సాక్షి, హైదరాబాద్: తమపై అనర్హత వేటు వేస్తూ హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ఈ నెల 8న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్ష, కార్యదర్శులుగా వ్యవహరించిన జి.వివేక్, టి.శేష్ నారాయణ్‌లు హైకోర్టును ఆశ్రయించారు. అంబుడ్స్‌మన్ తీర్పుపై వీరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తిస్థాయి వాదనల నిమిత్తం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అంబుడ్స్‌మన్ ముందు వివేక్‌కు వ్యతిరేకంగా మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ తదితరులు పిటిషన్ దాఖలు చేశారు. శేష్ నారాయణ్‌కు వ్యతిరేకంగా సాగర్ క్రికెట్ క్లబ్ కార్యదర్శి బాబూరావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన అంబుడ్స్‌మన్ జస్టిస్ నర్సింహారెడ్డి, హెచ్‌సీఏకు అధ్యక్షుడిగా ఉన్న వివేక్, హెచ్‌సీఏతో వాణిజ్యపరమైన ఒప్పందం ఉన్న విశాక ఇండస్ట్రీస్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించడం విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందంటూ ఈ నెల 8న తీర్పునిచ్చారు. అలాగే హెచ్‌సీఏ అవినీతి కేసుల్లో దాఖలైన చార్జిషీట్‌ల్లో శేష్ నారాయణ్ పేరు ఉన్నందున ఆయన కార్యదర్శిగా కొనసాగడానికి వీల్లేదని జస్టిస్ నర్సింహారెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. తమ తమ విషయాల్లో అంబుడ్స్‌మన్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఇరువురు కూడా తమ పిటిషన్‌లలో కోర్టును కోరారు. విశాక ఇండస్ట్రీస్‌తో తనకున్న సంబంధాలరీత్యా తన కంపెనీకీ, హెచ్‌సీఏకు మధ్య ఉన్న వివాదంపై తీసుకునే నిర్ణయాల్లో తాను పాలు పంచుకోనని, ఈ విషయంలో మార్గదర్శకం చేయాలని అంబుడ్స్‌మన్/హెచ్‌సీఏ ఎథిక్స్ ఆఫీసర్‌ను రాతపూర్వకంగా కోరానని, అయితే ఇప్పటి వరకు దానిపై ఆయన స్పందించకపోగా... ఇప్పుడు తనను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చారని వివేక్ తెలిపారు.
తాను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అనర్హుడినని ప్రకటించడానికి తాను ప్రభుత్వ సలహాదారుగా ఉండటాన్ని కూడా అంబుడ్స్‌మన్ కారణంగా చూపారని, వాస్తవానికి ఈ విషయం అంబుడ్స్‌మన్ న్యాయ పరిధికి సంబంధించింది కాదని ఆయన స్పష్టం చేశారు. లోధా కమిటీ సిఫారసుల ప్రకారం చార్జిషీట్‌లో పేరు ఉన్న వ్యక్తికి అనర్హత వర్తిస్తుందని ఎక్కడా చెప్పలేదని శేష్ నారాయణ్ తన పిటిషన్‌లో వివరించారు. ఈ విషయాన్ని అంబుడ్స్‌మన్ పట్టించుకోలేదన్నారు. చార్జ్‌షీట్‌లో పేరున్నంత మాత్రాన అనర్హుడిగా ప్రకటించడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. కాబట్టి అంబుడ్స్‌మన్ తీర్పును కొట్టేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment