సాక్షి, మంచిర్యాల : జిల్లా రాజకీయ ముఖచిత్రం మారుతోంది. ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపని బీజేపీ బలోపేతం దిశగా సాగుతోంది. కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం, రాష్ట్రంలో నాలుగు పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవడంతో అనూహ్యంగా బీజేపీ పుంజుకొంటోంది. తాజాగా పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ కమలం గూటికి చేరడంతో జిల్లాలో ఆయన వర్గంగా ఉన్న నాయకులు, తటస్థులు, ఇతర పార్టీల వాళ్లు బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు.
ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆశావహుల అడుగులు కమలం వైపు పడుతున్నాయి. త్వరలో బీజేపీలో చేరికలు. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆశావహులంతా బీజేపీ వైపు దృష్టి సారిస్తున్నారు. పక్కనున్న ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ అదే ఊపు కనిపిస్తోంది. ఇదే సమయంలో మాజీ ఎంపీ జి.వివేక్ బీజేపీలో చేరడం ఆ పార్టీలో మరింత ఉత్సాహాన్ని నింపింది. వివేక్ కుటుంబానికి జిల్లాలో బలమైన వర్గం ఉండడంతో ఆ వర్గమంతా ఇప్పుడు బీజేపీలో చేరే అవకాశం ఉంది.
ముఖ్యంగా వివేక్ పట్టు అధికంగా ఉన్న బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ప్రభావం కాస్త ఎక్కువగా కనిపించనుంది. బీజేపీలో చేరడానికి ముందు వివేక్ జిల్లాలోని తన ముఖ్య అనుచరులతో మంతనాలు జరిపినట్లు సమాచారం. దీనితో స్థానిక నాయకులు కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బెల్లంపల్లి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్, మాజీ కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. అలాగే చెన్నూరు, మంచిర్యాలల్లోనూ మున్సిపల్ ఆశావహులు, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అసంతృప్తులు కమలం బాట పట్టనున్నారు. త్వరలో నిర్వహించబోయే కార్యక్రమంలో ఈ చేరికలు ఉండనున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
మున్సిపల్ ఎన్నికలే టార్గెట్
అనూహ్యంగా బలం పెంచుకుంటున్న బీజేపీ రానున్న మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొంది. జిల్లాలో మంచిర్యాల, లక్సెట్టిపేట, నస్పూరు, క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి, చెన్నూరు మున్సిపాల్టీలున్నాయి. సహజంగానే పట్టణ ప్రాంతాల్లో కాస్త ఎక్కువ ప్రభావం ఉండే బీజేపీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. పైగా ఆర్టికల్ 370 రద్దు అంశం కూడా తమకు బాగా కలిసివస్తుందనే ధీమాతో ఆ పార్టీ నేతలున్నారు. ఈ సమయంలో జిల్లాలో పట్టున్న వివేక్ బీజేపీలో చేరడంతో పార్టీలో జోష్ మరింత పెరిగింది.
జిల్లాలో వివేక్ పార్టీకి పెద్ద దిక్కుగా మారనున్నారు. పార్టీలో చేరడంతోనే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ద్వారా తన ప్రాభవం చూపించేందుకు వివేక్ పావులు కదుపుతున్నారు. జిల్లాలో బీజేపీకి సగం మున్సిపాల్టీలైనా సాధించిపెట్టి, తనబలాన్ని చూపించాలనే తాపత్రేయంతో ఆయన ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా బెల్లంపల్లి, క్యాతన్‌పల్లి, చెన్నూరు మున్సిపాల్టీలను కైవసం చేసుకొనే దిశగా దృష్టి పెట్టారు. మంచిర్యాల, లక్సెట్టిపేట, నస్పూరుల్లోనూ పాగా వేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఆ దిశగా బీజేపీలో చేరికలు ఉండనున్నాయి. ఏదేమైనా అదనపు బలాలతో పటిష్టంగా మారుతున్న బీజేపీలో చేరేందుకు మున్సిపల్ ఆశావహులు సమాయత్తమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment