![Bigil: Filmmaker Chinni Kumar To Move court over Copyright Issue - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/30/Chinni-Kumar.jpg.webp?itok=rUxFkrfy)
సాక్షి, హైదరాబాద్ : తాను కాపీరైట్స్ తీసుకున్న కథను మరొకరికి విక్రయించిన వ్యక్తిపై, ఆ కథతో సినిమాను తెరకెక్కించిన నిర్మాత, నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని రచయిత డాక్టర్ నంది చిన్నికుమార్ విజ్ఞప్తి చేశాడు. మంగళవా రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ఆమీర్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే ‘సత్యమేవ జయతే’ కార్యక్రమంలో నాగ్‌పూర్‌కు చెందిన అఖిలేపాల్ అనే వ్యక్తి జీవిత కథను విన్నానని తెలిపారు. ఆయన ఓ మురికివాడలో పుట్టి ఎన్నో నేరాలు చేసి తర్వాత ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎదిగి బ్రెజిల్‌లో జరిగిన సాకర్ కప్ టోర్నమెంట్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడన్నారు. ప్రస్తుతం మురికివాడల్లోని, రెడ్‌లైట్ ఏరియాల్లోని పిల్లలకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అతని జీవిత కథ తనకెంతో నచ్చడంతో ఆయన దగ్గరికెళ్లి సినిమా తీసేందుకు 2018 మార్చి 19న కాపీరైట్స్ అగ్రిమెంట్ చేసుకున్నానని వివరించారు. ఇందుకు కొంత నగదు కూడా చెల్లించినట్లు పేర్కొన్నారు.
తాను సినిమా స్టోరీ అంతా సిద్ధం చేసుకొని... నటీనటులు, నిర్మాతల కోసం వెతుకుతున్నానన్నారు. కాగా ఇటీవల విడుదలైన విజిల్ (తెలుగు), తమిళ్‌లో (బిగిల్) సినిమా తాను కాపీరైట్స్ తీసుకున్నదేనన్నారు. దీనిపై పాల్‌ను సంప్రదించగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా బృందాన్ని సంప్రదించినా స్పందన లేదన్నారు. దీంతో తెలంగాణ సినిమా రైటర్స్ అసోసియేషన్, సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లోనూ అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేయగా, వారు బాధ్యులపై కేసు నమోదు చేశారన్నారు. దీనిపై త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment