సాక్షి, హైదరాబాద్: చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్‌కు సంబంధించిన విశాక ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్విసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాలోకి బదిలీ అయిన రూ.8 కోట్లు సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ఆదేశాల మేరకు నగర పోలీసు ఉన్నతాధికారుల సూచనలతో ఈ చర్య తీసుకున్నట్లు మధ్య మండల డీసీపీ వెంకటేశ్వర్లు ఆదివారం వెల్లడించారు. గత సోమవారం జరిగిన ఈ వ్యవహారంపై ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ బుధవారం సీఈఓకు ఫిర్యాదు చేశారు.
ఈ విజిలెన్స్ కంపెనీ రామగుండంలోని వివేక్ ఇంటి చిరునామాతో ఉందని, ఆయన సంస్థ ఉద్యోగులే ఈ సంస్థ డైరెక్టర్లుగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. ఈ లావాదేవీపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికే వివేక్ ఈ షెల్ కంపెనీ ఖాతా వినియోగిస్తున్నట్లు సీఈఓకు ఇచ్చిన ఫిర్యాదుతో పేర్కొన్నారు. దీంతో ఈ విషయాన్ని సీఈఓ నగర పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన సైఫాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బేగంపేట బ్రాంచ్‌లో ఉన్న విశాక ఇండస్ట్రీస్‌కు చెందిన ఓ గుర్తుతెలియని ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీస్ సంస్థకు ఐడీబీఐ బ్యాంక్ బషీర్‌బాగ్ బ్రాంచ్‌లోకి బదిలీ అయినట్లు గుర్తించారు. సోమవారం ఉదయం 10.57 గంటలకు జరిగిన ఈ లావాదేవీ అనుమానాస్పదంగా ఉండటంతో సైఫాబాద్ పోలీసులు ఈ మొత్తాన్ని ఫ్రీజ్ చేయించారు. దీనిపై ఎన్నికల అధికారులతో పాటు ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తదితర విభాగాలకు సమాచారం ఇచ్చారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని, వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment