అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే హెచ్-1బీ (H-1B) వీసాల జారీని ఎత్తేస్తానని రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) పేర్కొన్నారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను "ఒప్పంద దాస్యం"గా అభివర్ణించారు. లాటరీ ఆధారిత ఈ వీసా వ్యవస్థను తొలగించి దాన్ని మెరిటోక్రాటిక్ అడ్మిషన్‌తో భర్తీ చేస్తానని ప్రమాణం చేశారు.
అమెరికా వెళ్లే భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా కోరుకునేది హెచ్-1బీ వీసానే. ఇది వలసేతర వీసా. సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి యూఎస్ కంపెనీలకు ఇది అనుమతిస్తుంది.
(Unemployment Fraud: వామ్మో రూ. 11 లక్షల కోట్లా..? అత్యంత భారీ నిరుద్యోగ మోసమిది!)
భారత్, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం సుమారు 10 వేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్నాలజీ కంపెనీలు ఈ హెచ్-1బీ వీసాపైనే ఆధారపడుతుంటాయి. రామస్వామి స్వయంగా ఈ వీసా ప్రోగ్రామ్‌ను 29 సార్లు ఉపయోగించుకోవడం గమనార్హం.
రామస్వామి స్వయంగా 29 దరఖాస్తులు
2018 నుంచి 2023 వరకు రామస్వామి పూర్వ కంపెనీ రోవాంట్ సైన్సెస్ కోసం H-1B వీసాల కింద ఉద్యోగులను నియమించుకోవడానికి 29 దరఖాస్తులను యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆమోదించింది. అయినప్పటికీ H-1B వీసా వ్యవస్థ సక్రమంగా లేదని రామస్వామి చెప్పినట్లుగా యూఎస్ రాజకీయ వార్తా పత్రిక పొలిటికో పేర్కొంది.
రామస్వామి 2021 ఫిబ్రవరిలో రోవాంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి వైదొలిగారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రకటించే వరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుడిగా ఆయన కొనసాగారు. స్వతహాగా వలసదారుల సంతానమైన రామస్వామి.. ఇమ్మిగ్రేషన్ పాలసీని ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. సరిహద్దును కాపాడుకోవడానికి సైనిక బలగాలను ఉపయోగిస్తానని, అమెరికాలో జన్మించిన పత్రాలు లేని వలసదారుల పిల్లలను బహిష్కరిస్తానని కూడా చెప్పారు.
(దాంట్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి హస్తం ఉంది: యూకే మాజీ ప్రధాని..)
కాగా H-1B వీసాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2021 ఆర్థిక సంవత్సరానికి 85,000 వీసా స్లాట్లు అందుబాటులో ఉండగా అమెరికన్ కంపెనీలు ఏకంగా 7,80,884 దరఖాస్తులను సమర్పించాయి. అంతకుముందు ఏడాది కంటే ఆ సంవత్సరంలో కాగా H-1B వీసా దరఖాస్తులు 60 శాతం కంటే ఎక్కువ పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment