కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అతి సమీపంలో స్ప్రే చేయడం వల్ల పొన్నం కళ్లు తెరువలేని స్థితిలో అస్వస్థతకు గురయ్యారు. పెద్దపల్లి ఎంపీ జి.వివేకానంద, నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు పొన్నంను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన ఇంటికి వెళ్లారు. పొన్నంపై దాడి ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. దాడికి నిరసనగా జిల్లావ్యాప్తంగా, కాంగ్రెస్, అనుబంధ విభాగాలు, ఉద్యోగ సంఘాలు, జేఏసీలు ఆందోళన నిర్వహించాయి.
పరామర్శ
పెప్పర్ స్ప్రే దాడికి గురైన ఎంపీని కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీజేఏసీ నేతలు పరామర్శించారు. ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్న సమయంలోనే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ‘హౌ ఆర్ యూ’ అంటూ పలకరించారు. ధైర్యం చెప్పారు. అనంతరం పొన్నం నివాసంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, తన్నీరు శరత్‌రావు, వోరుగంటి ఆనంద్, పన్యాల శ్యాంసుందర్‌రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు సిద్దం వేణు, ఏనుగు రవీందర్‌రెడ్డి, భూక్యా తిరుపతినాయక్, పొన్నం అనిల్, రాజు తదితరులు పొన్నంను పరామర్శించి, సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీలోనే ఉన్న టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు హమీద్, నర్సింహులు, రాజయ్యగౌడ్ కూడా పొన్నంను పరామర్శించి, సీమాంధ్రుల దాడిని ఖండించారు.
నేడు నిరసన దీక్ష
పొన్నంపై దాడిని నిరసిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో నిరసన దీక్ష చేపడుతున్నట్లు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కన్న కృష్ణ తెలిపారు. అనంతరం లగడపాటిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
పార్లమెంట్‌లో పొన్నంపై దాడి
Published Fri, Feb 14 2014 4:21 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM
Advertisement