
చితి రగిలింది..గుండె పగిలింది!
‘రేయ్! బాలాజీ..లెయ్ రా..రేయ్!..ఎందుకు రా ఇంత పనిచేశావు? ఏం ఖర్మ పట్టిందిరా నీకు?
తిరుపతి తుడా : ‘రేయ్! బాలాజీ..లెయ్ రా..రేయ్!..ఎందుకు రా ఇంత పనిచేశావు? ఏం ఖర్మ పట్టిందిరా నీకు? ఏరోజూ నిన్ను ఒక్క మాట కూడా అనలేదు కదరా! మూడు నెలల ముందే దేశమంతా తిప్పాను..అందరితో ఎంతో సంతోషంగా ఫొటోలు కూడా తీసుకున్నావ్ కదరా!..మంచి డాక్టరనవుతానని ఎన్నో చెప్పావు..మాకు తలకొరివి పెట్టాల్సిన వాడివి.. నీకు నేను పెట్టాల్సి వచ్చింది..అయ్యో! దేవుడా..’అని అంత్యక్రియల సమయంలో తన కుమారుడి మృతదేహం వద్ద భాస్కర్‌రెడ్డి గుండెలవిసేలా రోదించడం పలువురిని విచలితుల్ని చేసింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ నాల్గవ సంవత్సరం చదువుతున్న తిరుపతికి చెందిన బండారు వివేక్ (23) బుధవారం అక్కడ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం విదితమే. శుక్రవారం ఉదయం స్థానిక దేవేంద్ర థియేటర్ రోడ్డులోని హరిశ్చంద్ర శ్మశానవాటికలో దహనక్రియలు నిర్వహించారు. కుమారుడి చితికి నిప్పంటించిన సమయంలో భాస్కర్‌రెడ్డి..బాలాజీ.. బాలాజీ (వివేక్‌ను ముద్దుగా పిలిచే పేరు) అంటూ బిగ్గరగా రోదిస్తుంటే ఆయన్ను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.
మిత్రుడా! ఇక సెలవు
కిమ్స్ వైద్య కళాశాల నుంచి వివేక్ రూమ్‌మెంట్స్, సహచరులు, కిమ్స్ ఫిజికల్ డైరెక్టర్/హాస్టల్ ఇన్‌చార్జి నాగరాజ ఇక్కడ అంత్యక్రియల్లో వివేక్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. వివేక్ ఎంతో మంచి స్టూడెంట్, మిత భాషి అని, ఎప్పుడూ స్టడీస్, లైబ్రరీ తప్ప మరే ఇతర వ్యాపకాలు లేవని, మంచి డాక్టర్ అవుతాడని తామంతా భావించామని, అతను ఆత్మహత్య చేసుకోవడం ఇప్పటికీ తాము జీర్ణించుకోలేకపోతున్నామని కిమ్స్ ఫిజికల్ డైరెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. వివేక్ మిగిల్చిన జ్ఞాపకాల తడితో అక్కడి నుంచి సహచరులు అమలాపురానికి భారంగా కదిలారు.
వైద్య కళాశాలల్లో కౌన్సెలింగ్‌కు నాస్తి!
వైద్య కళాశాలల్లో మానసిక రుగ్మతలతో బాధపడే వారికి ఉద్దేశించిన కౌన్సెలింగ్‌కు ఏనాడో స్వస్తి పలికారని, కౌన్సెలింగ్ అంటూ ఉంటే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడే వారు కారని కొందరు సీనియర్ వైద్య ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఎస్వీ మెడికల్ కళాశాలలో కొన్నేళ్ల క్రితం కౌన్సెలింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారని, ఒత్తిళ్లతో సతమవుతున్న విద్యార్థులు తమ సమస్య ఏమిటో చెప్పడంతో దానికి పరిష్కారం చూపి, మంచి ఫలితాలు రాబట్టారని, తర్వాత కాలంలో ఎస్వీ మెడికల్ కాలేజీతో సహా ఏ కాలేజీ కూడా కౌన్సెలింగ్ జోలికి వెళ్లలేదని తెలిపారు. వివేక్ ఆత్మహత్య ఉదంతంతోనైనా ప్రభుత్వం మేల్కొనాలని హితవు పలికారు.