
తమిళనాడులో తెలుగు ప్రజలనుద్దేశించి నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆమెపై కేసు కూడా నమోదైయింది. కస్తూరి వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె వైఖరిని ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి. కస్తూరి మాత్రం తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకకరించారని చెబుతోంది.
తాజాగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ..తెలుగు ప్రజలు అంటే తనకు చాలా గౌరవం అని.. వారిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. అసత్య ప్రచారం వల్ల తెలుగు ప్రజలు తనను అపార్థం చేసుకుంటున్నారని.. తన వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు.
‘తమిళనాడులో ఇప్పుడు డ్రవిడియన్ ఐడియాలజీ జరుగుతుంది. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేవాళ్లు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. రోజుకో వ్యక్తితో అక్రమ సంబంధం అంటగడుతున్నారు. తాగుడు అలవాటే లేకున్నా.. తాగుబోతునని ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్న డీఎంకే పార్టీపై విమర్శలు చేసినందుకే నాపై ఇలాంటి అబద్ధాలు, అసత్య ప్రచారాలు జరిపిస్తున్నారు.
ఇటీవల నేను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదు. నేను బ్రాహ్మణులకు జరిగిన అన్యాయంపై మాట్లాడుతూ.. ఎక్కడి నుంచో తమిళనాడుకు వచ్చిన డీఎంకే నేతలను ఉద్దేశించి మాట్లాడానే తప్ప తెలుగువారిని ఒక్క మాట కూడా అనలేదు. తెలుగు అనే పదం వాడింది నిజమే. కానీ నేను ఏ ఉద్దేశ్యం గురించి ఆ పదం వాడానో నా స్పీచ్ మొత్తం వింటే తెలుస్తుంది. తెలిసో తెలియకో ఓ మాట అన్నాను.దాన్ని తప్పుగా వక్రీకరిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారు’ అని కస్తూరి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment