G.vivekananda
-
నామినేషన్ తిరస్కరణ.. వివేక్ ఆగ్రహం
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవి కోసం తాను దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించడం అన్యాయమని మాజీ అధ్యక్షుడు జి.వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగ ళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫిక్సింగ్‌కు పాల్పడిన అజహరుద్దీన్‌ను వెనుకేసుకొస్తూ, క్రికెట్ అభివృద్ధికి కృషి చేసిన తన నామినేషన్‌ను తిరస్కరించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ‘క్రమశిక్షణా కమిటీ విచారణలో తాను ఫిక్సింగ్ చేసినట్లు స్వయంగా అజహరుద్దీన్ ఒప్పుకున్నారు. అయినా అతని నామినేషన్ స్వీకరించారు. ఇప్పటికీ బీసీసీఐ అతనిపై నిషేధాన్ని ఎత్తివేయలేదు. నిషేధాన్ని ఎత్తివేస్తే అందుకు సంబంధించిన పత్రాల్ని బయట పెట్టమనండి. బీసీసీఐ నుంచి నిధులు రాకున్నా సొంత ఖర్చుతో టి20 లీగ్ నిర్వహించా. నాపై తప్పుడు రిపోర్టులు సృష్టించి హెచ్‌సీఏకు దూరం చేశారు’ అని ధ్వజమెత్తారు. తమ ప్యానెల్‌నుంచి అధ్యక్షుడిగా ప్రకాశ్ చంద్ జైన్, ఉపాధ్యక్షునిగా దల్జీత్ సింగ్, కార్యదర్శిగా వెంకటేశ్వరన్, సంయుక్త కార్యదర్శిగా శివాజీ యాదవ్‌లను గెలిపించాలని కోరారు. క్రీడల్లోనూ రాజకీయాలు ఎక్కువయ్యాయని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే చక్రం తిప్పుతోన్న కల్వకుంట్ల కుటుంబం... క్రీడల్లోనూ తన వర్గాన్ని తయారుచేసే దిశగా పావులు కదుపుతోందని ఆరోపించారు. ఆ ప్రయత్నంలోనే అజహరుద్దీన్‌తో చేతులు కలిపిన కేటీఆర్ తాజా హెచ్‌సీఏ ఎన్నికల్లో అజహర్‌కే ఓటువేయాలంటూ ఓటర్లని ప్రభావితం చేస్తున్నారన్నారు. అజహరుద్దీన్ తర్వాత కవితకు అవకాశం ఇవ్వాలనే ప్రణాళికతోనే ఇదంతా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. -
నాపై కేసీఆర్ ఆటబొమ్మలు తప్పుడు ప్రచారం..
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారు పదవితో పాటు టీఆర్ఎస్కు వివేక్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఒక పథకం ప్రకారమే తాను పోటీ చేసే అవకాశం లేకుండా కేసీఆర్ చివరి క్షణంలో పెద్దపల్లి లోక్ సభ టికెట్ నిరాకరించారని ఆయన తన లేఖలో ఆరోపించారు. ఈ సందర్భంగా వివేక్ తీవ్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పించారు. చదవండి... (టీఆర్ఎస్కు వివేక్ రాజీనామా) ‘కేసీఆర్ ఆటబొమ్మలు కొందరు నా మీద తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడాన్ని బట్టే ఎవరు ద్రోహం చేశారో తెలిపోయింది. నా తండ్రి కాకా, నేను తెలంగాణ సాధనే లక్ష్యంగా రాజీలేని పోరాటం చేశాం. తెలంగాణ మేలు కోసమే కేసీఆర్ ఆహ్వానిస్తే పార్టీలోకి వచ్చాను. తెలంగాణ కోసం పని చేయడం, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా పోరాడడమే పార్టీకి ద్రోహం చేయడమా?. పార్టీ బలహీనంగా ఉన్నచోట పటిష్టం చేయడానికి పని చేయడమే నేను చేసిన ద్రోహమా?. 2014లో టీఆర్ఎస్ ఇద్దరు ఎంపీలే ఉంటే నేను తోటి ఎంపీలతో కలిసి బిల్లు ఆమోదం కోసం జాతీయ పార్టీలపై ఒత్తిడి తేవడమే నేను చేసిన ద్రోహమా?. చదవండి....(వివేక్ ఔట్.. వెంకటేశ్‌కే టికెట్) తెలంగాణ సాధనలో కాకా సేవలకు గుర్తింపుగానే ట్యాంక్ బండ్‌పై విగ్రహం పెట్టారు. టికెట్ హామీ ఇచ్చి కూడా నన్ను పెద్దపల్లికి దూరంగా ఉంచడానికే కేసీఆర్ తొత్తులు కొందరు పనిచేశారు. ప్రభుత్వ సలహాదారుగా ఎలాంటి ప్రయోజనాలు తీసుకోకపోగా, ఆ పదవి వల్లే హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడి పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇదే నేను చేసిన ద్రోహం కావచ్చు. నా ప్రజలకు నన్ను దూరం చేయడానికి చేసిన ఈ ద్రోహం నాకు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఉద్యమంలో ఏ పాత్ర లేనివాళ్లకు, కనీసం జై తెలంగాణ అని నినాదం కూడా చేయనివాళ్లకు టికెట్లిచ్చారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా ఉద్యమకారులను పక్కన బెట్టారు. (కేసీఆర్ నమ్మించి గొంతు కోశారు: వివేక్) తెలంగాణకు, ప్రజలకు వ్యతిరేకంగా పని చేసినవాళ్లే ఇప్పుడు పార్టీకి పెద్ద ముఖాలుగా ఉండడం బాధిస్తోంది. ప్రజాస్వామిక తెలంగాణ సాధించాలన్న ఆశయం నెరవేరకపోగా నియంతృత్వ పోకడలను ప్రజల మీద రుద్దుతున్నారు. ఈ విషయాన్ని జనం త్వరలోనే గుర్తిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, మద్దతుదారులు కోరుతున్నా కూడా సమయం తక్కువగా ఉండడం వల్ల పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. జీవితాంతం తెలంగాణ ప్రజల మేలు కోసం పనిచేస్తూనే ఉంటా. కష్టకాలంలో తోడున్న మద్దతుదారులకు ధన్యవాదాలు.’ అని వివేక్ ఆ లేఖలో పేర్కొన్నారు. (‘వివేక్ దళితుడు కాదు’) -
పార్లమెంట్లో పొన్నంపై దాడి
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అతి సమీపంలో స్ప్రే చేయడం వల్ల పొన్నం కళ్లు తెరువలేని స్థితిలో అస్వస్థతకు గురయ్యారు. పెద్దపల్లి ఎంపీ జి.వివేకానంద, నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు పొన్నంను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన ఇంటికి వెళ్లారు. పొన్నంపై దాడి ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. దాడికి నిరసనగా జిల్లావ్యాప్తంగా, కాంగ్రెస్, అనుబంధ విభాగాలు, ఉద్యోగ సంఘాలు, జేఏసీలు ఆందోళన నిర్వహించాయి. పరామర్శ పెప్పర్ స్ప్రే దాడికి గురైన ఎంపీని కాంగ్రెస్, టీఆర్ఎస్, టీజేఏసీ నేతలు పరామర్శించారు. ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్న సమయంలోనే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ‘హౌ ఆర్ యూ’ అంటూ పలకరించారు. ధైర్యం చెప్పారు. అనంతరం పొన్నం నివాసంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, తన్నీరు శరత్‌రావు, వోరుగంటి ఆనంద్, పన్యాల శ్యాంసుందర్‌రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు సిద్దం వేణు, ఏనుగు రవీందర్‌రెడ్డి, భూక్యా తిరుపతినాయక్, పొన్నం అనిల్, రాజు తదితరులు పొన్నంను పరామర్శించి, సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీలోనే ఉన్న టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు హమీద్, నర్సింహులు, రాజయ్యగౌడ్ కూడా పొన్నంను పరామర్శించి, సీమాంధ్రుల దాడిని ఖండించారు. నేడు నిరసన దీక్ష పొన్నంపై దాడిని నిరసిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో నిరసన దీక్ష చేపడుతున్నట్లు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కన్న కృష్ణ తెలిపారు. అనంతరం లగడపాటిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. -
ముగ్గురి లొల్లి సీఎం సీటు కోసమే..
సుల్తానాబాద్, న్యూస్‌లైన్: సీమాంధ్ర సీఎం కుర్చీ కోసమే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లొల్లి చేస్తున్నారని పెద్దపల్లి ఎంపీ జి.వివేకానంద ఆరోపించారు. ఆదివారం ఆయన సుల్తానాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు చెబుతున్నారని, కానీ అసెంబ్లీలో తీర్మానం ఉండదని, అభిప్రాయాలు మాత్రమే తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టి రాష్ట్రాన్ని విభజిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేందుకే సీమాంధ్రులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అందరూ సంయమనం పాటించాలని కోరారు. కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాల మేరకే తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. -
అవమానపరుస్తున్నారని ఎంపీ ఆవేదన
మంథని, న్యూస్‌లైన్ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ జి.వివేకానంద మధ్య కొంతకాలంగా రగులుతున్న వివాదం మంగళవారం బహిర్గతమైంది. మంథనిలోని బొక్కలవాగు వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ.కోటి అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎకో పార్కు శంకుస్థాపన ఇరువురి మధ్య వాగ్వివాదానికి దారితీసి గందరగోళాన్ని సృష్టించింది. పార్కు ఏర్పాటు చేయబోయే ప్రదేశానికి మంత్రి శ్రీధర్‌బాబు, టూరిజం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చందనాఖాన్, కలెక్టర్ వీరబ్రహ్మయ్య చేరుకున్నారు. ఎంపీ వివేక్ రాక ఆలస్యం కావడంతో అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక్కరిద్దరు తమ ప్రసంగాలను కానిచ్చేశారు. కొద్దిసేపటికి ఎంపీ అక్కడికి చేరుకున్నారు. తాను రాకుండానే కార్యక్రమం మొదలుపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వస్తూ వస్తూనే ‘వాటిజ్ దిస్’ అంటూ మంత్రివైపు చేయి చూపారు. ఆ మాట వినగానే ‘వాట్ అబౌట్’ అంటూ మంత్రి ప్రశ్నించారు. మీకోసం అరగంటకు పైగా వేచి చూశామని, అయినా శంకుస్థాపన చేయలేదని, ఒకరిద్దరి ప్రసంగాలు మాత్ర మే జరిగాయని శ్రీధర్‌బాబు బదులిచ్చారు. సోమవారం సాయంత్రం పర్యాటక శాఖ అధికారులు తనకు ఫోన్ చేసి పార్కు శంకుస్థాపన విషయాన్ని చెప్పారని ఎంపీ అన్నారు. తనకు మందమర్రిలో డీఆర్సీ సమావేశం ఉందని, శంకుస్థాపన వాయిదా వేసుకోవాలని కోరినా పట్టించుకోలేదని, ఇక్కడికి వస్తే ఈవిధంగా అవమానిస్తారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. గోదావరిఖనిలో కూడా ఎంపీ, ఎమ్మెల్యేలు రాకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, తమను ఎందుకు అవమానిస్తున్నారని, ఏం తప్పు చేశామని ఆయన ప్రశ్నించారు. తాను కార్యక్రమానికి వస్తున్నాననే సమాచారం ఇచ్చినా ఎలా ప్రారంభిస్తారని వివేక్ ఆవేదన వ్యక్తం చేస్తుండగానే.. మరోవైపు ‘ఎంపీ గోబ్యాక్’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి మరింత గందరగోళానికి దారితీసింది. ‘వై గో టు బ్యాక్’ అం టూ ‘ఎంపీనే గోబ్యాక్ అంటారా... నా హక్కు ను ప్రశ్నిస్తే వెళ్లి పొమ్మంటారా... ఇది సరైంది కాద’ంటూ వివేక్ ఆగ్రహానికి లోనయ్యారు. ‘ఆంద్రోళ్ల ముఖ్యమంత్రిని గోబ్యాక్ అనండి... లేక ముఖ్యమంత్రికి చెంచాగిరి చేసేవారిని, తెలంగాణ ద్రోహులను గోబ్యాక్’ అంటే బాగుం టుందని ఎంపీ సూచించారు. ఎవరిని అగౌరపరచడం తన నైజం కాదని, అభివృద్ధి, సంక్షేమ మే ధ్యేయంగా ముందుకుసాగుతున్నానని మంత్రి అన్నారు. ఎవరికైనా అగౌరవం జరిగితే మరోసారి జరగకుండా చూడాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రి, ఎంపీ అనుచరులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా రు. దీంతో కొద్దిసేపు పరిస్థితి అదుపుతప్పింది. ఓవైపు ఎంపీ, మరోవైపు ఇరువురి నాయకుల అనుచరులు వాదోపవాదాలకు దిగడంతో గందరగోళం నెలకొంది. ఎంపీ ప్రసగిస్తుండగా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డు చెప్పగా తన ప్రసంగాన్ని అర్థంతరంగా ముగించారు. మంత్రి కలుగజేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇద్దరు కలిసి శంకుస్థాపన చేయడంతో గొడవ సద్దుమణిగింది.