నాపై కేసీఆర్‌ ఆటబొమ్మలు తప్పుడు ప్రచారం.. | vivek writes open letter to telangana cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు వివేక్‌ బహిరంగ లేఖ

Published Mon, Mar 25 2019 2:03 PM | Last Updated on Mon, Mar 25 2019 2:10 PM

vivek writes open letter to telangana cm kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ వెంకటస్వామి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారు పదవితో పాటు టీఆర్‌ఎస్‌కు వివేక్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఒక పథకం ప్రకారమే తాను పోటీ చేసే అవకాశం లేకుండా కేసీఆర్‌ చివరి క్షణంలో పెద్దపల్లి లోక్‌ సభ టికెట్‌ నిరాకరించారని ఆయన తన లేఖలో ఆరోపించారు. ఈ సందర్భంగా వివేక్‌ తీవ్రస్థాయిలో టీఆర్ఎస్‌ పార్టీ విమర్శలు గుప్పించారు. చదవండి... (టీఆర్‌ఎస్‌కు వివేక్‌ రాజీనామా)

‘కేసీఆర్‌ ఆటబొమ్మలు కొందరు నా మీద తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడాన్ని బట్టే ఎవరు ద్రోహం చేశారో తెలిపోయింది. నా తండ్రి కాకా, నేను తెలంగాణ సాధనే లక్ష్యంగా రాజీలేని పోరాటం చేశాం. తెలంగాణ మేలు కోసమే కేసీఆర్ ఆహ్వానిస్తే పార్టీలోకి వచ్చాను. తెలంగాణ కోసం పని చేయడం, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా పోరాడడమే పార్టీకి ద్రోహం చేయడమా?. పార్టీ బలహీనంగా ఉన్నచోట పటిష్టం చేయడానికి పని చేయడమే నేను చేసిన ద్రోహమా?. 2014లో టీఆర్ఎస్ ఇద్దరు ఎంపీలే ఉంటే నేను తోటి ఎంపీలతో కలిసి బిల్లు ఆమోదం కోసం జాతీయ పార్టీలపై ఒత్తిడి తేవడమే నేను చేసిన ద్రోహమా?. చదవండి....(వివేక్‌ ఔట్‌.. వెంకటేశ్‌కే టికెట్‌)

తెలంగాణ సాధనలో కాకా సేవలకు గుర్తింపుగానే ట్యాంక్ బండ్‌పై విగ్రహం పెట్టారు. టికెట్ హామీ ఇచ్చి కూడా నన్ను పెద్దపల్లికి దూరంగా ఉంచడానికే కేసీఆర్ తొత్తులు కొందరు పనిచేశారు. ప్రభుత్వ సలహాదారుగా ఎలాంటి ప్రయోజనాలు తీసుకోకపోగా, ఆ పదవి వల్లే హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడి పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇదే నేను చేసిన ద్రోహం కావచ్చు. నా ప్రజలకు నన్ను దూరం చేయడానికి చేసిన ఈ ద్రోహం నాకు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఉద్యమంలో ఏ పాత్ర లేనివాళ్లకు, కనీసం జై తెలంగాణ అని నినాదం కూడా చేయనివాళ్లకు టికెట్లిచ్చారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా ఉద్యమకారులను పక్కన బెట్టారు. (కేసీఆర్‌ నమ్మించి గొంతు కోశారు: వివేక్‌)

తెలంగాణకు, ప్రజలకు వ్యతిరేకంగా పని చేసినవాళ్లే ఇప్పుడు పార్టీకి పెద్ద ముఖాలుగా ఉండడం బాధిస్తోంది. ప్రజాస్వామిక తెలంగాణ సాధించాలన్న ఆశయం నెరవేరకపోగా నియంతృత్వ పోకడలను ప్రజల మీద రుద్దుతున్నారు. ఈ విషయాన్ని జనం త్వరలోనే గుర్తిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, మద్దతుదారులు కోరుతున్నా కూడా సమయం తక్కువగా ఉండడం వల్ల పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. జీవితాంతం తెలంగాణ ప్రజల మేలు కోసం పనిచేస్తూనే ఉంటా. కష్టకాలంలో తోడున్న మద్దతుదారులకు ధన్యవాదాలు.’  అని వివేక్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. (‘వివేక్‌ దళితుడు కాదు’)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement