చక్రం తిప్పిన ‘పొన్నం’
కాంగ్రెస్ టిక్కెట్ల కేటాయింపులో ఎంపీ పొన్నం ప్రభాకర్ హస్తిన స్థాయిలో చక్రం తిప్పారు. తన పార్లమెంటరీ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలన్నింటా తాను సూచించిన అభ్యర్థులకే టిక్కెట్లు ఇప్పించుకున్నారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు టీపీసీసీ నేతలు పలువురి అభ్యర్థిత్వాలపై భిన్నాభిప్రాయూలు వ్యక్తం చేసినప్పటికీ తన పంతం నెగ్గించుకున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రకటించిన జాబితాలో ఉన్న పేర్లు సైతం పొన్నం చతురతతో కనుమరుగైనట్లు స్పష్టవువుతోంది.
రెండు రోజుల కిందట పార్టీ విడుదల చేసిన జాబితాలో.. ప్రజాసంఘాల జేఏసీ నేత గజ్జెల కాంతం, ఓయూ జేఏసీ నేత దరువు ఎల్లన్న పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అదే జరిగితే తన సెగ్మెంట్‌లో ఇబ్బందికర పరిస్థితి వస్తుందని.. పార్టీలో అసమ్మతి పెల్లుబుకుతుందని అప్రమత్తమైన పొన్నం పార్టీ సీనియుర్ అహ్మద్‌పటేల్‌తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. అందుకే ఆఖరి నిమిషంలో జాబితాల్లో మార్పులు జరిగాయని, కాంతం, ఎల్లన్నకు బదులుగా చొప్పదండి నుంచి సుద్దాల దేవయ్య, సిరిసిల్ల నుంచి కొండూరి రవీందర్‌రావుకు టిక్కెట్లు దక్కినట్లు స్పష్టం అవుతోంది.
శ్రీధర్‌బాబుకు, ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు మధ్య విభేదాలుండటంతో ఎవరికి వారుగా తమ వర్గీయులకు టిక్కెట్టు ఇప్పించుకునేందుకు టీపీసీసీ నుంచి ఏఐసీసీ వరకు రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. చొప్పదండి టిక్కెట్టు ఇచ్చే ఒప్పందంపై శ్రీధర్‌బాబు గజ్జెల కాంతంను పార్టీలోకి తీసుకువస్తే.. అదే సీటు ఇప్పిస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే దేవయ్యను పొన్నం పార్టీలోకి రప్పించారు. దాంతో తన ప్రమేయంతో పార్టీలో చేరిన దేవయ్యకు టికెట్ దక్కేలా పొన్నం ఆఖరి క్షణంలో పావులు కదిపినట్లు స్పష్టవువుతోంది.
వేములవాడలోనూ పొన్నం పంతం నెగ్గించుకున్నారు. తన సెగ్మెంట్‌లో తనను కాదని టికెట్ పొందడం అంత ఈజీ కాదని చాటుకున్నారు. అనుకున్నట్లుగానే పొన్నం ప్రయోగం ఫలించింది. హుజురాబాద్‌లోనూ పొన్నం తన సత్తా చాటుకున్నాడు. అక్కడ పాడి కౌశిక్‌రెడ్డికి టిక్కెట్టు ఇప్పించేందుకు వ్యతిరేక వర్గీయులు కదిపిన పావులకు పొన్నం బ్రేకులు వేశారు. తన రాజకీయ చతురతతో సుదర్శన్‌రెడ్డికి టికెట్ దక్కేలా చేశారు. దాంతో తన ప్రాబల్యంతో శ్రీధర్ బాబుకు చెక్ పెట్టి తన ఆదిపత్యాన్ని చాటుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.