసుకురావడం ఏమిటని ఆయన అభిమానులు ఐటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా వెంటపెట్టుకుని తీసుకెళ్లడానికి విజయ్‌ ఏమన్నా తీవ్రవాదా అని ప్రశ్నిస్తున్నారు. వందలాది మంది అభిమానులు విజయ్‌ ఇంటి ముందు గుమికూడి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు బందోబస్తు పెట్టాల్సి వచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement