కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. జిల్లాలోని పదమూడు అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలను గెలిపించడం ద్వారా తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పాలన్నారు. మంగ ళవారం కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తున్నందున కాంగ్రెస్ వల్లే తెలంగాణ సాధ్యమైందనే విషయాన్ని కార్యకర్తలు ఇంటింటికి తీసుకెళ్లాలని, ఇతర పార్టీల మొసలి కన్నీళ్లను కూడా వివరించాలని సూచిం చారు. తెలంగాణ పునర్నిర్మాణం ముందున్న పెద్ద బాధ్యత అని, రాష్ట్ర ఏర్పాటు ద్వారా ఒక్క మెట్టు మాత్రమే ఎక్కామని, మరో 99 మెట్లు ఎక్కాల్సి ఉందని అన్నారు.
జిల్లాలో బొగ్గు, విద్యుత్ ఉత్పత్తి పెంచుకోవాలని, నూతనంగా పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని ఉద్యోగావకాశాలు పెంచుకోవాలని అన్నారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి పాటుపడి, దశాబ్దకాలంలో బంగారు తెలంగాణను నిర్మించుకోవడమే లక్ష్యమన్నారు. సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ సాధ్యపడేది కాదని, అన్ని పార్టీలను ఒప్పించి రాష్ట్రం ఇచ్చిన ఘనత అధినేత్రిదేనని చెప్పారు. పొన్నం ప్రభాకర్‌తో పాటు, తెలంగాణ ఎంపీల పాత్ర అభినందనీయమన్నారు. సమన్యాయం పేరుతో తెలంగాణను అడ్డుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుట్రపన్నారని విమర్శించారు. దేశంలోని అన్ని పార్టీలను కలిసి తెలంగాణ ఇవ్వకుండా అడ్డుకొనే ప్రయత్నం చేశారని చెప్పారు. అదేసమయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు పెద్దపల్లిలో పాదయాత్ర చేశాడని ఎద్దేవా చేశారు. ఉద్యమ సమయంలో తమను ఎంతో మంది విమర్శించారని, తన తండ్రిపై వ్యాఖ్యలు చేసినా ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసంతో సహించానని అన్నారు. ఎక్కడికి పోయినా రాజీనామా ఎప్పుడు చేస్తావనే వాళ్లని, తాము, పొన్నం ప్రభాకర్ రాజీనామా చేస్తే, అసెంబ్లీ, పార్లమెంట్‌లో బిల్లు పరిస్థితి ఏమయ్యేదో ఊహించాలన్నారు.
ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 60 సంవత్సరాల తెలంగాణ కల సాకారమవుతున్నపుడు పార్లమెంట్‌లో సభ్యుడిని కావడం తన పూర్వజన్మసుకృతమన్నారు. అందరి ఆకాంక్షను తనవంతుగా ఢిల్లీలో వినిపించానన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఎదుర్కోని వేధింపులను, తెలంగాణ కోసం ఉద్యమించినపుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎదుర్కొన్నానని గుర్తుచేశారు. జైలుకు పంపించినా, కటికనేలపై పడుకొన్నా బాధపడలేదని, తెలంగాణ సాధించాలనే కసి మరింత పెరిగిందని చెప్పారు.
తన తండ్రి చనిపోయినపుడు, పెప్పర్‌స్ప్రే దాడిలో కండ్లు పోతాయేమోననే రెండు సందర్భాల్లోనే తాను భయపడ్డానని తెలిపారు. పార్లమెంట్ వేదికగా తామెన్నోసార్లు నిరసన తెలిపినా సోనియాగాంధీ సున్నితంగా మందలించారు తప్ప కఠినంగా వ్యవహరించలేదన్నారు. ఎఫ్‌డీఐపై ఓటింగ్‌కు తాము హాజరుకాకపోతే తమతో సోనియా సమావేశమయ్యారని, అప్పుడు తమకు భవిష్యత్‌లో టికెట్ ఇవ్వకున్నా సరే కాని తెలంగాణ ఇప్పుడు ఇవ్వకపోతే మళ్లీ రాదని ఏడుగురం ఎంపీలం చెబితే ఆమె చలించిపోయారని వివరించారు.
ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇస్తుందా అని అన్ని పార్టీలు కాంగ్రెస్‌ను లక్ష్యం చేసుకొన్నాయన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందనే విశ్వాసంతోనే తాము అవమానాలను భరించామన్నారు. మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పోషించిన పాత్ర చిరస్మరణీయమన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసి శ్రీధర్‌బాబు జిల్లా కీర్తిని నిలబెట్టారన్నారు. పార్లమెంట్‌లో భౌతికంగా దాడి జరిగినా మొక్కవోని ధైర్యంతో పొన్నం ప్రభాకర్ నిలబడ్డాడు కాబట్టే ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టారన్నారు. ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టకపోతే తెలంగాణ సాధ్యమయ్యేది కాదన్నారు. ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణను అడ్డుకోవడానికి కుట్రలు చేసిన టీడీపీ నేతలు మళ్లీ తిరగడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సోనియాకు అండగా నిలవాలన్నారు.
డీసీసీ అధ్యక్షుడు కొండూరు రవీందర్‌రావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, బొమ్మ వెంకటేశ్వర్లు, రేగులపాటి పాపారావు, నేరెళ్ల శారద, కటకం మృత్యుంజయం, డి.శంకర్, వై.సునీల్‌రావు, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కన్న కృష్ణ, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కోలేటి మారుతి, పనకంటి చంద్రశేఖర్, ముదుగంటి సురేందర్‌రెడ్డి, కర్ర రాజశేఖర్, ఆమ ఆనంద్, ఏనుగు మనోహర్‌రెడ్డి, గుగ్గిళ్ల జయశ్రీ, అర్ష మల్లేశం, పొన్నం సత్యం, వి.అంజన్‌కుమార్, ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఉప్పుల అంజనీప్రసాద్, గందె మహేష్, ఆకుల రాము, వేల్పుల వెంకటేశ్, ఎస్‌ఏ.మోసిన్, పెద్దెల్లి ప్రకాశ్, కట్ట సత్తయ్యగౌడ్, వొంటెల రత్నాకర్, ఆకుల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే బంగారు తెలంగాణ
Published Wed, Feb 26 2014 4:21 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement