సాక్షి, చెన్నై: ఆదాయ పన్ను శాఖ విచారణ వలయంలోకి చిన్నమ్మ శశికళ కుటుంబం, సన్నిహితులు, సహాయకులు మూడు వందల మందిని తీసుకొచ్చారు. వీరిలో ఎనిమిది మంది టాప్ లిస్టులో ఉన్నారు. వీరందరికీ సమన్లు సిద్ధం చేస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. ఇక, ఇళవరసి కుమారుడు వివేక్ మెడకు మాత్రం ఉచ్చు బిగిసే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. 27 ఏళ్ల వయసు కల్గిన వివేక్ వెయ్యి కోట్ల మేరకు ఆస్తులు, పెట్టుబడుల్ని కల్గి ఉన్నట్టు ఐటీ దాడుల్లో వెలుగు చూసి ఉండడంతో చిన్నమ్మ కుటుంబంలో ఉత్కంఠ తప్పడం లేదు.
అన్నాడీఎంకే అమ్మ జయలలిత నెచ్చెలి శశికళ కుటుంబాన్ని, సన్నిహితుల్ని గురి పెట్టి ఐటీ దాడులు గురువారం నుంచి సాగుతున్న విషయం తెలిసిందే. తొలిరోజు 187 చోట్ల, రెండోరోజు 147 చోట్ల, మూడో రోజు 40 చోట్ల తనిఖీలు జరిగాయి. ఇక, నాలుగో రోజుగా 20 చోట్ల తనిఖీల్లో ఐటీ వర్గాలు నిమగ్నమయ్యారు. ప్రధానంగా ఐటీ విభాగంలో ఉన్నతాధికారులుగా ఉన్న వాళ్లు నాలుగో రోజు రంగంలోకి దిగడంతో తదుపరి అడుగులు ఎలా ఉంటాయోనన్న చర్చ బయలు దేరింది.
టార్గెట్ 8 మంది: ఐటీ చరిత్రలో తమిళనాడులో కనీవిని ఎరుగని రీతిలో ఏకకాలంలో, రోజుల తరబడి సాగుతున్న ఈ దాడులపై సర్వత్రా దృష్టి పెట్టారు. రాజకీయ పక్షాలు కొన్ని విమర్శలు గుప్పిస్తుంటే, మరికొన్ని ఐటీ దాడుల్ని ఆహ్వానిస్తున్నాయి. ఈ చర్చ ఓ వైపు సాగుతుంటే, మరో వైపు నాలుగు రోజులుగా చిన్నమ్మ ఫ్యామిలీ, సన్నిహితులకు కంటి మీద కునుకు కరువైందని చెప్పవచ్చు. పట్టువదలని విక్రమార్కుడిలా తిష్ట వేసిన ఐటీ వర్గాలు అణువణువు సోదాలు చేస్తూ, లభించిన ఆధారాలను, వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందిస్తున్నారు.
ఇప్పటి వరకు సేకరించిన వివరాలు, లభించిన ఆధారాలు, రికార్డులు, పెట్టుబడులు, ఆస్తులు, నగలు, నగదులకు సంబంధించి విచారణను ముమ్మరం చేయడానికి సిద్ధం అయ్యారు. ఇందు కోసం ఓ జాబితాను సిద్ధం చేస్తున్నారు. మూడు వందల మందిని విచారణ వలయంలోకి చేర్చి, ఒక్కొక్కర్ని తమ కార్యాలయం మెట్లు ఎక్కించేందుకు ఐటీ వర్గాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ జాబితాలో టాప్ 8 మందిని తొలుత టార్గెట్ చేశారు. ఇందులో శశికళ భర్త నటరాజన్, సోదరుడు దివాకరన్, అక్కకుమారులు దినకరన్, భాస్కరన్, అన్న కుమారుడు వివేక్, కుమార్తె కృష్ణ ప్రియ, న్యాయవాది సెంథిల్, జ్యోతిష్కుడు చంద్రశేఖర్ ఉన్నట్టు సమాచారం.
వివేక్ మెడకు ఉచ్చు: టాప్ 8 మందిలో తొలి పేరుగా వివేక్‌ను చేర్చినట్టు సమాచారం. ఇందుకు కారణం, 27 ఏళ్ల వయస్సు కల్గిన వివేక్ వెయ్యి కోట్ల మేరకు ఆస్తుల్ని, పెట్టుబడుల్ని తన గుప్పెట్లో ఉంచుకున్నట్టుగా ఐటీ దాడుల్లో వెలుగు చూడడమే. జయ టీవీ, నమదు ఎంజీయార్, జాస్ సినిమాస్ ఇలా మరికొన్ని సంస్థలకే ఆయనే అధిపతి అన్నట్టుగా ఆధారాలు చిక్కడంతోనే వివేక్‌ను తొలి జాబితాలో చేర్చినట్టు తెలిసింది. తదుపరి చిన్నమ్మ సోదరుడు దివాకరన్‌ను గురి పెట్టి ఉండడంతో, మున్ముందు ఐటీ వర్గాల విచారణలు ఎలాంటి మలుపులు తిరుగుతాయోనన్న ఉత్కంఠ తప్పడం లేదు. అదే సమయంలో వివేక్‌ను అరెస్టు కూడా చేయవచ్చనట్టు ప్రచారం ఊపందుకుంది. శశికళ భర్త నటరాజన్‌ను టార్గెట్ చేసినా, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి విచారణకు పిలిచేందుకు చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం లభించిన ఆధారాల మేరకు మొత్తం ఆస్తుల వివరాల్ని, పట్టుబడ్డ వాటి గురించిన వివరాల్ని లెక్కించే పనిలో ఐటీ వర్గాలు బిజీగా ఉన్నాయి. వీరు తమకు ఇచ్చే నివేదిక ఆధారంగా రంగంలోకి దిగేందుకు సీబీఐ, ఈడీ వర్గాలు సిద్ధం అవుతుండం గమనార్హం.లగ్జరీ కార్లు: ఆదివారం 20 చోట్ల దాడులు జరగ్గా, పట్టుబడ్డ రికార్డుల సమగ్ర పరిశీలన మేరకు లగ్జరీ కార్ల కొనుగోళ్లలోనూ పన్ను ఎగవేత వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. విదేశాల నుంచి పలు కార్లు అక్రమ మార్గంలో దిగుమతి చేసుకుని ఉండడాన్ని గుర్తించారు.
దివాకరన్ వద్ద విచారణ: మన్నార్ కుడిలోని దివాకరన్, ఇళ్లు, కార్యాలయాలు, ఫామ్ హౌస్, కళాశాలల్లో ఐటీ వర్గాలు తనిఖీలు ముగించాయి. ఆయన కళాశాలలోని ఓ గదిని ఐటీ వర్గాలు తమ గుప్పెట్లోకి తీసుకుని సీల్ వేశాయి. మన్నార్‌కుడిలో లభించిన రికార్డులు, ఇతర వాటిని 14 కార్లో యాభై మంది అధికారులు చెన్నైకు తరలించడం గమనార్హం. అలాగే, మరి కొందరు అధికారులు దివాకరన్‌ను రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.
పుదుచ్చేరికి చంద్రశేఖర్: శశికళ జ్యోతిష్కుడు చంద్రశేఖర్ ఇంట్లో , న్యాయవాది సెంథిల్ ఇంట్లో విచారణ ముగిసింది. జ్యోతిష్కుడి ఇంట్లో చిన్నమ్మ ఫ్యామిలికీ సంబంధించిన అనేక దస్తావేజులు ఐటీ వర్గాలకు చిక్కినట్టు సమాచారం. అలాగే, రాష్ట్ర మంత్రి ఒకరు ఈ జ్యోతిష్కుడితో మరీ సన్నిహితంగా ఉండడంతో ఆయన ఎవరో అని ఆరా తీస్తున్నారు. దీంతో చంద్రశేఖర్‌ను విచారించేందుకు ఐటీ వర్గాలు పుదుచ్చేరికి తరలించారు. అక్కడి శ్రీలక్ష్మి జ్యువెలరీస్ అధినేత తెన్నరసును సైతం విచారించేందుకు చర్యలు చేపట్టారు.
మోసం చేసి ఆస్తులు గడించారు: అమ్మ జయ లలితను మోసగించిన శశికళ కుటుంబం ఆస్తుల్ని గడించిందని అన్నాడీఎంకే సీనియర్ నేత కేపీ మునుస్వామి ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న దాడుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేనే లేదని స్పష్టం చేశారు. అమ్మకు తెలియకుండా ఏళ్ల తరబడి మోసాలకు, అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.
రాజకీయం చేయొద్దు: ఐటీ దాడుల్ని రాజకీయం చేయవద్దు అని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐటీ పరిశీలనలో తేలిన అంశాలు, లభించిన ఆధారాల మేరకు దాడులు సాగుతున్నాయని తెలిపారు. బీజేపీ మీద నిందల్ని వేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. శశికళ కుటుంబాన్ని మాత్రమే ఐటీ టార్గెట్ చేయలేదని, ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి చెందిన వారిని సైతం గురి పెట్టి తనిఖీలు, సోదాలు సాగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అన్నాడీఎంకేను ముక్కలు చేయాల్సిన అవసరం గానీ, రాజకీయ కక్ష సాధింపులకు దిగాల్సినంత విరోధంగా ఇక్కడి వారితో బీజేపీ పెద్దలకు లేదని స్పష్టం చేశారు. ఇక, పీఎంకే అధినేత రాందాసు పేర్కొంటూ, శశికళ బంధువులు కూడబెట్టిన ఆస్తులను జప్తు చేయాలని, వాటన్నింటిని కేంద్రం స్వాధీనం చేసుకోవాలని కోరారు.
మమ్మల్ని తరిమేయడానికి కుట్ర: తిరువణ్ణామలైలో దైవ దర్శనానికి వెళ్లిన దినకరన్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలు బట్టి చూస్తే, ఈ రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచి తమ కుటుంబాన్ని తరిమి వేయడానికి కుట్ర జరుగుతున్నట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. అమ్మ జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె కోరిక మేరకు వీడియో తీశామని, అది తన వద్దే ఉందన్నారు. వైద్య చికిత్సలు, అమ్మకు సంబంధించిన వీడియో తన వద్దే ఉందని, దానిని ఐటీ వర్గాలు తీసుకెళ్ల లేదని స్పష్టం చేశారు.
ఈ దాడులతో రాజకీయంగా తాను వెనుక బడ లేదని, ప్రజల మదిలో స్థానం సంపాదించుకున్నట్టు పేర్కొన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని పేర్కొంటూ, పదవి చేతిలో ఉంది కదా అని మంత్రులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం శోచనీయమని విమర్శించారు. మంత్రి సీవీ షణ్ముగం లాంటి వాళ్లు ఎందరో ఎలా ఎమ్మెల్యే సీట్లు దక్కించుకున్నారో అన్న వివరాల్ని బయట పెడితే..అంటూ, ఓ మారు గుర్తుంచుకోండని మంత్రులకు హితవు పలికారు. కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటామని, చట్టపరంగా ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు. మహా అయితే, అరెస్టు చేస్తారేగానీ, కాల్చి చంపరుగా అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment