
ప్రమోషన్‌తో సినిమా హిట్ కాదు!
‘‘ఓ చెత్త సినిమా గురించి వంద రోజులు పబ్లిసిటీ చేసినా హిట్ కాదు, అది ఫ్లాపే. సినిమాలో సత్తా ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు.
‘‘ఓ చెత్త సినిమా గురించి వంద రోజులు పబ్లిసిటీ చేసినా హిట్ కాదు, అది ఫ్లాపే. సినిమాలో సత్తా ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అంతే గానీ... పబ్లిసిటీ ఎక్కువ చేస్తే సినిమా హిట్టవుతుందనుకోవడం భ్రమే. ఫ్లాప్ సినిమాలను పబ్లిసిటీ కాపాడిన సందర్భాలు నేనెప్పుడూ చూడలేదు’’ అన్నారు నయనతార. ఈ మలయాళీ కుట్టీ మీడియా ముందుకు రావడం అరుదు. సినిమాకి సంతకం చేసే ముందే నిర్మాతలకు ఖరాకండీగా పబ్లిసిటీ కార్యక్రమాలకు రానని చెప్పేస్తారనేది జగమెరిగిన సత్యం. మరి, సడన్‌గా పబ్లిసిటీ గురించి ఇంత పెద్ద లెక్చర్ ఎందుకు ఇస్తున్నారంటే... ‘‘పబ్లిసిటీ కార్యక్రమాలకు హాజరుకాని కథానాయికల పారితోషికంలో కోత విధించాలి’’ అని ప్రముఖ తమిళ నటుడు వివేక్ ఇటీవల ఓ కార్యక్రమంలో అన్నారు.
పైకి పేరు చెప్పకున్నా ఆయన నయనతారనే విమర్శించారనే సంగతి అందరికీ అర్థమైంది. తాజా ఇంటర్య్వూ లో వివేక్ వ్యాఖ్యలను నయనతార దగ్గర ప్రస్తావించగా – ‘‘ఆయన నా గురించే అన్నారని తెలుసు. కానీ, నిజం ఏంటంటే... చాలాసార్లు నిర్మాతలు నా పారితోషికం పూర్తిగా ఇవ్వకపోతే ఆ డబ్బులను వదిలేశా. నిర్మాతల పరిస్థితి అర్థం చేసుకుని, కొన్ని సినిమాలకు నేనే పారితోషకం తగ్గించుకున్నా. పబ్లిసిటీ కార్యక్రమాలకు హాజరుకావాలా? వద్దా? అనేది హీరోయిన్ల ఇష్టం. నిర్మాత లకు ఏ సమస్య లేనప్పుడు మిగతా వాళ్లకు ఎందుకు? ఇటువంటి వ్యాఖ్యలు విన్నప్పుడు బాధ కలుగుతుంది’’ అన్నారు. ‘‘మీకో విషయం తెలుసా? దర్శక–నిర్మాతలు నా దగ్గరకి కథతో వచ్చినప్పుడే పబ్లిసిటీ కార్యక్రమాలకు రానని చెబుతా’’ అని నయనతార స్పష్టం చేశారు.