
సాక్షి, కరీంనగర్: వావిలాలలో రైతు బుచ్చయ్య ధాన్యం కొనుగోలులో జాప్యం జరగడం వల్లే చనిపోయాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బుచ్చయ్య కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై మర్డర్ కేసు నమోదు చేయాలని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తుంటే జీవో 67 తీసి తిరగడానికి వీలు లేకుండా చేసి కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. నల్గొండ జిల్లాలో 100 శాతం ధాన్యం సేకరణ జరిగితే కరీంనగర్ జిల్లా కనీసం సగం కూడా జరగలేదని తెలిపారు.
రైతాంగానికి క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్ల ఇబ్బందుల గురించి ప్రతిపక్ష పార్టీగా మేము పర్యవేక్షిస్తుంటే మాపై బురద జల్లడం ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నామని హితవు పలికారు. ఐకేపీ సెంటర్లలో తాలు తప్పా పెరు మీద కోతలు విధిస్తూనే కొనుగోలు పనులు వేగవంతం చేయడం లేదన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు మంత్రులు రైస్ మిల్లర్లకు మద్దతు తెలపడం తప్పా రైతులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. రైస్ మిల్లర్లు ఎన్ని అక్రమాలు చేస్తున్న రైతులకు ఎంత అన్యాయం జరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శించారు. ముఖ్యంత్రి కళ్లు, ముక్కు, నోరు, చెవులు ముసుకొకుండా ఇంటలిజెన్స్ ద్వారా నివేదిక తెప్పించుకుని రైతులకు జరుగుతున్న అన్యాయం గమనించి రైతులకు న్యాయం చేయాలని పొన్నం కోరారు.
Comments
Please login to add a commentAdd a comment