హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఎమ్మెల్యే వివేక్ బుధవారమిక్కడ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినా పాలన గాడిలో పడలేదని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు దృష్టి పెట్టకపోవడంతోనే సమ్మెలు, ఉద్యమాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. ఉపాధి హామీ, మున్సిపల్, రెవిన్యూతోపాటు అన్ని శాఖ ఉద్యోగులు రోడ్డున పడ్డారన్నారు.
ఉద్యమ న్యాయకుడిగా అధికారులు, పాలకుల ఇళ్ల ముందు చెత్తవేయాలని గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. కేసీఆర్ చెప్పిన ఈ మాటలను ప్రస్తుతం మున్సిపల్ ఉద్యోగులు మళ్లీ ఆయనకే అప్పచెబుతున్నారన్నారు. వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ప్రజల సమస్యలు తీర్చాలని ఎల్.రమణ, వివేక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సోమేష్ కుమార్ అదికార పార్టీ తొత్తులా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఎల్ రమణ, వివేక్ ఆరోపించారు.