సాక్షి, భూపాలపల్లి: టీఆర్‌ఎస్ పెద్దపల్లి ఎంపీ టికెట్ వివేక్‌కు దక్కకపోవడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు ఆయనకే సీటు వరిస్తుందని అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో అభ్యర్థి పేరు మారడం హాట్ టాపిక్‌గా మారింది. జిల్లాలోని కాటారం, మహదేవాపూర్, మల్హర్, పలిమెల, మహాముత్తారం మండలాలు పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోకి వస్తాయి. కాగా ఇన్నాళ్లుగా వివేక్‌కే సీటు పక్కా అనుకున్న వారికి చివరిలో షాక్ తగిలింది.
వివేక్‌ను కాదని కొత్తగా వచ్చిన బోర్లకుంట వెంకటేష్ నేతకు టికెట్ ఇవ్వడంతో నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లాలో కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం వివేక్ దారి ఎటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దశాబ్దాలుగా చుట్టూ పక్కల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఎవరుండాలని నిర్ణయించిన వెంకటస్వామి కుటుంబానికి ప్రస్తుతం టికెట్ రాలేదనే వార్తలు వాట్సాప్, ఫేస్‌బుక్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలే కొంప ముంచాయా..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలే వివేక్ టికెట్ దక్కకపోవడానికి కారణంగా తెలుస్తోంది. వివేక్ టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని పలువురు ఎమ్మెల్యేలు గతంలో బహిరంగంగానే విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్ సోదరుడు మాజీ మంత్రి వినోద్ చెన్నూర్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. దీంతో ఆయన బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి చిన్నయ్య చేతిలో ఓటమిపాలయ్యారు.
తన అన్న గెలుపు కోసం టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని మంచిర్యాల, చెన్నూ ర్, బెల్లంపల్లి, ధర్మపురి, రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు బాహాటంగానే విమర్శించినట్లు సమాచారం. ఎమ్మెల్యే సూచనల మేరకే టీఆర్‌ఎస్ పెద్దలు వివేక్‌కు పెద్దపల్లి ఎంపీ సీటు నిరాకరించినట్లు జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇలా వచ్చాడు.. అలా పట్టాడు..
కొత్తగా పార్టీలో చేరిన బోర్లకుంట వెంకటేష్ నేతకు పెద్దపల్లి టికెట్ వరించింది. వెంకటేష్ నేత గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. జిల్లాను ఆనుకుని ఉన్న చెన్నూర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచాడు. ఇదే నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరఫున బాల్క సుమన్ పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక దశలో బాల్క సుమన్‌కు వెంకటేష్ నేత గట్టిపోటీని ఇచ్చారు. గతంలో వ్యతిరేకంగా పనిచేసిన వీరిద్దరు ప్రస్తుతం టీఆర్‌ఎస్ గెలుపు కోసం కలిసి పని చేస్తున్నారు.
ఇటీవలే స్వయంగా బాల్క సుమన్ దగ్గర ఉండి వెంకటేష్ నేతను టీఆర్‌ఎస్‌లో చేర్పించారు. దీంతో చివరి నిమిషం దాకా వివేక్‌కే అనుకున్న టికెట్ వెంకటేష్ నేత తలుపు తట్టింది. కాగా ప్రస్తుతం జిల్లాలో ఉన్న వివేక్ అనుకూలవర్గం టీఆర్‌ఎస్‌కు సహకరిస్తుందా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. త్వరలో బీజేపీలో వివేక్ చేరుతారంటూ జిల్లాలో వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment