నాలుగు కోట్ల డిమాండ్ చేస్తున్న నయన్ | Nayan demands Rs.4 crores as fee per film? | Sakshi
Sakshi News home page

నాలుగు కోట్ల డిమాండ్ చేస్తున్న నయన్

Jul 26 2016 2:57 AM | Updated on Sep 4 2017 6:14 AM

నాలుగు కోట్ల  డిమాండ్  చేస్తున్న నయన్

నాలుగు కోట్ల డిమాండ్ చేస్తున్న నయన్

దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకోవాలన్న నానుడిని నటి నయనతార అక్షరాలా పాటిస్తున్నారు.

తమిళసినిమా; దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకోవాలన్న నానుడిని నటి నయనతార అక్షరాలా పాటిస్తున్నారు. కథానాయికగా టాప్ పొజిషన్‌లో ఉన్న నయనతార ప్రముఖ హీరోల నుంచి వర్ధమాన హీరోలతో సైతం నటించడానికి రెడీ అంటున్నారు. లేడీ ఓరియంటెడ్ చిత్రాల నాయకిగాను సక్సెస్ సాధించి విజయానికి చిరునామాగా మారారు. నయనతార గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే 2005లో కోలీవుడ్‌కు అయ్యా చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. ఆరంభంలో 40 నుంచి 50 లకారాలు పుచ్చుకున్న ఈ కేరళా కుట్టి ఆ తరువాత రజనీకాంత్, విజయ్, అజిత్‌కుమార్, సూర్య, ధనుష్, శింబు వంటి ప్రముఖ హీరోలతో జత కట్టే అవకాశాలు దక్కించుకున్నారు.
 
 అలాగే తెలుగులోనూ ప్రముఖ కథానాయకుల సరసన నటించారు. ఆ చిత్రాలు మంచి విజయాలను సాధించడంతో తన పాపులారిటీతో పాటు పారితోషికాన్ని పెంచుకుంటూ పోయారు. అలా రూ.కోటి వరకూ పారితోషికం పుచ్చుకుంటూ వచ్చిన నయనతార అనూహ్యంగా ప్రేమ వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో నయనతార పనైపోయింది. ఆమె మార్కెట్ డౌన్ అయిపోతుంది. అని చాలా మంది అనుకున్నారు. అయితే అది నిజం కాదని నిరూపించారు నయన్. ప్రేమ సమస్యల నుంచి బయటపడి రీఎంట్రీ ఇచ్చి పూర్వ వైభవాన్ని మించి సాధించారు.
 
 ఆ మధ్య హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం మాయలో  దెయ్యంగానూ, కథానాయికకు ప్రాముఖ్యత ఉన్న నానుమ్ రౌడీదాన్ చిత్రంలో చెవిటి అమ్మాయిగా నటించి ఆ చిత్రాల విజయాలకు మూల కారణంగా నిలిచారు. అలాగే తనీఒరువన్, ఇదునమ్మఆళు వంటి కమర్షియల్ చిత్రాల విజయాలను తన ఖాతాలో వేసుకున్న నయన్ సహ నటీమణులు త్రిష, శ్రీయ, ప్రియమణిలను అధిగమించి విజయపథంలో దూసుకుపోతున్నారు. ఇక ప్రస్తుతం టాప్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న అనుష్క, సమంత, శ్రుతీహాసన్, హన్సికలు కూడా తన దరిదాపుల్లోకి రానంత ఉన్నత స్థాయికి చేరుకున్న నయనతార ఇప్పుడు రూ.మూడు కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.
 
  తాజాగా మాతృ భాషలో కూడా నటించడం మొదలెట్టిన ఈ కేరళా కుట్టి రూ.నాలుగు కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. చేతి నిండా సినిమాలున్న నయనతార ఇటీవల ఒక నిర్మాత ప్రముఖ హీరోకు జంటగా నటించడానికి కాల్‌షీట్స్ అడగ్గా పారితోషికం రూ.నాలుగు కోట్లు ఇస్తానంటే కాల్‌షీట్స్ గురించి మాట్లాడదాం అని కుండ బద్దలు కొట్టినట్లు అన్నారట. దీంతో కరెంట్ షాక్ కొట్టినంత పనైందట ఆ నిర్మాతకు. మరోమాట లేకుండా నిర్మాత అక్కడ నుంచి జారుకున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement