సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మరోసారి నిప్పులు చెరిగారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను హెచ్‌సీఏ సమావేశానికి అనుమతించకపోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అజారుద్దీన్ కి జరిగిన అవమానం పై పాకిస్తాన్ కోడై కూస్తుందన్నారు. అవసరం ఉంటే అజార్ భాయ్ అంటారు.. అవసరం తీరాక హట్ ఛలో అంటారా..? అని ధ్వజమెత్తారు. అజారుద్దీన్ మనవాడా కాదా?.. అనేది సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అజారుద్దీన్ హెచ్‌సీఏ మెంబర్ కాదని మొన్నటి వరకు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ వివేక్ అన్నారు. కోర్టు అజారుద్దీన్ కి క్లీన్ చీట్ ఇచ్చినా హెచ్‌సీఏ అనుమతి ఇవ్వడం లేదన్నారు. అజారుద్దీన్ పై కుట్రతో వివేక్ ఇలా చేస్తున్నారని హనుమంతరావు నిప్పులు చెరిగారు.
తాను రాజకీయ కుట్రలతో హెచ్‌సీఏ మీటింగ్ కి వస్తున్నానని వివేక్ కరీంనగర్ లో మాట్లాడారని హనుమంతరావు అన్నారు. 8నెలల కింద నెలకొల్పిన ప్యానల్ కి శేష నారాయణ సెక్రెటరీ, వివేక్ ప్రెసిడెంట్ అయ్యారన్నారు. ప్రస్తుత ప్యానల్ కి ఎన్నో సంవత్సరాలు హెచ్‌సీఏని పాలించిన వినోద్ కి పెద్ద పోస్ట్ కట్టపెట్టాలని వివేక్ అంటే దానికి శేష నారాయణ ఒప్పుకోనందుకే ఆయన పై సస్పెన్షన్ వేటు వేశారని తెలిపారు.
ఉప్పల్ స్టేడియంకి వివేక్ తండ్రి వెంకటస్వామి పేరు పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. స్టేడియంలో ఇచ్చే టికెట్ల మీద విశాఖ సంస్థ పెరుపెట్టుకొని విక్రయాలు చేస్తున్నారన్నారు. ఆ తరువాత ఐపీఎల్ వాళ్లను బెదిరించి రూ. లక్షలు వసూళ్లు చేశారని ఆరోపించారు. వివేక్, వినోద్‌లు కలిసి హెచ్‌సీఏని దోచుకుంటున్నారని మండిపడ్డారు. వెంకట స్వామి పేరుతో జరుగుతున్న టోర్నమెంట్లపై రూ.12లక్షలు వసూళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు.
తన ఎంపీ నిధులు రాజీవ్ గాంధీ స్విమ్మింగ్ ఫూల్, ఫుట్ బాల్ గ్రౌండ్, రాజీవ్ గాంధీ పేరుమీద పిల్లలకు స్టైఫండ్ ఇస్తున్నా, ఇది తన రికార్డ్ అని హనుమంతరావు అన్నారు. తెలంగాణ క్రికెట్ అని క్లబ్ ఉంటే నష్టం ఏంటని కేసీఆర్ ని ప్రశ్నించారు. అజారుద్దీన్ అంతర్జాతీయ క్రీడాకారుడు ఆయన సేవలు వినియోగించుకుంటే తప్పేముందని సూచించారు. హెచ్‌సీఏ జరిపే టోర్నమెంట్ లలో ఓపెన్ ఆక్షన్ ఎందుకు పెట్టరో సమాధానం చెప్పాలన్నారు.
కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా వివేక్ తప్పుపడుతున్నారని హనుమంతరావు అన్నారు. సానియా మీర్జా, పీవీ సింధు గెలుస్తే డబ్బులు, భూములు సీఎం కేసీఆర్ ఇస్తున్నారు. హెచ్‌సీఏ మీ అయ్య జాగిరా..? అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. పక్క రాష్టంలో క్రీడలు ఎలా ఉన్నాయి.. తెలంగాణలో ఎలా ఉన్నాయి. వివేక్ రాజకీయంగా ఏమైనా చేసుకో కానీ, క్రీడలను నిర్లక్ష్యం చెయ్యకు అంటూ వీహెచ్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి ఇటు ప్రభుత్వంలో జీతం తీసుకుంటూ హెచ్‌సీఏలో ప్రెసిడెంట్ గా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment