మంథని, న్యూస్‌లైన్ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ జి.వివేకానంద మధ్య కొంతకాలంగా రగులుతున్న వివాదం మంగళవారం బహిర్గతమైంది. మంథనిలోని బొక్కలవాగు వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ.కోటి అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎకో పార్కు శంకుస్థాపన ఇరువురి మధ్య వాగ్వివాదానికి దారితీసి గందరగోళాన్ని సృష్టించింది. పార్కు ఏర్పాటు చేయబోయే ప్రదేశానికి మంత్రి శ్రీధర్‌బాబు, టూరిజం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చందనాఖాన్, కలెక్టర్ వీరబ్రహ్మయ్య చేరుకున్నారు.
ఎంపీ వివేక్ రాక ఆలస్యం కావడంతో అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక్కరిద్దరు తమ ప్రసంగాలను కానిచ్చేశారు. కొద్దిసేపటికి ఎంపీ అక్కడికి చేరుకున్నారు. తాను రాకుండానే కార్యక్రమం మొదలుపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వస్తూ వస్తూనే ‘వాటిజ్ దిస్’ అంటూ మంత్రివైపు చేయి చూపారు. ఆ మాట వినగానే ‘వాట్ అబౌట్’ అంటూ మంత్రి ప్రశ్నించారు.
మీకోసం అరగంటకు పైగా వేచి చూశామని, అయినా శంకుస్థాపన చేయలేదని, ఒకరిద్దరి ప్రసంగాలు మాత్ర మే జరిగాయని శ్రీధర్‌బాబు బదులిచ్చారు. సోమవారం సాయంత్రం పర్యాటక శాఖ అధికారులు తనకు ఫోన్ చేసి పార్కు శంకుస్థాపన విషయాన్ని చెప్పారని ఎంపీ అన్నారు. తనకు మందమర్రిలో డీఆర్సీ సమావేశం ఉందని, శంకుస్థాపన వాయిదా వేసుకోవాలని కోరినా పట్టించుకోలేదని, ఇక్కడికి వస్తే ఈవిధంగా అవమానిస్తారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. గోదావరిఖనిలో కూడా ఎంపీ, ఎమ్మెల్యేలు రాకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, తమను ఎందుకు అవమానిస్తున్నారని, ఏం తప్పు చేశామని ఆయన ప్రశ్నించారు.
తాను కార్యక్రమానికి వస్తున్నాననే సమాచారం ఇచ్చినా ఎలా ప్రారంభిస్తారని వివేక్ ఆవేదన వ్యక్తం చేస్తుండగానే.. మరోవైపు ‘ఎంపీ గోబ్యాక్’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి మరింత గందరగోళానికి దారితీసింది. ‘వై గో టు బ్యాక్’ అం టూ ‘ఎంపీనే గోబ్యాక్ అంటారా... నా హక్కు ను ప్రశ్నిస్తే వెళ్లి పొమ్మంటారా... ఇది సరైంది కాద’ంటూ వివేక్ ఆగ్రహానికి లోనయ్యారు. ‘ఆంద్రోళ్ల ముఖ్యమంత్రిని గోబ్యాక్ అనండి... లేక ముఖ్యమంత్రికి చెంచాగిరి చేసేవారిని, తెలంగాణ ద్రోహులను గోబ్యాక్’ అంటే బాగుం టుందని ఎంపీ సూచించారు.
ఎవరిని అగౌరపరచడం తన నైజం కాదని, అభివృద్ధి, సంక్షేమ మే ధ్యేయంగా ముందుకుసాగుతున్నానని మంత్రి అన్నారు. ఎవరికైనా అగౌరవం జరిగితే మరోసారి జరగకుండా చూడాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రి, ఎంపీ అనుచరులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా రు. దీంతో కొద్దిసేపు పరిస్థితి అదుపుతప్పింది. ఓవైపు ఎంపీ, మరోవైపు ఇరువురి నాయకుల అనుచరులు వాదోపవాదాలకు దిగడంతో గందరగోళం నెలకొంది. ఎంపీ ప్రసగిస్తుండగా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డు చెప్పగా తన ప్రసంగాన్ని అర్థంతరంగా ముగించారు. మంత్రి కలుగజేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇద్దరు కలిసి శంకుస్థాపన చేయడంతో గొడవ సద్దుమణిగింది.
అవమానపరుస్తున్నారని ఎంపీ ఆవేదన
Published Wed, Oct 9 2013 4:07 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement
Advertisement