
అన్నా.. కలిసిపోదామే!
హైకమాండ్ ఆదేశాలతో శ్రీధర్‌బాబు ఇంటికెళ్లిన వివేక్
విభేదాలు పక్కనబెట్టి ఐక్యంగా వెళదామని విజ్ఞప్తి
హైదరాబాద్: మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు జి.వివేక్ ఒక్కటయ్యారు. తమ మధ్యనున్న రాజకీయ విభేదాలను ప్రస్తుతానికి పక్కనబెట్టారు. ఈ విషయంలో కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చూపిన చొరవ ఫలించింది. నిజానికి వివేక్ టీఆర్‌ఎస్‌ని వీడి మళ్లీ కాంగ్రెస్‌లో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన శ్రీధర్‌బాబు తన మనసులోని మాటను హైకమాండ్ పెద్దలకు తెలిపి నిరసన వ్యక్తం చేశారు. హైకమాండ్ పెద్దలు దిగ్విజయ్, జైరాం రమేశ్‌లకు ఫోన్ చేసి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న నేతలను పక్కనబెట్టి మరో పార్టీ నుంచి వచ్చిన వివేక్ సూచించిన వారికి టికెట్లు ఎలా ఇస్తారని నిలదీశారు.
దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన దిగ్విజయ్ ఆదివారం శ్రీధర్‌బాబుకు ఫోన్ చేసి బుజ్జగించారు. ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అదే సమయంలో వివేక్‌కు ఫోన్‌చేసి శ్రీధర్‌బాబుతో సఖ్యతగా ఉండాలని ఉపదేశించారు. ఈ నేపథ్యంలో వెంటనే శ్రీధర్‌బాబు నివాసానికి వెళ్లిన వివేక్ పాత విబేధాలను పక్కనబెట్టాలని కోరారు. శ్రీధర్‌బాబు తన పట్ల ఆగ్రహంగా ఉన్నారని గ్రహించిన వివేక్ తన తండ్రి వెంకటస్వామిని రంగంలోకి దించారు.
ఆదివారం రాత్రి శ్రీధర్‌బాబుకు ఫోన్ చేసిన కాకా.. కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమేనని, కలిసిమెలిసి ఎన్నికల్లోకి వెళ్లాలని సర్దిచెప్పారు. దీనిపై మాట్లాడేందుకు ఇంటికి రావాలని కోరారు. తొలుత శ్రీధర్‌బాబు నిరాకరించినా.. కాకా పట్టుబట్టడంతో వచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం పలువురు టీ-కాంగ్రెస్ నేతలను కూడా వివేక్ అల్పాహారానికి ఆహ్వానించారు. అనంతరం వారితో మీడియా సమావేశాన్ని నిర్వహించి, తామందరం ఐక్యంగా ఉన్నామనే సంకేతాలను పంపేందుకు యత్నించారు