'కాంగ్రెస్ను వీడుతున్నందుకు బాధగా ఉంది'
హైదరాబాద్ : త్వరలో టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్రావు, రవీంద్ర నాయక్, మాజీ ఎంపీ వివేక్, మాజీమంత్రి వినోద్ తదితరులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 15న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. ఎంపీ గుత్తా, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్‌లు అధికార పార్టీలో చేరనున్నారు. మాజీ ఎంపీ వివేక్ నివాసంలో సమావేశమై ... పార్టీ మార్పుపై చర్చించారు. భేటీ అనంతరం ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు.
అయితే కాంగ్రెస్ను వీడుతున్నందుకు బాధగా ఉందన్నారు. అవసరం అయితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని గుత్తా స్పష్టం చేశారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ రెండేళ్లలో కేసీఆర్ ఎన్నో మంచి పథకాలు చేపట్టారన్నారు. దేవరకొండ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ తెలిపారు. కాగా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తమని కలిచి వేశాయన్నారు. అదే సమయంలో కేసీఆర్ తమను పార్టీలోకి ఆహ్వానించారని... ఆయనతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.