సాక్షి, చెన్నై: తమిళనాట సాగుతున్న ఐటీ దాడుల్లో తవ్వే కొద్దీ చిన్నమ్మ శశికళ కుటుంబం అవినీతి భాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ. వెయ్యి కోట్ల మేరకు పన్ను ఎగ వేసినట్టుగా శుక్రవారం గుర్తించిన అధికారులు, శనివారం జరిపిన పరిశీలనల్లో రూ. 1500 కోట్లు విలువైన పెట్టుబడుల దస్తావేజుల్ని వెలికి తీసినట్లు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, ఆరు కోట్లు నగదు, పదిహేను కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ కుటుంబంపై ఐటీ కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ క్లీన్ మనీ నినాదంతో గురువారం చేపట్టిన తనిఖీలు శనివారం కూడా కొనసాగాయి. తొలి రోజు 187 చోట్ల, రెండో రోజు 147 చోట్ల విచారణ సాగగా, తాజాగా 40 మందిని గురి పెట్టి అణువణువు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దేశంతో పాటుగా వివిధ దేశాల్లోని సంస్థల్లో రూ.1500 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టి ఉండటం, రూ. 1200 కోట్ల మేరకు ఆస్తుల రికార్డుల్ని ఐటీ వర్గాలు చేజిక్కించుకున్నట్లు సమాచారం.
అలాగే, ఆరు కోట్ల మేరకు నగదు, రూ. 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 150 బ్యాంక్ ఖాతాల్ని సీజ్ చేయడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక, నీలగిరి జిల్లా కొడనాడు, గ్రీన్ టీ ఎస్టేట్‌లలో పనిచేస్తున్న కార్మికులు 800 మంది ఖాతాల్లో పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ. రెండు లక్షలు చొప్పున 16 కోట్లు డిపాజిట్ చేసి, నగదును ఉంచినట్లు ఐటీ వర్గాలు గుర్తించాయి. అలాగే, దివంగత సీఎం జయలలిత ఆస్తులకు సంబంధించిన వీలునామ ఎక్కడ ఉందన్న అనుమానాలు బయలు దేరాయి. జయలలిత పేరిట కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్న విషయం తెలిసిందే. అయితే, వాటికి సంబంధించిన ఒరిజినల్ దస్తావేజులు ఈ దాడుల్లో తమ చేతికి చిక్కని దృష్ట్యా, వాటిని ఎక్కడ దాచి పెట్టి ఉన్నారో అన్న కోణంలోనూ విచారణ సాగుతోంది.
ప్రధానంగా శశికళ భర్త నటరాజన్, అక్కవణితా మని కుమారుడు దినకరన్ మినహా తక్కిన కుటుంబ సభ్యులు, బంధువులు దివాకరన్, వివేక్, కృష్ణప్రియ, సఖిల, భాస్కర్, ఆడిటర్ సెల్వం, న్యాయవాది సెంథిల్, జ్యోతిష్యుడు చంద్రశేఖర్, శ్రీలక్షి జువెల్లరీ మేనేజింగ్ డైరెక్టర్ తెన్నరసు, కోయంబత్తూరులోని కాంట్రాక్టర్ ఆర్ముగ స్వామిలను ఐటీ వర్గాలు వారి వారి ఇళ్లలోనే విచారిస్తున్నాయి. అలాగే, చెన్నై వెలచ్చేరి ఫీనిక్స్ మాల్‌లోని 11 స్కీన్లతో కూడిన జాస్ సినిమాస్ ను రూ. వెయ్యి కోట్లు పెట్టి ఎలా కొన్నారో అన్న అంశంపై వివేక్‌ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు తెలిసింది. ఇక, సమగ్ర వివరాలతో సీబీఐ, ఈడీలకు నివేదికల్ని అందించేందుకు ఐటీ వర్గాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment