కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి తనయులు వివేక్, వినోద్ టీఆర్ఎస్ను వీడనున్నారా? మళ్లీ సొంత గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారా? జోరందుకుంటున్న ఈ ఊహాగానాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి తనయులు వివేక్, వినోద్ టీఆర్ఎస్ను వీడనున్నారా? మళ్లీ సొంత గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారా? జోరందుకుంటున్న ఈ ఊహాగానాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదివారం వీరిద్దరూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ను ఆయన ఇంటికెళ్లి కలవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా మామూలు కారులో దిగ్విజయ్ ఇంటికెళ్లడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై వివేక్, వినోద్లు డిగ్గీ రాజాతో చర్చించినట్టు సమాచారం. గంటకు పైగా సమావేశమయ్యారు. వీరిద్దరూ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వివేక్, వినోద్ టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా ఖండించకపోవటం విశేషం. వివేక్ తాజా ఎంపీ కాగా, వినోద్ మాజీ మంత్రి.
ఎంపీ వివేక్, రాజ్యసభ మాజీ సభ్యుడు కె కేశవరావు, నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథంలు కాంగ్రెస్ పార్టీని వీడి గతేడాది జూన్ 2 న టీఆర్ఎస్ లో చేరారు. అయితే అప్పట్నుంచే వివేక్ పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టు ఉంటూ వస్తున్నారు.