హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాలేదని అమర జవాను కుమారుడు వాపోయాడు.
సిమ్లా: ప్రభుత్వ ఉద్యోగం, రూ. 5 లక్షల పరిహారం ఇస్తామని హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు కాలేదని అమరజవాను బల్దేవ్ కుమార్ శర్మ కుమారుడు వివేక్ వాపోయాడు. ఉద్యోగం ఇవ్వలేమంటూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం నుంచి తనకు లేఖ వచ్చిందని చెప్పాడు. తన తండ్రి పారా మిలటరీ దళానికి చెందినందున ఉద్యోగం ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వం తెలిపిందన్నాడు.
తనకు ఇచ్చిన హామీని ప్రభుత్వం కొద్ది నెలల్లోనే మరిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అమరజవాన్ల కుటుంబాలను ప్రత్యక్షంగా సందర్శించి, వారు పడుతున్న బాధలు చూడాలని పాలకులకు సూచించాడు. ప్రభుత్వం వాగ్దానం చేసి నెరవేర్చకపోవడం శోచనీయమని పేర్కొన్నాడు. నిలబెట్టుకోనప్పుడు హామీ ఇవొద్దని వివేక్ కోరారు. మే నెలలో మణిపూర్ లో జరిగిన దాడిలో 29 అస్సాం రైఫిల్స్ కు చెందిన బల్దేవ్ కుమార్ శర్మ మృతి చెందిన సంగతి తెలిసిందే.