మాట్లాడుతున్న పొన్నం ప్రబాకర్
సాక్షి, కరీంనగర్: మిడ్ మానేరు డ్యాం (ఎంఎండీ) కట్టను నాణ్యత లేకుండా నిర్మాణం చేయడం వల్లనే లీకేజీ అయి ఊట నీరు బయటకు వచ్చి ప్రమాదకరంగా తయారైందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. టీఆర్‌ఎస్ నేతల కమిషన్ల కక్కుర్తితోనే కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేశారని ఆరోపించారు. శుక్రవారం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యంలతో కలిసి ఆయన మాట్లాడారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డిలు ఎంఎండీ కట్ట లీకేజీ కాదని, సీపేజీ అని బుకాయించడమే కాకుండా దమ్ముంటే చర్చకు రావాలనడం సిగ్గుచేటన్నారు.
టీఆర్‌ఎస్ నేతల చాలెంజ్‌ను స్వీకరిస్తున్నామని ఎంఎండీ ముంపు గ్రామాల్లోనే బహిరంగ చర్చ పెట్టుకుందామని, సమయం మీరు చెప్పినా సరే.. లేదంటే మేమే చెబుతామని సవాలు విసిరారు. కట్టకు ఏర్పడ్డది లీకేజీ కాకపోతే రాత్రికి రాత్రే పోలీసు బందోబస్తు పెట్టి ఎంఎండీ అన్ని గేట్లు ఎత్తి నీటిని కిందకు ఎందుకు వదిలారో స్పష్టం చేయాలన్నారు. ఎంఎండీ ఎడమ వైపు కట్టను కిలోమీటరు పొడవు ఒర్రె మీద నిర్మించినట్లు అక్కడి రైతులు చెబితే ఆశ్చర్యం కలిగిందన్నారు. మూడేళ్ల క్రితం ప్రాజెక్టు కట్టకు గండి పడితే రూ.200 కోట్లు అంచనా పెంచి మళ్లీ కట్ట నిర్మించారని, అప్పటి ఈఎన్‌సీయే ఇప్పటికీ విధులు నిర్వహిస్తున్నారని, ఈఎన్‌సీకి ఎందుకు క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.
నాణ్యత లేకపోతే కాంట్రాక్టరుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అన్నారు. కేవలం టీఆర్‌ఎస్ నేతల కమిషన్ల కక్కుర్తి వల్లనే కాంట్రాక్టరు అడ్డగోలు పనులు చేసి, కట్టను ప్రమాదంలో పెట్టారని తెలిపారు. కాళేశ్వరం గుండెకాయ ఎంఎండీ అని చెప్పిన ప్రభుత్వం సక్రమమైన పద్ధతిలో కట్టను ఎందుకు నిర్మించలేదన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. కట్ట తెగితే కింద ఉన్న గ్రామలన్నింటికీ ప్రమాదమేర్పడుతుందని, వెంటనే కిలోమీటరు పొడవు కట్టను తొలగించి మళ్లీ నిర్మించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు పద్మాకర్‌రెడ్డి, దుర్గారెడ్డి, పిల్లి కనకయ్య, కూస రవి, ఆగయ్య, రాజశేఖర్, రాజు, ప్రదీప్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment