సాక్షి, చెన్నై: నటుడు వివేక్ గుండెపోటుకు గురయ్యే మరణించారని, వివేకంతో ఆలోచించి వ్యాక్సిన్ పట్ల భయాన్ని వీడండని చెన్నై కార్పొరేషన్ కమిషనర్ ప్రకాష్ కోరారు. చెన్నై పోరూరులో శనివారం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ శిబిరాన్ని ఆయన పరిశీలించారు. మీడియాతో మాట్లాడుతూ.. వివేక్ మరణానికి కరోనా వ్యాక్సినే కారణమని విపరీతంగా ప్రచారం జరిగిపోయింది. ఈ దుష్ప్రచారం వల్ల వ్యాక్సిన్ అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వివేక్ మరణించలేదని ఆరోగ్యశాఖ అధికారులు, ఆయనకు చికిత్స చేసిన వైద్యులు స్పష్టం చేశారు. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ధైర్యంగా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. ప్రజల్లో ఉన్న ఈ భయాన్ని పార దోలేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని వివరించారు.
టాప్ టెన్‌లో తమిళనాడు..
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ 8 వేలు దాటింది. దేశవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు 8వ స్థానంలో ఉంది. దేశస్థాయిలో రోజుకు సగటున 13.5 శాతం కేసులు నమోదవుతుండగా, తమిళనాడులో 8.5 శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. కరోనా కేసులు పెరుగకుండా వివిధశాఖలతో సమన్వయమై అనేక చర్యలు చేపడుతున్నారు. కరోనా తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో చేపట్టిన కఠిన చర్యలను తమిళనాడులో కూడా అమలు చేద్దామా అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ రెండురోజులుగా అధికారులతో కలిసి ఆలోచిస్తున్నారు.
ఈనెల 18వ తేదీన ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామిని రాజీవ్‌రంజన్ కలుసుకుని వైద్య నిపుణుల చేసిన సూచనలను వివరించనున్నారు. సీఎం సూచన మేరకు మరిన్ని కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో మాత్రమే కరోనా వ్యాప్తి వేగంగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. నగరంలోని 35 శాతం మంది కరోనా బారినపడినట్లు చెబుతున్నారు. చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోవడంతో సాధారణ ఇన్‌పేషంట్ల అడ్మిట్, ఆపరేషన్లను నిలిపివేశారు.
రాష్ట్రానికి మరో రెండు లక్షల డోసుల వ్యాక్సిన్:
ఈనెల 17 లేదా 18వ తేదీ నాటికి మరో రెండు లక్షల వ్యాక్సిన్ డోసులు తమిళనాడుకు చేరుకుంటాయని ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ సెల్వ వినాయకం తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5 లక్షల డోసులు మూడు రోజులకు మాత్రమే సరిపోతుంది. శనివారం రాత్రి మరో 2 లక్షల డోసుల వ్యాక్సిన్లు తమిళనాడుకు చేరుకుంటాయి. ఇదిగాక మరో 20 లక్షల డోసుల అవసరం ఉందని తెలిపారు.
మాజీ మంత్రికి కరోనా
అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్‌కు శనివారం కరోనా సోకడంతో దిండుగల్లు జిల్లాలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మాస్క్ వేసుకున్నా జరిమానా..
పుదుక్కోట్టై నగరంలో ఎస్‌ఐ శివకుమార్ మాస్క్‌లు ధరించని వారికి జరిమానాలు విధించే విధుల్లో ఉన్నారు. మాస్క్‌ధరించి వచ్చిన మురుగేశన్ (34)కు ఎస్‌ఐ రూ.200 జరిమానా విధించాడు. దీంతో సదరు వ్యక్తికి, ఎస్‌ఐకి మధ్య ఘర్షణ, తోపులాట చోటుచేసుకుంది. ఇందుకు ఆగ్రహించిన ఎస్‌ఐ.మురుగేశన్‌ను అరెస్ట్ చేసి పోలీస్టేషన్‌కు తరలించారు.
కమెడియన్ వివేక్ మృతికి ప్రముఖుల నివాళులు.. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment