మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
బీజేపీ, బీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తాం
17 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ దీక్షలు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లుగా బీఆర్‌ఎస్, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఈనెల 14న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో దీక్ష చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల పరిధిలో దీక్షలు చేస్తామని మంత్రి తెలిపారు. గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ ఫిషర్‌మెన్ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్, మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి, అధికార ప్రతినిధి కోట శ్రీనివాస్‌లతో కలిసి మంత్రి పొన్నం మాట్లాడారు.
గత పదేళ్లలో తెలంగాణకు ఏమీ చేయకుండా విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెర వేర్చకుండా ఏ మొహం పెట్టు కుని బీజేపీ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లడుగుతారని వారు ప్రశ్నించారు. దేశంలోని నవరత్నాల కంపెనీలను అమ్మే స్తున్న బీజేపీకి ఒక ఎజెండా లేదని, కేవలం రాము డుపేరిట అక్షింతలు, కుంకుమలను ప్రజలకిచ్చి ఓట్లడుగుతున్నారని మండిపడ్డారు. దళితులు, బీసీలు, మైనార్టీలకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమంలో యువత బలిదానాలను బీజేపీ అవహేళన చేసిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతుల ఆత్మహత్య లకు బీజేపీనే కారణమని విమర్శించారు. కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి ఎవరన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment