comedian Vivek
-
వివేక్ మరణంతో ఉద్వేగంలో వ్యాఖ్యానించా!
సాక్షి, చెన్నై: సినీనటుడు మన్సూర్ అలీఖాన్ ముందస్తు బెయిల్ కోసం సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హాస్యనటుడు వివేక్ మరణంతో ఉద్వేగానికి లోనై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. వివేక్ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న మరుసటి రోజున గుండెపోటుకు గురైన విషయం విధితమే. ఆ సమయంలో మన్సూర్ అలీఖాన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యంగా ఉన్న మనిషిని వ్యాక్సిన్ పేరుతో మంచం ఎక్కించారని ఆరోపించారు. ఇంతో వివేక్ కన్నుమూయడంతో మన్సూర్ ఆగ్రహానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. కరోనా వైరస్ అనేది ప్రజలను గుప్పిట్లో ఉంచుకునేందుకు పాలకులు చేస్తున్న పొలిటికల్ స్టంట్‌గా విమర్శించారు. మన్సూర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం వైరల్ కావడంతో చెన్నై కార్పొరేషన్ కమిషనర్ ప్రకాష్ స్పందించారు. మన్సూర్‌పై డీజీపీ త్రిపాఠీకి ఫిర్యాదు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్‌పై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో మన్సూర్‌పై వడపళని పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలో మన్సూర్ అలీఖాన్ కోర్టును ఆశ్రయించారు. మిత్రుడిని కోల్పోయిన ఆవేదనలో వ్యాఖ్యానించానని, ఆయనకు ఎలాంటి దురుద్దేశం లేదని మన్సూర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనిపై కోర్టు మంగళ లేదా బుధవారాల్లో విచారించే అవకాశముంది. చదవండి: ప్రభుత్వాలకు ధన్యవాదాలు: నటుడు వివేక్ సతీమణి వ్యాక్సిన్‌కు, వివేక్ మృతికి సంబంధం లేదు -
ప్రభుత్వాలకు ధన్యవాదాలు: నటుడు వివేక్ సతీమణి
తమిళసినిమా: ప్రముఖ హాస్యనటుడు వివేక్ శనివారం ఉదయం కన్నుమూసిన విషయం విదితమే. ఆయన జీవితంలోని పలు విశేషాలను గుర్తుచేసుకుందాం.. వివేక్ చిన్నతనం నుంచి చాలా చలాకీగా ఉండేవారు. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పుట్టినరోజు నవంబర్ 19వ తేదీనే వివేక్ కూడా జన్మించారు. వివేక్ రెండో తరగతి చదువుతున్నప్పుడే తన తండ్రితో మాట్లాడి ఇందిరాగాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. అందుకు బదులుగా ఇందిరా గాంధీ కూడా వివేక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాయడం విశేషం. నటుడిగా ఎల్లలు దాటిన వివేక్ చిరకాల కోరిక ఆయన అంతిమదశలో నెరవేరింది. వివేక్.. రజినీకాంత్ నుంచి పలువురు ప్రముఖలతో కలిసి నటించారు. ఒక్క కమలహాసన్ మినహా. ఆ కోరిక ఇండియన్ –2 చిత్రంతో తీరింది. ఆ చిత్రం ఇంకా నిర్మాణంలోనే ఉంది. అదే వివేక్ నటించిన చివరి చిత్రమైంది. మరో విషయం ఏమిటంటే వివేక్ దర్శకుడుగా మెగాఫోన్ పట్టడానికి సలహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ అధినేత టీజీ త్యాగరాజన్ తన సంతాప ప్రకటనలో వెల్లడించారు. వివేక్ ఆ కల నెరవేరకుండానే నిష్క్రమించారు. ఇదిలా ఉంటే.. అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకున్న వివేక్ రాష్ట్రం వ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో ఆయనకు నివాళులర్పించే విధంగా అభిమానులు ఆదివారం నీలగిరిలో 4 లక్షల మొక్కలను నాటారు. కార్యక్రమంలో పాల్గొన్న నీలగిరి జిల్లా కలెక్టర్ ఇన్నెసెంట్ దివ్య ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. వివేక్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇతర పార్టీల నేతలు సంతాపం ప్రకటించిన విషయం తెలిసింది. ఆయన భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. దీంతో వివేక్ సతీమణి అరుళ్ సెల్వి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఉదయం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. చదవండి: వ్యాక్సిన్‌కు, వివేక్ మృతికి సంబంధం లేదు కమెడియన్ వివేక్ మృతికి ప్రముఖుల నివాళులు.. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వ్యాక్సిన్‌కు, వివేక్ మృతికి సంబంధం లేదు
సాక్షి, చెన్నై: నటుడు వివేక్ గుండెపోటుకు గురయ్యే మరణించారని, వివేకంతో ఆలోచించి వ్యాక్సిన్ పట్ల భయాన్ని వీడండని చెన్నై కార్పొరేషన్ కమిషనర్ ప్రకాష్ కోరారు. చెన్నై పోరూరులో శనివారం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ శిబిరాన్ని ఆయన పరిశీలించారు. మీడియాతో మాట్లాడుతూ.. వివేక్ మరణానికి కరోనా వ్యాక్సినే కారణమని విపరీతంగా ప్రచారం జరిగిపోయింది. ఈ దుష్ప్రచారం వల్ల వ్యాక్సిన్ అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వివేక్ మరణించలేదని ఆరోగ్యశాఖ అధికారులు, ఆయనకు చికిత్స చేసిన వైద్యులు స్పష్టం చేశారు. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ధైర్యంగా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. ప్రజల్లో ఉన్న ఈ భయాన్ని పార దోలేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని వివరించారు. టాప్ టెన్‌లో తమిళనాడు.. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ 8 వేలు దాటింది. దేశవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు 8వ స్థానంలో ఉంది. దేశస్థాయిలో రోజుకు సగటున 13.5 శాతం కేసులు నమోదవుతుండగా, తమిళనాడులో 8.5 శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. కరోనా కేసులు పెరుగకుండా వివిధశాఖలతో సమన్వయమై అనేక చర్యలు చేపడుతున్నారు. కరోనా తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో చేపట్టిన కఠిన చర్యలను తమిళనాడులో కూడా అమలు చేద్దామా అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ రెండురోజులుగా అధికారులతో కలిసి ఆలోచిస్తున్నారు. ఈనెల 18వ తేదీన ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామిని రాజీవ్‌రంజన్ కలుసుకుని వైద్య నిపుణుల చేసిన సూచనలను వివరించనున్నారు. సీఎం సూచన మేరకు మరిన్ని కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో మాత్రమే కరోనా వ్యాప్తి వేగంగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. నగరంలోని 35 శాతం మంది కరోనా బారినపడినట్లు చెబుతున్నారు. చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోవడంతో సాధారణ ఇన్‌పేషంట్ల అడ్మిట్, ఆపరేషన్లను నిలిపివేశారు. రాష్ట్రానికి మరో రెండు లక్షల డోసుల వ్యాక్సిన్: ఈనెల 17 లేదా 18వ తేదీ నాటికి మరో రెండు లక్షల వ్యాక్సిన్ డోసులు తమిళనాడుకు చేరుకుంటాయని ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ సెల్వ వినాయకం తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5 లక్షల డోసులు మూడు రోజులకు మాత్రమే సరిపోతుంది. శనివారం రాత్రి మరో 2 లక్షల డోసుల వ్యాక్సిన్లు తమిళనాడుకు చేరుకుంటాయి. ఇదిగాక మరో 20 లక్షల డోసుల అవసరం ఉందని తెలిపారు. మాజీ మంత్రికి కరోనా అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్‌కు శనివారం కరోనా సోకడంతో దిండుగల్లు జిల్లాలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాస్క్ వేసుకున్నా జరిమానా.. పుదుక్కోట్టై నగరంలో ఎస్ఐ శివకుమార్ మాస్క్‌లు ధరించని వారికి జరిమానాలు విధించే విధుల్లో ఉన్నారు. మాస్క్ధరించి వచ్చిన మురుగేశన్ (34)కు ఎస్ఐ రూ.200 జరిమానా విధించాడు. దీంతో సదరు వ్యక్తికి, ఎస్ఐకి మధ్య ఘర్షణ, తోపులాట చోటుచేసుకుంది. ఇందుకు ఆగ్రహించిన ఎస్ఐ.మురుగేశన్‌ను అరెస్ట్ చేసి పోలీస్టేషన్‌కు తరలించారు. కమెడియన్ వివేక్ మృతికి ప్రముఖుల నివాళులు.. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్ కాలానికి కరిగిపోని ‘వివేక్’ నవ్వు -
హాస్య నటుడు వివేక్ మృతి.. ప్రముఖుల నివాళులు
-
కాలానికి కరిగిపోని ‘వివేక్’ నవ్వు
వివేకం + ఆనందం = వివేకానందం. సార్థక నామధేయుడు – ప్రసిద్ధ తమిళ నటుడు ‘వివేకానందన్’ అలియాస్ వివేక్. చేసింది హాస్యపాత్రలే అయినప్పటికీ వివేకవంతమైన సంభాషణలతో విజ్ఞానాన్నీ, హాస్యసంభాషణలతో ఆనందాన్నీ పంచారు వివేక్. ప్రముఖ తమిళ హాస్య, సహాయ నటుడు వివేకానందన్ (వివేక్) శనివారం తుది శ్వాస విడిచారు. శుక్రవారం గుండెపోటుతో చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు. శనివారం తెల్లవారుజామున 4.35 గంటలకు వివేక్ (59) కన్నుమూశారు. తమిళనాడులోని కోవిల్పట్టిలో 1961 నవంబర్ 19న జన్మించాడు. దిండిగల్‌లో టెలిఫోన్స్ శాఖలో టెలిఫోన్ ఆపరేటర్‌గా శిక్షణ పొందారు. చెన్నైలో సెక్రటేరియట్లో పనిచేస్తూ, ‘మద్రాస్ హ్యూమర్ క్లబ్’లో ‘స్టాండప్ కమెడియన్’గా చేసేవారు. క్లబ్ వ్యవస్థాపకుడు గోవిందరాజన్ ద్వారా దర్శకుడు కె. బాలచందర్‌తో వివేక్కి పరిచయం ఏర్పడింది. రచన టు నటన... బాలచందర్ దర్శకత్వంలో రూపొందే సినిమాలకు స్క్రిప్ట్ రైటర్‌గా చేయడం మొదలుపెట్టారు వివేక్. ఒకరోజు ఒక సందర్భాన్ని వివరించి, పదహారు పాత్రలతో కథ రాయమన్నారు బాలచందర్. ఒకే ఒక్క రాత్రిలో వివేక్ రాసిచ్చారు. ‘మనదిల్ ఉరుది వేండుమ్’ (1987) చిత్రానికి స్క్రిప్ట్ అసిస్టెంట్‌గా చేస్తున్నప్పుడు చిత్రదర్శకుడు బాలచందర్ వివేక్కి మంచి పాత్ర ఇచ్చారు. తొలిరోజు షూట్లో వివేక్ మెట్లపై నుంచి వేగంగా కిందకు దిగాలి. బాలచందర్ తృప్తిగా కట్ చెప్పేవరకూ మెట్లు దిగారు. ఫలితంగా కాలి వేళ్లకు గాయమైంది. కానీ బాలచందర్ దగ్గర చెప్పలేదు. విషయం తెలిసి, ఆయన చికిత్స చేయించుకోమన్నారు. నటుడిగా తొలి సీన్లో మెట్లు దిగిన వివేక్ ఆ తర్వాత కెరీర్లో ఎన్నో మెట్లు ఎక్కారు! విజ్ఞానం పంచిన నటుడు... బాలచందర్ దర్శకత్వం వహించిన ‘పుదు పుదు అర్థంగళ్’, ‘ఒరు వీడు – ఇరు వాసల్’ వంటి చిత్రాల్లోనూ వివేక్ మంచి పాత్రలు చేశారు. ‘పుదు పుదు అర్థంగళ్’లో ‘ఇన్నిక్కు సత్తా... నాళైక్కు పాల్’ (ఇవాళ చచ్చిపోతే... రేపటికి రెండు) అని పదే పదే అంటుంటారు వివేక్. అర్థవంతమైన ఈ డైలాగ్‌ని వివేక్ నవ్వు తెప్పించేట్లు పలికారు. ఆ మాటకొస్తే... ఇలాంటి డైలాగులు చాలానే చెప్పారు. ‘వర్ణం అనేది జెండాలో మాత్రమే ఉండాలి. మనుషుల మనసుల్లో ఉండకూడదు రా’, ‘మిమ్మల్ని మార్చాలంటే ఎంతమంది పెరియార్లు వచ్చినా కుదరదు’, ‘ఇక్కడ డబ్బులు ఇవ్వనిదే పనులు జరగవు శివాజీ’ వంటి ఆయన డైలాగులు వివిధ తమిళ చిత్రాల్లో నవ్వించాయి... ఆలోచింపజేశాయి. అందుకే నవ్వులు మాత్రమే కాదు.. విజ్ఞానం పంచిన నటుడు కూడా! అది వివేక్ సీజన్... 1990ల మధ్య నుంచి ఓ పదేళ్లకు పైగా తమిళ పరిశ్రమలో కామెడీ పరంగా ‘వివేక్ సీజన్’ అని చెప్పాలి. అప్పట్లో వివేక్ లేని తమిళ సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ‘సొల్లి అడిప్పేన్’ (2004) హీరోగా వివేక్కి తొలి తమిళ చిత్రం. ఆ తర్వాత విక్రమ్‌తో శంకర్ తీసిన ‘అన్నియన్’ (అపరిచితుడు)లో అండర్‌కవర్ పోలీసాఫీసర్‌గా వివేక్ చేసిన పాత్ర ఆకట్టుకుంది. రజనీకాంత్, కమలహాసన్ దగ్గర నుంచి మాధవన్, అజిత్, ఇవాళ్టి హీరోలు విజయ్, ధనుష్ దాకా తమిళ స్టార్లందరితోనూ ఆయన నటించారు. రజనీకాంత్ ‘శివాజీ’, మాధవన్‌తో ‘అలైపాయుదే’ (‘సఖి’), ‘మిన్నలే’ (‘చెలి’), ధనుశ్ ‘వీఐపీ’ (‘రఘువరన్ బీటెక్’) లాంటి చిత్రాల్లో వివేక్ పండించిన హాస్యం మరచిపోలేనిది. అలాగే వివేక్ ‘నాన్‌దాన్ బాలా’, ‘పాలగాట్టు మాధవన్’, ‘వెళ్లై పూక్కళ్’ వంటి చిత్రాల్లో లీడ్ రోల్స్ చేశారు. తెరపై నవ్వు... తెరవెనక దుఃఖం... తెరపై నవ్వులు పంచిన వివేక్ జీవితంలో జరిగిన పెద్ద విషాదం ఆయన తనయుడు ప్రసన్నకుమార్ 13 ఏళ్ల వయసులో మెదడు వాపు వ్యాధితో మరణించడం! 2016లో ప్రసన్నకుమార్ చనిపోయాక వివేక్ కుంగిపోయారు. వివేక్‌కు భార్య అరుళ్ సెల్వి, ఇద్దరు కుమార్తెలు – అమృతనందిని, తేజస్విని ఉన్నారు. 2019లో తల్లి మణియమ్మాళ్ మరణం వివేక్‌ను చాలా బాధించింది. సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి... ఇప్పుడు వివేక్ గురించి అందరూ అంటున్న మాట ఒకటే... మంచి నటుడే కాదు, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అని! అయిదేళ్ళ క్రితం తమిళనాట డెంగూ, మెదడువాపు జ్వరాలు ప్రబలుతున్నప్పుడు జనంలో చైతన్యం కలిగించడానికి ప్రభుత్వ ప్రచారోద్యమంలో భాగస్వామి అయ్యారు. కానీ, అదే డెంగూ, మెదడువాపు జ్వరాలకు వివేక్ తన కుమారుణ్ణి కోల్పోవడం విషాదం. తాజాగా కరోనా సెకండ్ వేవ్ సమయంలో ప్రజల్లో కోవిడ్ టీకాపై అవగాహన కల్పించాలని ఆయన భావించారు. గుండెపోటు రావడానికి సరిగ్గా ముందు రోజే వివేక్ తమిళనాడు ప్రభుత్వం పక్షాన కోవిడ్ టీకా ఉద్యమానికి ప్రచారకర్తగా నిలిచారు. ప్రభుత్వా సుపత్రిలో టీకా వేయించుకున్నారు. బండికి ఇన్సూరె¯Œ ్స చేయించుకున్నాం కాబట్టి రోడ్డు ప్రమాదం జరగదని అనుకోవడం పొరపాటని తనదైన శైలిలో కామెడీ చేస్తూనే, టీకా వేసుకొని, కరోనా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం గురించి హాస్యధోరణిలో మాట్లాడారు. ఆ మరునాడే తీవ్రమైన గుండెపోటుతో, అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య ప్రచారం కోసం ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేసిన రెండు సందర్భాలూ ఆయన జీవితంలో తీరని విషాదాలుగా మారిపోవడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ, తీరని దుఃఖం మిగిల్చిన విచిత్రం. తమిళంలో హాస్యం అంటే.. ఇప్పటికీ ఎన్.ఎస్. కృష్ణన్ – ఆయన సతీమణి టి.ఏ. మధురం జంట పేరే చెబుతారు. ఆ తొలితరం సినీ – నిజజీవిత జంట పండించిన హాస్యం అంత పాపులర్. ఆ రోజుల్లో ఎన్.ఎస్. కృష్ణన్‌ను తమిళంలో ‘కలైవానర్’ అని పిలిచేవారు. అంటే, ‘కళా ప్రియుడు, కళల్లో విద్వాంసుడు’ అని అర్థం. కృష్ణన్ మరణించిన మూడున్నర దశాబ్దాల తర్వాత సినీ రంగంలోకి వచ్చిన వివేక్ ‘చిన్న కలైవానర్’ అయ్యారు. తమిళ సినీ అభిమానుల్లో వివేక్‌కు లభించిన అతి పెద్ద గౌరవం అది అని చెప్పుకోవచ్చు. ‘పద్మశ్రీ’ లాంటి ప్రభుత్వ పురస్కారాలు దక్కినా, తమిళనాడు రాష్ట్రప్రభుత్వం నుంచి పలు అవార్డులు అందుకున్నా, జనం ఇచ్చిన ఈ ‘చిన్న కలైవానర్’ టైటిల్‌ను వివేక్ అపురూపంగా భావించేవారు. అబ్దుల్ కలామ్ స్ఫూర్తితో... వివేక్ ఆఫీసు రూములో ఆయన టేబుల్ మీద తిరుక్కురళ్ రాసిన ప్రాచీన తమిళ కవి – సంస్కర్త తిరువళ్ళువర్, ధ్యాన ముద్రలో బుద్ధుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ బొమ్మలు కనిపిస్తాయి. 2009లో ‘పద్మశ్రీ’ పురస్కారం వచ్చినప్పుడు ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌ను కలిశాక, మొక్కల ఉద్యమం చేపట్టారు వివేక్. గ్లోబల్ వార్మింగ్ ప్రమాదం గురించి, మొక్కల అవసరం గురించి కలామ్ తన డైరీలో రాసుకున్న ఓ కవిత వివేక్ ఉద్యమానికి ఊపిరిపోసింది. అప్పటి నుంచి ఆయన తమిళనాట హరిత ఉద్యమానికి అనధికారిక అంబాసిడర్ అయ్యారు. ఏకంగా కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా చేసుకున్నారు. ఆ మేరకు ప్రజలకూ, తన ఫ్యాన్స్‌కూ పిలుపునిచ్చారు. ఇప్పటికే దాదాపు 35 లక్షల దాకా మొక్కలు నాటడంలో, నాటించడంలో సక్సెస్ అయ్యారు. త్వరలోనే ఆ కోటి మొక్కలతో కాంతులు నింపాలనుకున్నారు. కానీ, ఇంతలోనే ఇలా జరిగింది. ‘అయ్యో నవ్వు చచ్చిపోయిందే’... అంటూ వివేక్ అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘తెర మీద నటించడంతో నటుడి బాధ్యత అయిపోయిందని అనుకోని వ్యక్తి వివేక్. సమాజానికి ఉపయోగపడేలా తన వంతుగా ఏదైనా చేయాలనుకున్న మంచి మనిషి’’ అన్నారు కమలహాసన్. రజనీకాంత్, వెంకటేశ్, దేవిశ్రీప్రసాద్ వంటి ఎందరో ప్రముఖులు వివేక్ హఠాన్మరణానికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాలంతో పాటు మనిషి కరిగిపోవచ్చు. కానీ... వివేక్ కాలంతో పాటు కరిగిపోని నవ్వులు పంచారు. మంచిని పంచారు. ఆ నవ్వుకీ, ఆ మంచికీ మరణం లేదు! - డి.జి. భవాని -
కమలహాసన్ నా జీవితాన్ని నాశనం చేశారు
సినిమా: తన జీవితాన్ని నాశనం చేశారని ప్రముఖ హాస్యనటుడు వివేక్ అన్నారు. ఈయన మాజీ పోలీస్ అధికారిగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వెళ్లై పూక్కళ్. అమెరికాకు చెందిన ఇందూస్ క్రియేషన్స్ పతాకంపై దిఘా శేఖరన్, వరుణ్, అజయ్ సంపత్‌లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ ఇళంగోవన్ దర్శకత్వం వహించారు. ఈ దర్శక నిర్మాతలు మైక్రోసాఫ్ట్ ఇంజినీర్లు అయినా, పలు లఘు చిత్రాలను, స్టేజ్ నాటకాలను రూపొందించడం విశేషం. లఘు చిత్రాలతో అంతర్జాతీయ అవార్డులను అందుకున్న ఈ హాలీవుడ్ టీమ్ తొలిసారిగా రూపొందించిన తమిళ చిత్రం వెళ్లై పూక్కళ్. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 19వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. మాజీ పోలీస్ అధికారి అయిన వివేక్ శేష జీవితాన్ని అమెరికాలో ఉన్న కొడుకు, కోడలు వద్ద గడపాలని అక్కడికి వెళ్లతాడు. అక్కడ చుట్టుపక్కల వారితో పరిచయం చేసుకుని వారితో స్నేహంగా గడుపుతుంటాడు. అలాంటి సమయంలో వారిలో కొందరు హత్యకు గురవుతారు. ఆ హత్యా ఉదంతాన్ని వివేక్ ఎలా ఛేదించారన్న ఇతివృతంతో తెరకెక్కిన చిత్రం వెళ్లై పూక్కళ్ అని చిత్ర దర్శకుడు తెలిపారు. సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్ స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నటుడు వివేక్ మాట్లాడుతూ తాను ప్రముఖ హీరోలందరితోనూ నటించానని, అవన్నీ విజయాలు సాధించాయని అన్నారు. అయితే తాను హీరోగా నటించిన చిత్రాలే సక్సెస్ కాలేదని వాపోయారు. అలా తాను కథానాయకుడిగా నటించిన చిత్రాల్లో నాన్ దాన్ బాల తన కేరీర్‌లోనే బెస్ట్ చిత్రం అన్నారు. అయితే ఆ చిత్ర విడుదలకంటే ముందు కమలహాసన్ నటించిన పాపనాశం చిత్రం విడుదలై థియేటర్లన్నీ ఆక్రమించిందని అన్నారు. అలా తన జీవితాన్ని కమలహాసన్ నాశనం చేశారని అన్నారు. ఈ విషయాన్ని వెంటనే కమలహాసన్‌కు చెప్పొద్దని, ఆయనంటే తనకు గౌరవం ఉందని వివేక్ అన్నారు. నిజానికి వివేక్ నటించిన నాన్ దాన్ బాలా చిత్రం చాలా కాలం ముందే నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోకుండా మూలన పడింది. దాని విడుదలకు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదన్నది గమనార్హం. -
బూస్ట్ ఇచ్చారు
‘వై దిస్ కొలవెరి’తో తమిళ హీరో ధనుష్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారో మనందరికీ తెలిసిందే. తరచూ కాకపోయినా అప్పడప్పుడు తన సినిమాల్లో, ఫ్రెండ్లీగా వేరే హీరోల సినిమాలకు పాడుతుంటారాయన. రీసెంట్గా కమెడియన్ వివేక్ సినిమా కోసం ఓ పాట పాడారట. ‘‘ఉత్తమపుత్తిరన్, రఘువరన్ బీటెక్’లో వీళ్ల కాంబినేషన్లో కామెడీ బాగా కుదిరింది. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్తోనే వివేక్ లేటెస్ట్ సినిమా ‘ఇళుమిన్’ కోసం మైక్ పట్టుకున్నారట ధనుష్. గణేశ్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన సాంగ్‌ను ధనుష్ పాడగా రికార్డ్ చేశారు. ‘‘ధనుష్ పాట సినిమాకు స్పెషల్‌గా ఉండబోతుంది. సినిమాకు కూడా ఆయన పాడిన పాట బూస్ట్’’ అన్నారు దర్శకుడు. -
రజనీ, కమల్ ఎవరైనా రాజకీయాల్లొకి రావొచ్చు
తమిళసినిమా: రజనీకాంత్, కమలహాసన్ ఇలా ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చునని, అయితే వచ్చిన తరువాత నూరు శాతం అంకిత భావం కలిగి ఉండాలని హాస్యనటుడు వివేక్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం నామక్కల్ సమీపంలోని పొదుపట్టి గ్రామంలోని గ్రీన్‌పార్క్ పాఠశాలలో జరిగిన సాంస్కృత కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఈయన విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడులో వర్షాభావం అధికంగా ఉందన్నారు. దీంతో పంటలు పండక రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారన్నారు. వర్షాభావాన్ని అధిగమించడం విద్యార్థులు,యువత చేతి లో ఉందని అన్నారు. దివంగత పూర్వ రాష్ట్రపతి, విజ్ఞాని అబ్దుల్ కలామ్ విజ్ఞప్తి మేరకు తాను రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. ఇప్పటికే 28 లక్షల 90 వేల మొక్కలను నాటామని, కోటి మొక్కలను నాటాలన్నది మా లక్ష్యమని అన్నారు. విద్యార్థులు మొక్కలు నాటే కార్యానికి నడుం బిగించాలన్నారు. అప్పుడే ప్రభుత్వం ముందుకు వచ్చి మీకు సహకరిస్తుందని చెప్పారు. రజనీకాంత్, కమలహాసన్‌ల రాజకీయరంగప్రవేశం గురించి మాట్లాడుతూ ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చునని, అయితే వచ్చిన తరువాత వంద శాతం అంకిత భావంతో ప్రముఖ నేతలు కామరాజర్, కక్కన్, ఓమందూర్రామ్, పశుంపెన్ ముత్తురామలింగం, అబ్దుల్‌కలాం లాంటి ఉత్తమ నేతలా పేరు తెచ్చుకోవాలని వివేక్ పేర్కొన్నారు. -
దెయ్యాలు అంటే ఆడవాళ్లేనా!
తమిళ సినిమా : దెయ్యాలు అంటే ఆడవాళ్లేనా అని ప్రముఖ హాస్యనటుడు వివేక్ ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు విజయ్ సోదరుడు ఉదయ హీరోగా నటిస్తున్న చిత్రం ఆవి కుమార్. నటి కనిక తివారి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్ టేక్ మూవీ పతాకంపై ఎస్.శ్రీధర్, శివ, శరవణన్ నిర్మిస్తున్నారు. కే.కందీపన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఆంటోని సంగీతం అందించారు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల నగరంలోని ఓ నక్షత్ర హోటల్లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న హాస్యనటుడు వివేక్ మాట్లాడుతూ ప్రస్తుతం పిశాచి, దెయ్యం లాంటి కథా చిత్రాలు అధికంగా వస్తున్నాయన్నారు. ఇలాంటి చిత్రాల్లో ఎక్కువగా ఆడవాళ్లనే దెయ్యాలుగా చూపిస్తున్నారని, మగవాళ్లను ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. మగ దెయ్యాలు ఉండవా అని అనుమానం వ్యక్తం చేశా రు. ఇకనైనా మగవాళ్లను కూడా దెయ్యాలుగా చూపించే చిత్రాలు తెరమీదకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలైపులి జీ.శేఖరన్, శివశక్తి పాండియన్, శ్రీకాంత్‌దేవా, ఉదయ తదితరులు పాల్గొన్నారు. -
ఆమె నడుమును గిల్లేశా
హాస్యనటుడు వివేక్ నటి సోనియా అగర్వాల్ నడుమును రెచ్చిపోయి గిల్లేశాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. హాస్యనటుడిగా తమిళ ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకున్న వివేక్‌కు కథా నాయకుడిగా ఆదరణ పొందాలన్నది చిరకాలవాంఛ. అందుకు చేసిన ఒకటి రెండు ప్రయత్నాలు సఫలం కాలేదు. తాజాగా మరో ప్రయత్నమే పాలక్కాడు మాధవన్. ఈ చిత్రంలో ఆయన తన మార్కు హీరోయిజాన్ని చూపించడానికి సిద్ధం అయ్యారు. ఎస్ఎస్ఎస్ ఎం టర్టైన్మెంట్ అధినేత జె ఎ లారెన్స్ సమర్పణలో మ్యాగ్నస్ ప్రొడక్షన్ పతాకంపై ఎస్.సజీవ్ నిర్మించిన చిత్రం పాలక్కాడు మాధవన్. వివేక్ సరసన సోనియా అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సీనియర్ నటి షీలా ముఖ్యపాత్రను పోషించారు. ఎం.చంద్రమోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీకాంత్‌దేవా సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువా రం ఉదయం చెన్నైలోని సత్యం సినీ కాంప్లెక్స్‌లో జరిగింది. చిత్ర ఆడియోను నటు డు శివకార్తికేయన్ ఆవిష్కరించగా యువ సంగీత దర్శకుడు అనిరుధ్ తొలి సీడీని అందుకున్నారు. ఈ చిత్రంలో అనిరుధ్ ఒక పాట పాడటం విశేషం. ఈ కార్యక్రమంలో నటుడు వివేక్ మాట్లాడుతూ ఇది అగ్రహారంలో జరిగే వినోదభరిత కథా చిత్రం అన్నారు. తన లాంటి నటులు సరసన నటించడానికి చాలామంది హీరోయిన్లు సాహసించని పరిస్థితిలో నటి సోనియా అగర్వాల్ ధైర్యంగా ముందుకొచ్చి నటించారన్నారు. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో తానామె నడుమును గిల్లాల్సి ఉంటుందన్నారు. అలా చేయడానికి సందేహించడంతో ఫర్వాలేదు నటనే కదా అంటూ సోనియా ప్రోత్సహించారన్నారు. అలాంటి ఎంకరేజ్మెంట్ ఉండడంతో రెచ్చిపోయి గిల్లేశానని అన్నారు. పాలక్కాట్టు మాధవన్‌ను మొదట చిన్న చిత్రం గానే ప్రారంభించినా పెద్ద చిత్రంగా తెరకెక్కిందని వివేక్ వెల్లడించారు. -
గీత రచయితగా హాస్యనటుడు వివేక్
హాస్య నటుడు వివేక్ మంచి సాహితీకారుడు కూడా ఉన్నాడు. ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీత మైక్ పట్టుకుంటే మాటల దొంతరలు ప్రవహిస్తాయి. వాటిలో హాస్యం, సాహిత్యం, వివేకం, విజ్ఞానం, సామాజిక స్పృహ ఇలా పలు అంశాలు చోటు చేసుకుంటాయి. అయితే హాస్యనటుడిగా అందలం ఎక్కిన వివేక్ హీరోగా నటిస్తున్న మూడో చిత్రం పాలకాట్టు మాధవన్. సోనియా అగర్వాల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వివేక్ సొంతంగా ఒక పాట రాయడం విశేషం. ఈ పాటను యువ సంగీత దర్శకుడు అనిరుధ్ పాడితే బాగుంటుందని వివేక్ భావించారు. తన అభిప్రాయాన్ని అనిరుధ్‌కు తెలపగా మరో మాట లేకుండా ఆయన పాడటానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు వివేక్ వెల్లడించారు. ఈ పాటను శ్రీకాంత్‌దేవా సంగీత సారథ్యంలో ఇటీవల రికార్డ్ చేసినట్లు తెలిపారు. త్వరలో తెరపైకి రానున్న ఈ చిత్రంలో సీనియర్ దర్శకుడు కె.భాగ్యరాజ్ ముఖ్యపాత్ర పోషించడం మరో విశేషం. -
వివేక్ ప్రశంసలందుకున్న పట్రా
పట్రా చిత్రం ప్రముఖ హాస్యనటుడు వివేక్ ప్రశంసలు పొంది అంతా కొత్త వారితో తెరకెక్కిన చిత్రం పట్రా. జి.కె.సినిమాస్ పతాకంపై ఎ.గాంధికుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జయందాన్ దర్శకత్వం వహించారు. నవజంట మిథున్ వైదేహి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో శ్యామ్‌పాల్, పులిపాండి, ఆదేష్, రేణిగుంట గణేష్, ఉమ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సునోజ్ వేలాయుధన్ ఛాయాగ్రహణం, శ్రీకృష్ణ సంగీతాన్ని అందించిన పట్రా చిత్రాన్ని ఈ నెలాఖరుకు విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు. బుధవారం సాయంత్రం విలేకరులతో దర్శకుడు జయందాన్ మాట్లాడుతూ, పట్రా అంటే ఆయుధాలను తయారు చేసే స్థలం అని తెలిపారు. చిత్రం పేరు, పోస్టర్లు చూసి కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఇదేదో హింసాత్మక సంఘటనలతో కూడిన చిత్రంగా ఉందనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. నిజానికిందులో హింసాత్మక సంఘటనలుండవన్నారు. చిత్ర నిర్మాత గాంధికుమార్ మాట్లాడుతూ దర్శకుడు జయందాన్ తనకు బాల్యమిత్రుడని తెలిపారు. తనను ప్రోత్సహించడానికే తానీ చిత్రం నిర్మించినట్లు తెలిపారు. చిత్రం చాలా సంతృప్తికరంగా వచ్చిందని చిత్ర టైటిల్, పోస్టర్లు, ప్రచార చిత్రాన్ని చూసిన హాస్యనటుడు వివేక్ బాగున్నాయంటూ ప్రశంసించటం ఆనందంగా ఉందన్నారు.