Vaishnavi Chaitanya: ఒక్క హిట్...తెలుగమ్మాయికి భారీ రెమ్యునరేషన్ | Baby Fame Vaishnavi Chaitanya Hikes Her Remuneration | Sakshi
Sakshi News home page

రూ.కోటికి ఎగబాకిన వైష్ణవి చైతన్య పారితోషికం!

Mar 30 2025 7:52 PM | Updated on Mar 30 2025 8:18 PM

Baby Fame Vaishnavi Chaitanya Hikes Her Remuneration

తారల తలరాతలు మార్చడానికి ఒకే ఒక్క సినిమా చాలు. హిట్‌ పడ్డాక ఆఫర్స్‌ వస్తూనే ఉంటాయి. రెమ్యునరేషన్‌ పెరుగుతూనే ఉంటుంది. అయితే ఆ హిట్‌ కోసం తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya) చాలా కాలమే ఎదురు చూసింది. కెరీర్ ప్రారంభంలో 'లవ్ ఇన్ 143 అవర్స్' 'ది సాఫ్ట్‌వేర్ డెవలపర్‌' 'అరెరె మానస' 'మిస్సమ్మ' వంటి షార్ట్ ఫిల్మ్స్ తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి... అటు తర్వాత 'అల వైకుంఠపురములో' 'వరుడు కావలెను' వంటి క్రేజీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం దక్కించుకున్నారు. ఆ సినిమాల్లో చేసినవి చిన్న పాత్రలే అయినప్పటికీ వాటితో కూడా యూత్ ను మెప్పించారు.అందువల్ల 'బేబీ' సినిమాలో వైష్ణవికి మెయిన్ హీరోయిన్  ఛాన్స్ వరించింది.ఆ ఒక్క చిత్రమే ఈ తెలుగమ్మాయి జీవితాన్ని మార్చేసింది.

ఆ చిత్రంలో యూత్ లోనే కాదు.. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా బోలెడంత క్రేజ్ సంపాదించుకున్నారు వైష్ణవి. ఇప్పుడు ఆమె నటిస్తున్న 'జాక్' సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో ఆమె ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 'శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర' బ్యానర్ పై అగ్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో పాటు '90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా రూపొందుతున్న సినిమాలో కూడా ఆనంద దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించనున్నారు వైష్ణవి. 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఇలా 2 పెద్ద బ్యానర్లలో మెయిన్ హీరోయిన్ గా చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు టాలీవుడ్లో క్రేజ్ ఉన్న హీరోయిన్లు, డిమాండ్ ఉన్న హీరోయిన్లు బాగా తక్కువగానే ఉన్నారు. మొన్నటి వరకు ఒక ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లు  ఇప్పుడు ఫామ్లో లేరు. ఇలాంటి టైంలో దర్సకనిర్మాతలకి వైష్ణవి చైతన్య వైపు మొగ్గు చూపుతున్నారు.ఇది ఆమెకి కలిసొచ్చినట్టు అయ్యింది. దీంతో వైష్ణవి పారితోషికం కూడా పెరిగినట్టు సమాచారం. ఇటీవల ఓ కొత్త సినిమా కోసం వైష్ణవి చైతన్యకి కోటి రూపాయల పారితోషికం ఆఫర్ చేశారట ఓ యువ నిర్మాత, దర్శకుడు. వైష్ణవికి యూత్‌లో అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెకు అంత మొత్తం ఇచ్చేందుకు ఈ దర్శకనిర్మాతలు సిద్దమైనట్టు సమాచారం.ఇలా తన అప్ కమింగ్ సినిమాకి గాను వైష్ణవి పారితోషికం కోటి రూపాయల మార్క్ టచ్ అయినట్టు స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement