సినిమా: తన జీవితాన్ని నాశనం చేశారని ప్రముఖ హాస్యనటుడు వివేక్ అన్నారు. ఈయన మాజీ పోలీస్ అధికారిగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వెళ్‌లై పూక్కళ్. అమెరికాకు చెందిన ఇందూస్ క్రియేషన్స్ పతాకంపై దిఘా శేఖరన్, వరుణ్, అజయ్ సంపత్‌లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ ఇళంగోవన్ దర్శకత్వం వహించారు. ఈ దర్శక నిర్మాతలు మైక్రోసాఫ్ట్ ఇంజినీర్లు అయినా, పలు లఘు చిత్రాలను, స్టేజ్ నాటకాలను రూపొందించడం విశేషం. లఘు చిత్రాలతో అంతర్జాతీయ అవార్డులను అందుకున్న ఈ హాలీవుడ్ టీమ్ తొలిసారిగా రూపొందించిన తమిళ చిత్రం వెళ్‌లై పూక్కళ్. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 19వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. మాజీ పోలీస్ అధికారి అయిన వివేక్ శేష జీవితాన్ని అమెరికాలో ఉన్న కొడుకు, కోడలు వద్ద గడపాలని అక్కడికి వెళ్లతాడు. అక్కడ చుట్టుపక్కల వారితో పరిచయం చేసుకుని వారితో స్నేహంగా గడుపుతుంటాడు.
అలాంటి సమయంలో వారిలో కొందరు హత్యకు గురవుతారు. ఆ హత్యా ఉదంతాన్ని వివేక్ ఎలా ఛేదించారన్న ఇతివృతంతో తెరకెక్కిన చిత్రం వెళ్‌లై పూక్కళ్ అని చిత్ర దర్శకుడు తెలిపారు. సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్ స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నటుడు వివేక్ మాట్లాడుతూ తాను ప్రముఖ హీరోలందరితోనూ నటించానని, అవన్నీ విజయాలు సాధించాయని అన్నారు. అయితే తాను హీరోగా నటించిన చిత్రాలే సక్సెస్ కాలేదని వాపోయారు. అలా తాను కథానాయకుడిగా నటించిన చిత్రాల్లో నాన్ దాన్ బాల తన కేరీర్‌లోనే బెస్ట్ చిత్రం అన్నారు. అయితే ఆ చిత్ర విడుదలకంటే ముందు కమలహాసన్ నటించిన పాపనాశం చిత్రం విడుదలై థియేటర్లన్నీ ఆక్రమించిందని అన్నారు. అలా తన జీవితాన్ని కమలహాసన్ నాశనం చేశారని అన్నారు. ఈ విషయాన్ని వెంటనే కమలహాసన్‌కు చెప్పొద్దని, ఆయనంటే తనకు గౌరవం ఉందని వివేక్ అన్నారు. నిజానికి వివేక్ నటించిన నాన్ దాన్ బాలా చిత్రం చాలా కాలం ముందే నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోకుండా మూలన పడింది. దాని విడుదలకు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment