
సాక్షి, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యాక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ మంత్రులు పెద్ది రెడ్డి,మాజీ ఎంపీ వివేకానంద, బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తుందని, అందుకే ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలని టీఆర్‌ఎస్‌కు మరోసారి అవకాశం కల్పిస్తే కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమై అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్రంలో సారూ, కారు, సర్కారు.. అని చెప్పిన కేసీఆర్ బీరు, కారుకే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తెరాస, కాంగ్రెస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందంలో భాగంగానే కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం లేదని ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని, కేసీఆర్ 5వేల కోట్ల రూపాయల విలువ గల భవనాలను కూల్చివేసేందుకు కుట్రలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ఇక మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ.. కేసీఆర్ తన స్వార్థ ప్రయోజనాల కోసం తుమ్మిడి హేట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించకుండా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్ల ప్రాజెక్టుగా మార్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని, రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ యువకుల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజక వర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, తనపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment