టెన్షన్.. టెన్షన్
♦ ఐటీ దాడులు, అసంతృప్తి సెగలు
♦ గవర్నర్ విద్యాసాగర్‌రావు రాక
♦ ప్రభుత్వ తీరుపై రహస్య చర్చలు
♦ మంత్రులకు పన్నీర్‌సెల్వం గాలం
♦ శశికళ వద్దకు దినకరన్ పరుగు
అధికార పార్టీ, ప్రభుత్వం రెండూ టెన్షన్‌లో పడిపోయాయి. ఐటీ దాడులు, అసంతృప్తి సెగలు, దినకరన్‌కు సమన్లు ఒకటి తరువాత ఒకటిగా పడుతున్న దెబ్బలతో కుదేలైపోతున్నాయి. గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆకస్మిక ఆగమనం వారిని మరింత ఆందోళనకు గురిచేయగా, ఎటువంటి సమాచారం వినాల్సి వస్తుందోనని వణికిపోతున్నాయి.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికలు అధికార పార్టీని పూర్తిగా అప్రతిష్టపాలు చేశాయి. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంచినట్లుగా సాక్షాత్తు వైద్యశాఖా మంత్రి విజయభాస్కరే సాక్ష్యాధారాలతో ఐటీ అధికారులకు ప్రభుత్వాన్ని సైతం ఇరుకున పెట్టింది. ఐటీ అధికారులను బెదిరించినట్లుగా ముగ్గురు మంత్రులపై పోలీసులు కేసు నమోదు, మంత్రి విజయభాస్కర్‌కు ఐటీ సమన్లు, ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు సీఎం ఎడపాడికి వ్యతిరేకంగా, అనుకూలంగా చీలిపోవడం తదితర పరిణామాలతో రాష్ట్రంలో అల్లకల్లోల వాతావరణం నెలకొని ఉంది.
గవర్నర్ రాక
రాష్ట్రంలో పాలన కుంటువడి గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్న సమయంలో ఇన్‌చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు సోమవారం ఉదయం ముంబయి నుంచి ప్రత్యేక విమానంలో అకస్మాత్తుగా చెన్నైకి చేరుకున్నారు. ఐటీ నుంచి సమన్లు ఎదుర్కొంటున్న విజయభాస్కర్‌ను మంత్రి వర్గం నుంచి తప్పించాలని కొందరు మంత్రులే డిమాండ్ చేస్తున్నారు. ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురు మంత్రులు పోలీసు కేసులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అధికార పార్టీ, ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. విజయభాస్కర్‌కు ఉద్వాసన తప్పదని కొందరు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారని మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే గవర్నర్ అత్యవసర రాక ఏదో ఒక సంచలనానికి దారితీయడం ఖాయమని అంటున్నారు.
శశికళ వద్దకు దినకరన్ పరుగు
రాష్ట్రంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శశికళను కలుసుకునేందుకు దినకరన్ బెంగళూరుకు పరుగులు పెట్టారు. మంత్రి విజయభాస్కర్ ఇంటిపై ఐటీ దాడులు, రెండాకుల చిహ్నం కోసం రూ.60 కోట్ల ఎర ఆరోపణలు, రూ.1.30 కోట్లతో బ్రోకర్ పట్టుబడడం, ఢిల్లీ పోలీసుల సమన్లు తదితర అంశాలను ఆమెతో చర్చించేందుకు వెళ్లారు.
పన్నీర్ ఆహ్వానం... మంత్రులు ఓకే
అనేక ఆరోపణలు, అప్రతిష్టల సుడిగుండంలో అన్నాడీఎంకే చిక్కుకుని ఉండగా ఇదే అదనుగా పన్నీర్‌సెల్వం పాచిక విసిరారు. రెండు వర్గాలను విలీనం చేసేందుకు సీనియర్ మంత్రులు వస్తే చర్చలకు సిద్ధమని ఆహ్వానించారు. మధురైకి వెళుతున్న సందర్భంగా సోమవారం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, రెండాకుల చిహ్నం ఎవరికి అనే అంశంపై ఢిల్లీలో విచారణ జరుగుతున్నదని తెలిపారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రెండాకులు గుర్తు తమకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. రెండాకుల చిహ్నం కోసం దినకరన్ లంచం ఇవ్వజూపే ప్రయత్నాలపై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టిన విషయంపై తన వద్ద పూర్తి వివరాలు లేవని అన్నారు.
ఇరువర్గాలు ఒకటి కావాలని తాను కోరుకుంటున్నానని, ఈ దిశగా సీనియర్ మంత్రులు వస్తే చర్చించేందుకు తాను సిద్ధమని చెప్పారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నాన్ని కాపాడుకునేందుకు పన్నీర్ వర్గంలో చేరిపోయేందుకు మంత్రులు, సీనియర్ నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమ్మ మరణం తరువాత కోల్పోయిన ప్రతిష్టను పొందాలంటే ఇరువురూ రాజీనామా చేయాలని శశికళ, దినకరన్లను మంత్రులు కోరినట్లు, వారు నిరాకరించినట్లు సమాచారం. దీంతో శశికళ వర్గం నుండి తప్పుకుని పన్నీర్ వర్గంలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని తెలుసుకునే పన్నీర్‌సెల్వం వారికి ఆహ్వానం పలికారని అంటున్నారు. మంత్రులు, సీనియర్ నేతలు పన్నీర్ పక్షం చేరితే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు సోమవారం హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామాలతో కంగారు పడిన లోక్‌సభ ఉప సభాపతి, శశికళ విశ్వాసపాత్రుడు తంబిదురై హడావిడిగా సీఎం ఎడపాడితో సమావేశమయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకే చీలిపోలేదు, వర్గాలు లేవు, ప్రజాస్వామ్యంలో చిన్నపాటి అసంతృప్తులు సహజమని తంబిదురై వ్యాఖ్యానించారు.